నాలుగు నదులు దాటుకుంటూ ప్రవాహం
పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి సరఫరా
2.87 లక్షల ఎకరాలకు సాగునీరు
5.23 లక్ష మందికి తాగునీరు
నేడు పాయకరావుపేట వద్ద సీఎం జల హారతి
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా గోదారమ్మ ఉత్తరాంధ్రవైపు పరుగులు పెట్టనుంది. నాలుగు నదులు దాటుకుంటూ… తూర్పు కనుమలు చీల్చుకుంటూ గోదారి ఉత్తరాంధ్ర ప్రాంతానికి కదలి రానుంది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం పోలవరం ఎడమ కాలువ ద్వారా వచ్చిన గోదావరి జలాలకు హారతి ఇచ్చి స్వాగతం పలకనున్నారు. కాలువపై నిర్మించిన రెగ్యులేటర్‌ను ఆన్ చేసి గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు విడుదల చేయనున్నారు. అనంతరం సమీపంలోనే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
నదులు… కొండలు దాటుకుని గోదావరి పరుగులు
ఎడమ ప్రధాన కాలువ ద్వారా విడిచి పెడుతున్న నీటి ద్వారా మొత్తం నాలుగు జిల్లాల పరిధిలోని 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. 5.23 లక్షల మంది దాహార్తి తీరనుంది. ఎడమ కాలువ నిర్మాణం కోసం ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం రూ.4,192 కోట్లు ఖర్చు చేసింది. పోలవరం ఎడమ కాలువ ద్వారా ప్రవహిస్తున్న గోదావరి జలాలు ఈ జిల్లాల్లో ఉన్న పంపా, తాండవ, వరాహ, శారద నదులు దాటుకుని ఏలేరు కాలువ, తూర్పు కనుమలపై సంక్లిష్టమైన నిర్మాణాల మీదుగా ఉత్తరాంధ్రకు చేరుకోనున్నాయి. పోలవరం ఎడమ కాల్వ నిర్మాణంలో భాగంగా వివిధ నదీ ప్రవాహాల వద్ద సైఫన్లు, అకిÇడెకుట్లను జలవనరుల శాఖ నిర్మించింది. ఈ నదుల ప్రవాహానికి కొన్ని చోట్ల ఎగువన… ఇంకొన్ని చోట్ల ప్రవాహానికి దిగువ నుంచి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ నిర్మాణం జరిగింది. ఏలేరు నది బెడ్ లెవల్‌కు దిగువన గోదావరి జలాలు తరలించేందుకు సైఫన్ నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టింది. పంపా నది ఎగువ నుంచి అకిÇడెక్ట్ నిర్మించి పోలవరం ఎడమ కాల్వ ద్వారా గోదావరి జలాలకు ఇంజినీర్లు మార్గం సుగమం చేశారు. పంపా నదిపై అకిÇడెక్ట్ నిర్మాణానికి 30 మీటర్ల లోతు వరకు 312 పైల్స్‌తో పునాదుల వేసి అకిÇడెక్ట్ నిర్మించారు. 10,634 క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యాన్ని తట్టుకునేలా తాండవ నదిపై 6 వెంట్లతో 447 మీటర్ల పొడవున అకిÇడెకుట్ నిర్మాణం చేపట్టారు.
భవిష్యత్తులో 8 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ
ఎడమ కాల్వ ద్వారా విడుదల చేస్తున్న గోదావరి జలాలతో అనకాపల్లి జిల్లాలో 1.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం కలగనుంది. పాయకరావుపేట అకిÇడెకుట్ నుంచి సీఎం విడుదల చేయనున్న జలాలు అనకాపల్లి వద్ద ఏలేరు కాలువతో పాటు జిల్లాలోని 110 చెరువులు నింపేలా జలవనరుల శాఖ ప్రణాళిక చేసింది. గోదావరి జలాలతో పుష్కర ఆయకట్టు పరిధిలో 1.48 లక్షల ఎకరాలు, ఏలేరు కింద 80 వేల ఎకరాలు, పంపా కింద 12 వేల ఎకరాలు, తాండవ, వరహా, మామిడి గెడ¦ ఆయకట్టు పరిధిలో ఉన్న 46,620 ఎకరాల స్థిరీకరణ జరగనుంది. మొత్తంగా 23.44 టీఎంసీల గోదావరి జలాలు సాగు, తాగు నీటితో పాటు విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని పారిశ్రామిక అవసరాలకు వినియోగించేలా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో అనుసంధానించేలా 213 కిలోమీటర్ల పొడవున పోలవరం ఎడమ ప్రధాన కాలువ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో అనుసంధానం ద్వారా అనకాపల్లి, విశాఖ, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల ఎగువ ప్రాంతాలకు గోదావరి నీరు తరలించేలా ప్రభుత్వం ప్రణాళికలు చేసింది. తద్వారా ఎడమ ప్రధాన కాలువ సహా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొత్తం 8 లక్ష ఎకరాలకు సాగునీరు, ఆ ప్రాంత ప్రజలకు తాగునీరు అందించేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది.


