Homeఅంతర్జాతీయంఇమ్రాన్‌ను కలిసేందుకు వైద్యుల్ని అనుమతించట్లేదు

ఇమ్రాన్‌ను కలిసేందుకు వైద్యుల్ని అనుమతించట్లేదు

- Advertisement -

మాజీ ప్రధాని సోదరి అలీమా ఆగ్రహం
ఇస్లామాబాద్: ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం క్షీణిస్తోందని, జైలులో ఆయన పట్ల షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకరంగా ఉందని ఇమ్రాన్ సోదరి అలీమా ఖానుమ్ మండిపడ్డారు. ఇమ్రాన్ ఖాన్ 800 రోజులుగా జైలు శిక్ష అనుభవిస్తున్న క్రమంలో తన సోదరుడి ఆరోగ్య పరిస్థితిపై అలీమా ఖానుమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇమ్రాన్‌ఖాన్‌కు అతడి వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఆసిమ్ యూసుఫ్‌తో ఒక కుటుంబ సభ్యుడి సమక్షంలో చికిత్స అందించాలని తాము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. కుటుంబం తరపున హాజరయ్యేందుకు తాము సూచించిన డాక్టర్ల పేర్లను ప్రభుత్వం తిరస్కరిస్తోందని ఆమె ఆరోపించారు. మొదట ఉజ్మాఖాన్ పేరును ప్రతిపాదించగా ప్రభుత్వం తిరస్కరించిందని, అ తర్వాత స్వయంగా వారి బంధువు ప్రముఖ వైద్యుడు బుర్కీ పేరు ఇవ్వగా… ఆయనను కూడా అనుమతించకపోవడంపై అలీమా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఆమోదయోగ్యం కాదని, కుటుంబ సభ్యులను ఎందుకు అనుమతించడంలేదంటూ ప్రశ్నించారు. తాము సూచించిన డాక్టర్లు అర్హత కలిగిన వైద్యులు కావడమే కారణమా అని అన్నారు. ఈనెల 12న తన కుడి కన్ను కేవలం 15 శాతం మాత్రమే చూడగలుగుతుందని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడానికి వైద్య బోర్డును ఏర్పాటు చేయాలని సూచించింది. అంతేకాకుండా ఫిబ్రవరి 16లోపు తన పిల్లలతో మాట్లాడుకునే అనుమతి ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు స్థానిక మీడియాకు తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆదివారం ఐదుగురు డాక్టర్లతో కూడిన వైద్య బృందం ఇమ్రాన్?ఖాన్ పరీక్షించినట్లు చెప్పాయి. దాదాపు గంటపాటు కంటి పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నాయి. కంటితో పాటు రక్త నమూనాలు సేకరణ, రక్తపోటు వంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపాయి. తదుపరి చికిత్స జైల్లోనే కొనసాగాలా లేదా ఆస్పత్రికి తరలించాలా అన్నది బోర్డు నిర్ణయించనుందని వెల్లడించాయి. ఆదివాం మధ్యాహ్నం 3:45 గంటలకు ఇమ్రాన్‌ను ఆస్పత్రికి తరలించడానకి జైలుకు అంబులెన్స్ వచ్చిందని ఆయన సోదరి నోరీన్ ఖానుమ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అయితే ఆ వార్తలను జైలు సూపరింటెండెంట్ ఖండించారు. ఇది కేవలం పరీక్ష మాత్రమే అని ఆస్పత్రికి తరలింపు లాంటివి ఏం లేవని స్పష్టం చేశారు. కాగా, కుటుంబ సభ్యులు, వ్యక్తిగత వైద్యులు లేకుండానే ఇమ్రాన్‌కు వైద్య పరీక్షలు జరపడం దురుద్దేశపూరిత చర్య అని ఇమ్రాన్ పార్టీ పీటీఐ ఆరోపించింది. పార్టీ నాయకత్వానికి సమాచారం ఇచ్చామని ప్రభుత్వం చెప్పడం ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నమని విమర్శించింది. ఇలాంటి సున్నిత వైద్య నిర్ణయాలు కుటుంబం తీసుకోవాల్సిందే అని తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇమ్రాన్ ఆరోగ్యంపై క్రికెటర్ల ఆందోళన
మరోవైపు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజాలు వసీం అక్రం, వకార్ యూనిస్ ఆందోళ వ్యక్తం చేశారు. వెంటనే ఆయనకు వైద్య సహాయం అందించాలని కోరారు. తమ కెప్టెన్ ఇమ్రాన్‌ఖాన్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వినడం బాధగా ఉందని వసీం అక్రమ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని నాణ్యమైన వైద్య చికిత్స అందించాలని తెలిపారు. దేశానికి గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చిన జాతీయ హీరో ఆరోగ్య అత్యవసర పరిస్థితిలో ఉన్నారని వకార్ యూనస్ తెలిపారు. ఆయనకు సరైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులను కోరారు. అనేక కేసులు ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఖాన్ ఆగస్టు 2023 నుంచి జైలులో ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు