విశాలాంధ్ర-కుత్బుల్లాపూర్: మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కష్టపడాలని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మేడ్చల్ నియోజకవర్గం పరిధి అలియాబాద్ మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్-మల్కాజ్‌గిరి పార్లమెంటరీ ఇంచార్జి,రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రచారనికి హాజరై సందర్బంగా డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రశ్ యాదవ్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి కలిసి ఘన స్వాగతం పలికారు. అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన భారీ రోడ్‌షోలో కాంగ్రెస్ పార్టీ జెండాలతో వీధులు మార్మోగిపోయాయి.ప్రజల నుంచి వెల్లువెత్తిన మద్దతు కాంగ్రెస్ పార్టీపై ఉన్న విశ్వాసానికి నిదర్శనంగా నిలిచింది. ఈ సందర్భంగా మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అలియాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి వెనుకబడిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రైతులు, కార్మికులు, మహిళలు, యువతకు ఉపయోగపడే పథకాలను అమలు చేస్తూ ప్రజా ప్రభుత్వంగా ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి,సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో ప్రత్యక్ష మార్పు తీసుకువచ్చాయన్నారు. దీనిని కార్యకర్తలు ప్రతి గడపకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి అలియాబాద్, మూడు చింతలపల్లి ఎల్లంపేట్, మున్సిపాలిటీల పై కాంగ్రెస్ జెండా ఎగరవేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తదని ఆయన తెలిపారు. అలియాబాద్,మూడు చింతలపల్లి, ఎల్లంపేట్ మున్సిపాలిటీల చైర్మన్ పదవిని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని,నిజమైన అభివృద్ధి పాలనకు నాంది పలకాలని కార్యకర్తలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గట్టి పిలుపునిచ్చారు.


