- బొగ్గు పెళ్ల కూడా దొంగతనం జరగలేదు
- 40 లక్షల టన్నులు మాయమైందనడం అబద్ధం
- పూర్వాపరాలు తెలుసుకుని మాట్లాడాలి
- బొగ్గు నిల్వలపై అనుమానం ఉంటే సీబీఐ విచారణ కోరవచ్చు
- సింగరేణి ప్రతిష్టను దెబ్బతీయొద్దు: కూనంనేని
విశాలాంధ్ర- హైదరాబాద్ : సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని బీఆర్‌ఎస్ మాజీ మంత్రి హరీశ్రావు చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని, ఒక్క బొగ్గు పెళ్ల కూడా దొంగతనం జరిగే అవకాశం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సింగరేణికి సంబంధించిన విషయాలపై ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్పైన, తనపైనా వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆ యూనియన్ గౌరవాధ్యక్షుడు కూనంనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూంభవన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… సింగరేణి సంస్థ విధివిధానాలకు రుణాలు లేదా రేటింగ్ కోసం 40 లక్షల టన్నుల బొగ్గు లేనిది ఉన్నట్టు చూపించినట్లు కనబడుతుందని, కానీ దొంగతనం జరిగినట్టు హరీశ్రావు మాట్లాడడం అభ్యంతరకరమన్నారు. “సింగరేణిలో ఇప్పుడు కుంభకోణం జరిగింది అంటే బీఆర్‌ఎస్ హయంలో 75 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఎక్కువ చూపించారు. నాడు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, నేడు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దాసోజు శ్రవణ్ కుమార్ 2017లో 75 లక్షల టన్నుల బొగ్గు ఎక్కువగా ఉన్నదని చూపెట్టారని, ఇది సత్యం కుంభకోణం వంటిదని ఆనాటి కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కె.చౌదరికి ఫిర్యాదు చేయడం జరిగిందని, ఇప్పుడు 45 లక్షల టన్నులు అయితే అప్పుడు 75 లక్షల టన్నుల బొగ్గు స్కామ్ కాదా” అని నిలదీశారు. ఏదైనా అంశం పై మాట్లాడేటప్పుడు దాని పూర్వాపరాలు తెలుసుకొని మాట్లాడాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు దొంగతనం జరిగింది అంటే అప్పుడు కూడా దొంగతనం చేసినట్టే కదా అని సాంబశివరావు ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరైందికాదని, అసత్యాలు చెప్పడం మానేసి, బొగ్గు నిల్వలపై అనుమానం ఉంటే సీబీఐ విచారణ కోరవచ్చని హరీశ్రావుకు సూచించారు. బొగ్గు నిల్వలపై ప్రతి ఆర్థిక సంవత్సరం ముగింపులో జరిగే అంశమని, దీనిపై సింగరేణి సంస్థను ఇప్పటికే హెచ్చరించామన్నారు. ఈ విషయాలతో తమకేమీ సంబంధంలేదని, హరీశ్రావుతో కూడా తనకు ఎలాంటి పంచాయితీ లేదని స్పష్టం చేశారు. టీజీబీకేఎస్ (తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం) సింగరేణి సంస్థ ప్రతిష్టను దెబ్బ తీయొద్దని, కార్మికులను అవమానించినట్టుగా మాట్లాడొద్దని హితవు పలికారు.
సమస్యలు పరిష్కరించకుంటే
ఆగస్టు 15 నుంచి సమ్మె
ప్రస్తుతం సింగరేణిలో నెలకొన్న సమస్యలు పరిష్కారం కాకపోతే ఆగస్టు 15 నుంచి సమ్మెకు పిలుపునిస్తామని సంస్థను హెచ్చరించినట్లు సాంబశివరావు వెల్లడించారు. తనను సింగరేణి పక్షమా… స్కామ్ పక్షమా అని హరీశ్రావు ప్రశ్నిస్తున్నారని, తాను ఎల్లప్పుడూ కార్మికుల పక్షమే అని స్పష్టం చేశారు. సింగరేణి పేరుతో రూ.26 వేల కోట్లు జెన్కో వంటి సంస్థల పేరుతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పులు చేసిందని, గత పదేళ్లు చేసిన తప్పలనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని కూనంనేని విమర్శించారు.
రాజకీయ లబ్ధి కోసమే టీబీజీకేఎస్ ఏర్పాటు
తెలంగాణ ఉద్యమ సమయంలో కేవలం రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని (టీబీజీకేఎస్) బీఆర్‌ఎస్ ఏర్పాటు చేసిందని, అనంతరం దానిని మూసివేశారని సాంబశివరావు గుర్తు చేశారు. కానీ 1948లో ప్రారంభమైన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఇప్పటికీ కార్మికుల పక్షాన పోరాటం చేస్తూనే ఉందని, కార్మికులకు అండగా నిలబడుతున్నదని అన్నారు. కార్మికుల హక్కుల పోరాటంలో అనేక మంది నాయకులు, కార్మికులు ప్రాణత్యాగం చేశారని తెలిపారు. ఒకటి రెండు సార్లు మాత్రమే టీజీబీకేఎస్ గెలిచిందని, గత 80 సంవత్సరాల నుంచి సజీవంగా ఉన్న యూనియన్ను కార్మికులు తమ గుండెల్లో పెట్టుకొని ఆదరిస్తున్నారన్నారు. అన్ని సందర్భాల్లో తమ యమూనియనే గెలిచిందన్నారు. సింగరేణి సంస్థలో 2014 కంటే ముందు రాజకీయ జోక్యం లేదని, బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే సంస్థలో రాజకీయ జోక్యం మొదలైందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో అది మరింతగా విస్తరించిందని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలో కేసీఆర్… 11 గనులు ఉన్న సింగరేణి సంస్థను 30 గనులుగా అభివృద్ధి చేయడంతో పాటు 67 వేలు ఉన్న కార్మికుల సంఖ్యను లక్షకు పెంచుతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ, పదేళ్ల పాలనలో గనుల సంఖ్యను పెంచకపోగా, కార్మికుల సంఖ్య 40 వేలకు తగ్గిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో దేశంలో ఎక్కడ గనులు ఉన్నా వాటిపై సింగరేణి సంస్థకే అధికారం ఉండేదని, కానీ 2015లో గనుల వేలం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మైన్స్, మినరల్స్ డెవలప్‌మెంట్ రెగ్యులేటరీ యాక్ట్ (ఎంఎండిఆర్) చట్టంతో వివిధ గనులపై ప్రైవేట్ సంస్థలకు అధికారం దక్కిందని, అందుకు అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా మద్దతు ప్రకటించిందనే విషయం ఆ పార్టీ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. తాడిచర్ల, రామకృష్ణాపురంలోని గనులను ఆనాడు ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పిందన్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా తన రాష్ట్ర నీటి వాటాలు వదులుకోవడానికి సిద్ధంగా ఉండరని సాంబశివరావు ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ… ప్రస్తుతం రాజకీయ పార్టీలు సింగరేణి సంస్థను రాజకీయ వేదికగా వాడుకుంటున్నాయని విమర్శించారు. బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు సింగరేణిపై మొసలి కన్నీరు కారుస్తున్నాయని, అసలు సింగరేణి సంస్థకు ఈ పార్టీలు ఏం చేశాయో చెప్పాలని సవాల్ చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో సింగరేణి సంస్థకు రూ.26 వేల కోట్లు అప్ప పెట్టిపోతే, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రూ.56 వేల కోట్లకు పెంచిందని విమర్శించారు. యూనియన్ కార్యదర్శి కె.రాజ్ కుమార్ మాట్లాడుతూ…11 ఏరియాల్లో (జిల్లాల్లో) విస్తరించి ఉన్న సింగరేణి ప్రాంతంలో రాజకీయంగా లబ్ధిÝ పొందేందుకు హరీశ్రావు …వర్కర్స్ యూనియన్, సాంబశివరావుపైన దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇకనైనా రాజకీయ జోక్యం తగ్గించి, సింగరేణిని పరిరక్షించాలని కోరారు.


