భక్తి, ధర్మ ప్రచారానికి జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు
ఘనంగా ప్రథమ పుణ్యస్మరణోత్సవం
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ గవిమఠం పీఠాధిపతిగా ఆధ్యాత్మిక, ధార్మిక రంగాలకు విశేష సేవలందించిన లింగైక్య జగద్గురు చెన్నబసవ రాజేంద్ర మహాస్వామి సేవలు చిరస్మరణీయమని వివిధ మఠాలకు చెందిన పీఠాధిపతులు, ప్రముఖులు కొనియాడారు. ఆయన చూపిన ఆధ్యాత్మిక మార్గం భక్తజనులకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. లింగైక్య జగద్గురు చెన్నబసవ రాజేంద్ర మహాస్వామి ప్రథమ పుణ్యస్మరణోత్సవాన్ని గురువారం ఉరవకొండ గవిమఠం ఆవరణలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భక్తులు, పీఠాధిపతులు స్వామివారి ఆధ్యాత్మిక సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా గవిమఠం ఉత్తరాధికారి జగద్గురు కరిబసవ రాజేంద్ర స్వామి, ఆదోని చౌకీమఠం పీఠాధిపతి కళ్యాణ మహాస్వామి తదితరులు మాట్లాడుతూ.. చెన్నబసవ రాజేంద్ర మహాస్వామి గవిమఠం పీఠాధిపతిగా కొనసాగుతూ అనేక ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలను నిర్వహించారని తెలిపారు. తన ఆధ్యాత్మిక బోధనలు, సేవా కార్యక్రమాల ద్వారా ఎందరో భక్తులను ధర్మం, ఆధ్యాత్మికత వైపు నడిపించారని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో వేలాది మంది భక్తులు, శిష్యులను సంపాదించుకున్న స్వామివారి ఆధ్యాత్మిక ప్రభావం చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. కుల, మతాలకు అతీతంగా మానవతా విలువలను, ధర్మాచరణను ప్రోత్సహించడం ఆయన జీవిత పరమార్థంగా నిలిచిందన్నారు. స్వామివారు చూపిన మార్గంలో పయనిస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గవిమఠం దేవస్థానాన్ని స్వామివారి ఆశయాలకు అనుగుణంగా మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని పిలుపునిచ్చారు. ఆధ్యాత్మిక చైతన్యం, ధార్మిక సేవ, మానవతా విలువల కోసం స్వామివారు చేసిన కృషి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంగమ కార్పొరేషన్ చైర్‌పర్సన్ తుల్జాపూర్ స్వప్న, ఉరవకొండ పీఏసీఎస్ చైర్మన్ ప్యారం కే. శివానంద, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయభాస్కర్, మాజీ సర్పంచ్ బోధపాటి గోవిందప్ప, మోపిడి గోవిందు, ఆలయ సహాయ కమిషనర్ సుధారాణి, ఆలయ సిబ్బంది నారాయణస్వామి గోపి మధు వీరశైవ, జంగమ సంక్షేమ సంఘం ప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వివిధ మఠాల పీఠాధిపతులు, అధ్యక్షులు, ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మ తొలి దైవం సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.


