Homeఇది ప్రజాస్వామ్యమేనా?

ఇది ప్రజాస్వామ్యమేనా?

- Advertisement -

ఈసీల నియామకంపై సుప్రీం ప్రశ్న

న్యూదిల్లీ: భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియలో ప్రజాస్వామ్యం ఎక్కడుందని జస్టిస్ దీపాంకర్ దత్తా ప్రశ్నించారు. ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, కేబినెట్ మంత్రితో కూడిన కమిటీ ప్రధాన ఎన్నికల కమిషనర్, కమిషనర్ల నియామకంపై నిర్ణయం తీసుకుంటోంది. నియామక ప్రక్రియపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ దత్తా కీలక ప్రశ్నలు సంధించారు. సీబీఐ డైరెక్టర్ నియామక ప్యానెల్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యుడిగా ఉన్నప్ప్పుడు… ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సజావుగా సాగేందుకు ఉద్దేశించిన ఎన్నికల సంఘం విషయంలో మాత్రం ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. ప్యానెల్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాలని అనుకోవడం లేదని, అలాగని స్వతంత్ర సభ్యుడు ఎందుకు ఉండకూడదని ధర్మాసనం ప్రశ్నించింది. ‘ప్రధానమంత్రి ఒక వ్యక్తిని నియమిస్తే… లోక్‌సభలో ప్రతిపక్ష నేత మరొకరిని నియమిస్తారు. ఇలా ఏకాభిప్రాయం కుదరనప్ప్పుడు మూడో వ్యక్తిగా ఉన్న కేబినెట్ మంత్రి ప్రతిపక్ష నేతకు మద్దతు తెలుపుతారా అని దీపాంకర్ దత్తా అటార్నీ జనరల్‌ను ప్రశ్నించారు. ఆచరణలో అన్ని సందర్భాల్లో అలా జరగకపోవచ్చంటూ అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి సమాధానం ఇచ్చారు. ప్రధానమంత్రి నిర్ణయాన్ని కేబినెట్ మంత్రి వ్యతిరేకించే అవకాశం లేనందున 2:1 మెజారిటీతో నియామకం జరిగిపోతోందని జస్టిస్ దీపాంకర్ దత్తా అన్నారు. ప్రతిపక్ష నాయకుడి పాత్రను కేవలం అలంకారప్రాయంగా మార్చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పనిచేయడమే కాకుండా… అది స్వతంత్రంగా ఉన్నట్లు ప్రజలకు కనిపించాలని ధర్మాసనం పేర్కొంది. ఈ చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను కోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు