. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడి నేపథ్యంలో రష్యా తీవ్ర ఆందోళన
. తక్షణం భద్రతా మండలి భేటీకి పిలుపు
మాస్కో: ఇరాన్‌పై అమెరికా` ఇజ్రాయిల్ యుద్ధోన్మాదంతో దాడులు కొనసాగించడంపై రష్యా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తాజా పరిణామాలపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్య దేశాలు (పి-5) తక్షణమే భేటీ కావాలని పిలుపునిచ్చింది. ప్రపంచ భద్రత, సుస్థిరతపై చర్చించేందుకు పి-5లోని రష్యా, చైనా, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ భేటీ కావాలని తమ అధ్యక్షుడు పుతిన్ కోరుకుంటున్నారని రష్యా ప్రభుత్వ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ తెలిపారు. ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ పుతిన్ ప్రతిపాదన మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్య దేశాలు భేటీ కావాల్సిన అవసరం ఉందన్నారు. కోవిడ్-19 సంక్షోభ కాలానికి ముందు కూడా ఒకసారి ఇదే ప్రతిపాదనను పుతిన్ చేశారని ఆయన గుర్తు చేశారు. అంతర్జాతీయ న్యాయం అనేది దాదాపు నశించిపోయిందని, ఇలాంటప్పుడు అంతర్జాతీయ న్యాయంలోని నిబంధనలు, సూత్రాలను అనుసరించమని ఇతరులకు ఎలా చెప్పగలమో తనకు అర్థం కావడం లేదన్నారు. కనీసం అంతర్జాతీయ న్యాయం అంటే ఏమిటో నిర్వచించే పరిస్థితిలో కూడా ఇప్పుడెవరూ లేరని ఆయన తెలిపారు. వాస్తవానికి అంతర్జాతీయ న్యాయం అనేది ఇంకా మిగిలి లేదని పెస్కోవ్ పేర్కొన్నారు. కేవలం అది కాగితాలు, మాటలకు పరిమితమైందని, ఆచరణలో అస్సలు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ‘ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయిల్ దాడులు చేశాక పశ్చిమాసియా ప్రాంతంలో అస్థిర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ప్రాంతంలో సైనిక ఘర్షణలు కూడా పెరిగాయి. వీటి ఫలితంగా ప్రతికూలమైన రాజకీయ, ఆర్థిక పర్యవసానాలను మనం ఎదుర్కోవాల్సి వస్తుందని దిమిత్రీ పెస్కోవ్ హెచ్చరించారు. కాగా పశ్చిమాసియాలో జరుగుతున్న సైనిక ఘర్షణపై అమెరికా స్పష్టమైన ప్రకటనను విడుదల చేయాలని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ డిమాండ్ చేశారు. అమెరికా దీర్ఘకాలిక ప్రణాళిక ఏమిటో చెప్పాలన్నారు. తమ చర్యలు అంతర్జాతీయ నిబంధనలకు లోబడి ఉన్నాయా లేదా అనేది కూడా అమెరికా వివరించాల్సిందేనని ఆయన పేర్కొన్నారు.


