Tuesday, December 10, 2024
Homeఆంధ్రప్రదేశ్ఆచి తూచి ఎంపిక

ఆచి తూచి ఎంపిక

. ‘నామినేటెడ్‌’ మలి జాబితాపై సీఎం ముమ్మర కసరత్తు
. వందల్లో పోస్టులు..వేల సంఖ్యలో ఆశావహులు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : నామినేటెడ్‌ పదవుల ఎంపికపై కూటమి ప్రభుత్వం వడపోత ముమ్మరం చేసింది. తొలిదశలో 20 మందితో నామినేటెడ్‌ పోస్టుల జాబితా విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం, రెండో జాబితాలో కనీసం వంద మందికి తగ్గకుండా ఇచ్చేలా కసరత్తు నిర్వహిస్తోంది. రెండో విడత జాబితా ఎంపికపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా పార్టీ ముఖ్యులతో మూడు రోజులుగా సమావేశమవుతున్నారు. ఇప్పటికే పవన్‌ నుంచి రెండో జాబితా లో జనసేన నుంచి అవకాశం ఇచ్చే వారి పేర్లను సేకరించారు. అలాగే బీజేపీ వారి పేర్లు కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. వివిధ నామినేటెడ్‌ పోస్టుల కోసం ఒక్క తెలుగుదేశం పార్టీ నుంచే దాదాపు 30వేల పైచిలుకు నేతలు దరఖాస్తులు చేసుకున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బహిరంగంగా ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చేపట్టడంతో నేతలు పెద్దసంఖ్యలో బారులు తీరి దరఖాస్తు పెట్టుకున్నారు. దీనివల్ల పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి మరింత పెరిగింది. శాసనసభ ఎన్నికల్లో జనసేన, బీజేపీ పార్టీల ఎన్నికల పొత్తు కారణంగా టీడీపీ దాదాపు 31 స్థానాలను త్యాగం చేయాల్సి వచ్చింది. అలాగే ఎంపీ అభ్యర్థులు కూడా కొందరు తమ స్థానాలను పొత్తులో భాగంగా వదులుకున్నారు. వీరందరికీ న్యాయం చేస్తానని అప్పట్లో చంద్రబాబు వాగ్దానం చేశారు. వీరుగాక పార్టీ కోసం వైసీపీ ప్రభుత్వంలో అనేక కేసులు పెట్టించుకుని వీరోచిత పోరాటాలు చేసిన నేతలు కొందరున్నారు. వీరికి ప్రథమ ప్రాధాన్యతగా పోస్టులు కేటాయించనున్నారు. అయితే సామాజిక సమీకరణలు, కూటమి భాగస్వామ్యపక్షాలను పరిగణనలోకి తీసుకుని పదవుల కేటాయింపు చేపట్టనుండడంతో వడపోత కార్యక్రమం సీఎంకు సవాల్‌గా మారింది. తొలి జాబితాలో పేర్ల ప్రకటన తరువాత కొందరు నేతలు తమకు అవకాశం ఇవ్వకపోవటం పైన కినుక వహించారు. ఈ నేపధ్యంలో రెండో జాబితాలో జనసేన, బీజేపీ కోసం త్యాగం చేసిన నేతలతోపాటు, వైసీపీ ప్రభుత్వ వేధింపులు ఎదుర్కొని, జైలుకు వెళ్లిన వారికి ప్రాధాన్యత ఉంటుందని నేతలు చెబుతున్నారు. వివిధ కుల, వృత్తి సంఘాలకు కార్పొరేషన్‌ చైర్మన్లు కీలక నేతలకు, ద్వితీయశ్రేణి ముఖ్యనేతలను డైరెక్టర్లుగా నియమించనున్నారు. ఎక్కువ మంది నేతలు రాష్ట్ర స్థాయి పదవులు కోరుకుంటున్నారు. తొలి జాబితాలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా డైరెక్టర్ల పదవులు కేటాయించడంతో… వారిలో కొందరు తమకు ఆ పదవులు అవసరం లేదని, పార్టీలో పని చేస్తామని ప్రకటించారు. దీంతో ఈ సారి జాబితాను అన్ని కోణాల్లోనూ ఆచి తూచి ఎంపిక చేస్తున్నారు. అయితే కచ్చితంగా సీట్లు దక్కని సీనియర్లకు ఈసారి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.ఈ నెల 11వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండడంతో ఈ లోగానే నామినేటెడ్‌ పదవుల జాబితా విడుదల చేసినా ఆశ్చర్యం లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు