కూనంనేని సాంబశివరావు
ఎన్నో కుట్రలు, ఎన్నెన్నో నిర్బంధాలు ఉరికొయ్యలను ఛేదించి చెరసాలల్లో పురుడు పోసుకొని భారత గడ్డపై నిండు నూరేళ్లు జీవించిన త్యాగాల గని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ). 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్లో ఆవిర్భవించి 2025 డిసెంబర్ 26 నాటికి వందేళ్లు పూర్తి చేసుకున్న భారత కమ్యూనిస్టు పార్టీ శత వసంతాల వేడుకలను లక్షలాది మందితో కమ్యూనిస్టుల పురిటిగడ్డ అయిన ఖమ్మం పట్టణంలో ఈ నెల 18వ తేదీన జరపడానికి భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయించింది. భారతదేశ చరిత్రలో మహత్తర ఘట్టంగా నిలవబోతున్న ఈ భారీ బహిరంగ సభకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది హాజరవుతున్నారు. 10 వేల మంది అరుణసైన్యం కవాతు చేయబోతన్నది. ఎర్ర సముద్రంగా మారబోతున్న ఖమ్మం బహిరంగ సభకు భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా హాజరవుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సౌహార్ధ సందేశం ఇవ్వబోతున్నారు. నాలుగు రోజుల పాటు జరుగుతున్న ఉజ్వల వేడుకలలో 20 వ తేదీన నిర్వహించే సెమినార్‌కు డి.రాజాతో పాటు సీపీిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి బేబి, సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, ఫార్వార్డ్ బ్లాక్ ప్రధాన కార్యదర్శి దేవరాజన్, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి మనోజ్ భట్టాచార్య, తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమత్రి భట్టి విక్రమార్క హాజరవుతున్నారు. కంసుడు శ్రీకృష్ణుడిని పుట్టుకతోనే అంతం చేయ ప్రయత్నించిన విధంగా భారత కమ్యూనిస్టు పార్టీని చెరసాలలోనే పసిగుడ్డు ప్రాయంలోనే బ్రిటీష్ సామ్రాజ్యవాద ప్రభుత్వం అంతమొందించే ప్రయత్నం చేసింది. తుదకు బ్రిటీష్ సామ్రాజ్యవాదాన్ని మట్టి కరిపించడంలో కమ్యూనిస్టు పార్టీ వీరోచిత పోరాటాలు, త్యాగాలు చేసింది.
కమ్యూనిస్టు పార్టీ పుట్టుక అవలోకనం : సీపీఐ పుట్టుకే శ్రామిక అంతర్జాతీయత, దేశభక్తితో మిళితమై ఉంది. వివిధ విభాగాలుగా ఉన్న దేశ భక్తులను, స్వాతంత్య్ర సమరయోధులను కమ్యూనిజం వైపు తీసుకువచ్చింది. ఆ విధంగా కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటులో నాలుగు ప్రధాన స్రవంతులు కలిశాయి.
1) మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో విదేశాల నుంచి ఆ తర్వాత జర్మనీ, అమెరికా, టర్కీ, అఫ్గానిస్థాన్‌లో విప్లవ కార్యాచరణలో ఉన్న భారత జాతీయ విప్లవకారులు అక్టోబర్ విప్లవ ప్రభావం కిందకు వచ్చారు. యం.చటోపాధ్యాయ, బర్కాతుల్లాఖాన్, ఎంపిపిటి ఆచార్య, ఎం.ఎన్.రాయ్, అభని ముఖర్జిలు ఒక స్రవంతి.
2) సామ్రాజ్యవాదులు ఖలీఫాలపై జరిపిన అన్యాయాలకు వ్యతిరేకంగా ఇండియాలోని ముస్లిం ప్రజలు యుద్దకాలంలో (1914-16) విదేశాలకు వెళ్లి విస్తృత ఇస్లామిక్ ఖిలాఫత్ ఉద్యమాన్ని నిర్మించిన ఉద్యమకారులు యుద్ధానంతరం మహత్తర హిజ్రత్ ఉద్యమానికి సంబంధించిన జాతీయ విప్లవకారులు కూడా అక్టోబర్ విప్లవ ప్రభావం కిందకు వచ్చారు. వారిలో మహ్మద్ అలీ సెపస్సీ, రహమత్ అలీఖాన్, ఫిరోజుద్దీన్ మల్సూర్, అబ్దుల్ మాజీద్, షౌకత్ ఉస్మానీ ముఖ్యులు.
3) స్వాతంత్య్ర సాధనలో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని సాగించే ఆలోచనతో విదేశాల నుంచి ఆయుధాల సేకరణకు కొన్ని గ్రూపులు విదేశాలకు వెళ్లాయి. కెనడా, అమెరికా తదితర దేశాల్లో స్థిరపడిన భారతీయులు ముఖ్యంగా పంజాబీలు 1913లో శాన్‌ఫ్రాన్సిస్కోలో ‘గదర్ పార్టీ’ స్థాపించారు. కామా గాటా మారు అనే ఒక ఓడను ఆయుధాలతో ఇండియాకు పంపించారు. ఆ పోరాటం విఫలమైన తర్వాత గదర్ పార్టీ ముఖ్యులందరూ భారత కమ్యూనిస్టు పార్టీలో చేరారు. వీరిలో రతన్ సింగ్, సంతోష్ సింగ్, తెలుగువాడైన దర్శి చెంచయ్యలాంటి అనేక మంది ఉన్నారు.
4) భారతదేశంలో ఉన్న జాతీయ విప్లవకారులు, జాతీయ కాంగ్రెస్‌లో అంతర్భాగంగా పనిచేస్తున్న సోషలిస్టు కాంగ్రెస్ పార్టీలోని అనేక మంది, అతివాదపక్షం, టెర్రరిస్టు సంస్థలు, ఖిలాఫత్ ఉద్యమ నాయకులు, గదర్ పార్టీ నాయకులు 1921-22 లో శాసనోల్లంఘన ఉద్యమం విఫలమయిన తర్వాత గాంధీజీ ప్రతిఘటన సిద్దాంతం పట్ల భ్రమలు కోల్పోయిన వ్యక్తులు, బృందాలు అక్టోబర్ విప్లవ ప్రభావంతో శాస్త్రీయ సోషలిజం వైపు ఆకర్షితులయ్యారు. ఆ తర్వాత వీరే దేశంలో తొలి కమ్యూనిస్టు గ్రూపుల స్థాపకులయ్యారు. బొంబాయిలో డాంగే, మద్రాసులో సింగార్వేల్ చెట్టియార్, కలకత్తాలో ముజఫర్ అహ్మద్, లాహోర్లో ఇంక్విలాబ్ గ్రూపులకు చెందిన గులాం హుస్సేన్ తదితరుల కలయికతో 1925 డిసెంబర్ 26 న కాన్పూర్లో కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు అయ్యింది. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో, రైతాంగ పోరాటాలలో, స్వదేశీ సంస్థానాల్లో విముక్తి పోరాటాల్లోÑ సంఘ సంస్కరణలు, సామాజిక మార్పుల కోసం జరిగిన పోరాటాల్లో ఇంకా అనేక రీతుల్లో జరిగిన భారత ప్రజల విప్లవ ఉద్యమంలో పాల్గొన్న వారిలో అధికులు కమ్యూనిస్టు ఉద్యమంలో చేరారు.ఎంఎన్.రాయ్ ఆధ్వర్యంలో 1920 లో రష్యాలోని తాష్కెంట్లో భారత కమ్యూనిస్టు పార్టీ అనే పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశారు. సంస్థాపక సమావేశంలో ఏడుగురు పాల్గొన్నారు. వారు ఎంఎన్.రాయ్, ఎలెన్ రాయ్, అభని ముఖర్జి, రోజా ఫిటింగోవ్, ఎంపిడిటి ఆచార్యులు ఉన్నారు. కార్యదర్శిగా మహ్మద్ షఫి ఎన్నికయ్యారు. ఎం.ఎన్.రాయ్ కృషిని గుర్తించినప్పటికి 1925 లో విదేశీ గడ్డపైన ఏర్పాటైన ఆ తేదీని పార్టీ సంస్థాపక తేదీగా పరిగణించరాదని ఉమ్మడి పార్టీ రోజుల్లోనే కేంద్ర కార్యదర్శి వర్గం అభిప్రాయపడిరది. ఆ విధంగా 1925 డిసెంబర్ 26 న సత్యభక్త ఆధ్వర్యంలో కాన్పూర్లో జరిగిన మహాసభలో ఏర్పాటైన కమ్యూనిస్టు పార్టీని సంస్థాపక దినోత్సవంగా గుర్తించారు. సింగార్వేల్ చెట్టియార్ మహాసభకు అధ్యక్షత వహించారు. ఎస్.వి.ఘాటే, జెపి భాగర్లూతా కార్యదర్శులుగా ఎన్నికయ్యారు. పుట్టిన పసిగుడ్డును పొత్తిళ్లలోనే చంపే కుట్రలో కమ్యూనిస్టులపై ఎన్నో కేసులు పెట్టారు. అందులో ముఖ్యమైనవి 1922 నాటి పెషావర్ కుట్ర కేసు. 1924 నాటి కాన్పూర్ కుట్రకేసు కాన్పూర్ కుట్ర కేసులో ముజఫర్ అహ్మద్, ఢాంగే, షౌకత్ ఉస్మానీ ఇరికించారు.
చరిత్రాత్మక మీరట్ కుట్ర కేసు : 1929 లో కలకత్తాలో అఖిల భారత కార్మిక మహాసభ జరిగిన తర్వాత బ్రిటీష్ ప్రభుత్వం 31 మంది కమ్యూనిస్టు నాయకులకు, ఇతర పెద్ద నాయకులనందరిని అరెస్టు చేసింది. ఈ కేసు విచారణ 1929 నుంచి 1933 వరకు నాలుగేళ్లు కొనసాగింది. కోర్టును ప్రచార వేదికగా తమ సైద్ధాంతిక విస్తరణకు కమ్యూనిస్టులు మీరట్ కుట్ర కేసును ఉపయోగించుకున్నారు.
లాహోర్ కుట్రకేసు : సైమన్ కమీషన్‌కు వ్యతిరేకంగా ఊరేగింపునకు నాయకత్వం వహిస్తున్న పంజాబ్ కేసరి లాలా లజపతిరాయ్‌పై బ్రిటీష్ పోలీసులు విచ్చలవిడిగా లాఠీఛార్జి చేయడంతో ఆయన మరణించారు. దానికి కారకుడైన శాండర్స్‌ను 1928 డిసెంబర్ 17 న భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్, రాజ్‌గురు లాహోర్లో కాల్చి చంపారు. దీనికితోడు కేంద్ర శాసనసభలో 1929 ఏప్రిల్ 8న పార్టీ ఆదేశానుసారం భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్తు బాంబులు వేశారు. రెండు సంవత్సరాలు జరిగిన కోర్టు విచారణ సందర్భంగా దేశభక్తి గేయాలు పాడుకుంటూ, విప్లవం వర్ధిల్లాలి (ఇంక్విలాబ్ జిందాబాద్) అనే నినాదాలతో ‘మేరా రంగ్ దే బసంతి ఛోళా’ అనే పాటతో ఈ విప్లవ వీరులు కోర్టు హాల్లోకి ప్రవేశించేవారు. తదనంతరం 1931 మార్చి 23 న భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఉరితీశారు. తదనంతరం భగత్ సింగ్ సహచరులు అందరూ కమ్యూనిస్టు పార్టీలో చేరారు.
కమ్యూనిస్టు పార్టీ నిషేధం : కమ్యూనిస్టు ఉద్యమాన్ని ప్రమాదకరంగా భావించిన బ్రిటీష్ ప్రభుత్వం 1934 జులైలో పార్టీని నిషేధించింది. ఈ నేపథ్యంలో 1932-34లో కమ్యూనిస్టులు కాంగ్రెస్‌లో అంతర్భాగంగా కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. అంతిమంగా సోషలిస్టు కాంగ్రెస్‌లోని కమ్యూనిస్టులతో పాటు మరెంతోమంది అభివృద్ది కాముకులు అక్టోబర్ విప్లవ ప్రభావంతో కాంగ్రెస్‌లోని వామపక్ష గ్రూపుగా ఏర్పడ్డారు. తదనంతరం అనేక మంది కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ నాయకులు సీపీఐలో చేరారు. వీరిలో ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్, చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, ఎ.కె.గోపాలన్, కంభంపాటి సీనియర్, రావి నారాయణరెడ్డి, బద్ధం ఎల్లారెడ్డి ప్రముఖులు.
కమ్యూనిస్టు పార్టీ చేసిన వీరోచిత పోరాటాలు : ఒకనాటి అస్సాం రాష్ట్రం ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న చాబర్ సిల్హెట్ జిల్లాలోని లోయ ప్రాంతంలో వీరోచిత కౌలు రైతుల పోరాటాలు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగాయి. ఆ పోరాటవీరులు అనేక మంది కమ్యూనిస్టు పార్టీలో చేరారు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా వర్లీ తెగకు చెందిన ఆదివాసీలు తిరుగుబాటు చేశారు. 1946 లో రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటుదారులు కమ్యూనిస్టు పార్టీ జెండాను చేతబూనారు. పశ్చిమబెంగాల్లోని కౌలు రైతులు చేసిన పోరాటం ‘‘తెభాగా’’ పోరాటం పేరుతో చరిత్ర ప్రసిద్ధమైంది. కేరళలోని తిరువాన్‌కూర్ సంస్థానంలో కొబ్బరిపీచు కార్మికుల, వ్యవసాయ కార్మికుల, మత్స్య కార్మికుల వీరోచిత పోరాటానికి పున్నప్ర వాయిలార్ (మలబార్) పోరాటంగా ప్రసిద్ధి. ఫ్రెంచ్ వలస పాలన నుంచి పుదుచ్ఛేరీ విముక్తి పోరాటం కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగి విజయవంతమైంది. ఈనాడు పుదుచ్ఛేరిలో కమ్యూనిస్టు అగ్రనాయకులైన సుబ్బయ్యను ఆ రాష్ట్ర విముక్తి ప్రధాతగా గౌరవిస్తారు. భగత్ సింగ్ లాంటి జాతీయ విప్లవకారులు సోషలిస్టు సిద్ధాంతం పట్ల ప్రభావితమయ్యారు. చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ తదితరులు హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లిక్ పార్టీని ఏర్పాటు చేశారు. తదనంతర కాలంలో భగత్ సింగ్ సహచరులైన అజయ్ ఘోష్, శివవర్మ, పండిత్ కిశోరీలాల్, విజయ కుమార్ సిన్హా, జయ్‌దేవ్ కపూర్, భగవతి చరణ్ ఛోప్రా, సుఖ్‌దేవ్ లాంటి వారు సీపీిఐలో చేరారు.
చిట్టగాంగ్ పోరాట యోధులు : చిట్టగాంగ్ పోలీస్ స్టేషన్‌లోని ఆయుధ కారాగారంపై దాడిచేసి ఆయుధాలను స్వాధీనం చేసుకున్న కేసులో 1934 జనవరి 12 న అనేక మందిని ఉరి తీశారు. మిగిలినవారు కమ్యూనిస్టు పార్టీలో చేరారు. చిట్టగాంగ్ పోరాట యోధురాలు కల్పనా జోషి బహుకాలం పాటు సీపీిఐ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన పిసి జోషిని వివాహం చేసుకున్నారు.
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం : 1946-51 మధ్య జరిగిన ఈ పోరాటం చరిత్రలో రక్తాక్షరాలతో లిఖించిన సాయుధ పోరాటం. మూడు వేల గ్రామాల విముక్తి, 10 లక్షల ఎకరాల భూమి రైతాంగానికి పంపిణీ, వెట్టి చాకిరి రద్దు లాంటి అనేక విజయాలు ఈ పోరాట విజయాలు. ప్రధానంగా నిజాం నవాబు లొంగిపోవడం, హైద్రాబాద్ రాష్ట్రం భారత్‌లో విలీనం సాయుధ పోరాట ప్రభావంతోనే జరిగాయి. విలీనం తర్వాత భారత సైన్యం, పోలీసులు కమ్యూనిస్టులపై దాడులకు పాల్పడటంతో జరిగిన రైతాంగ గెరిల్లా పోరాటంలో 4000 మందికి పైగా కమ్యూనిస్టులు మృతిచెందారు. 10 వేల మందిని డిటెన్షన్ క్యాంపుల్లో పెట్టి మూడు, నాలుగు సంవత్సరాల పాటు చిత్రహింసలకు గురిచేశారు. మహిళలతో నగ్నంగా బతకమ్మలాడిరచారు. అన్ని నిర్బంధాలను తట్టుకొని నిలబడటమే కాకుండా 1952 లో జరిగిన ఎన్నికల్లో అటు మద్రాస్ రాష్ట్రంలోనూ, ఇటు హైద్రాబాద్‌లోని తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టులు కాంగ్రెస్ కంటే అధిక స్థానాలు సాధించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల్లో (1946`51) కృష్ణాజిల్లాలో 102 మంది, గుంటూరు జిల్లాలో 70 మంది, కడప జిల్లాలో 7గురు, తూర్పుగోదావరి జిల్లాలో 15 మంది, పశ్చిమగోదావరి జిల్లాలో 27 మంది, తెలంగాణ సాయుధ పోరాటానికి సహకారం అందిస్తున్న నేపధ్యంలో అమరులయ్యారు.
తెలుగు రాష్ట్రాలలో తృటిలో తప్పిన అధికారం : 1952 ఫిబ్రవరిలో జరిగిన ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర ఎన్నికల్లో ఆంధ్రా ప్రాంతంలో 140 అసెంబ్లీ స్థానాలు ఉండేవి, కాంగ్రెస్‌కు కేవలం 40 స్థానాలు మాత్రమే దక్కాయి. పార్టీపై నిషేధం అనంతరం కేవలం నెలాపది రోజుల్లోనే జరిగిన ఎన్నికల్లో 140 అసెంబ్లీ స్థానాలకు గాను 61 స్థానాల్లో పోటీ చేసి 41 స్థానాల్లో కమ్యూనిస్టులు గెలిచారు. పార్టీ బలపర్చిన 13 మంది ప్రజాపార్టీ (ప్రకాశం పంతులు పార్టీ) అభ్యర్ధులు, 8 మంది స్వతంత్ర అభ్యర్ధులు గెలిచారు. అప్పటి కేంద్ర ప్రభుత్వం, ఇతర పార్టీల కుట్రలవల్ల మెజార్టీ స్థానాలు గెలిచినప్పటికీ కమ్యూనిస్టులు ఇతర ప్రజాతంత్ర, వామపక్ష పార్టీలను కలుపుకొని అధికారంలోకి వచ్చే అవకాశం చేజారింది. స్వాతంత్య్రానంతరం జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో (1952) లో కమ్యూనిస్టులు జనతంత్ర ప్రజాసంఘటన (పిడిఎఫ్) నాయకత్వంలో పోటీచేసిన 44 స్థానాలకుగాను 36 స్థానాల్లో గెలిచారు. పార్లమెంట్ స్థానాలకు పోట ీచేసిన కామ్రేడ్ రావి నారాయణరెడ్డికి అప్పటి భారత ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రు కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. అనేక మంది జైల్లో ఉంటూనే గెలిచారు. ఆనాటి హైద్రాబాద్ రాష్ట్రంలో మూడు ప్రాంతాలు అనగా మహారాష్ట్రలోని 5 జిల్లాలు, కర్నాటకలోని 3 జిల్లాలు, తెలంగాణలోని 8 జిల్లాలు కలిసి ఉండేవి. తెలంగాణ ప్రాంతంలో అత్యధిక స్థానాలు కమ్యూనిస్టు పార్టీ విజయ బావుటా ఎగరేసింది. ఆనాడు రెండు రాష్ట్రాల్లో తెలుగు ప్రజల్లో మెజార్టీ స్థానాలు కమ్యూనిస్టు పార్టీ సాధించింది.
సంపూర్ణ స్వాతంత్య్రానికి పిలుపు : సంపూర్ణ స్వరాజ్యం కోసం మొట్ట మొదట పిలుపు ఇచ్చింది కమ్యూనిస్టు పార్టీనే. 1921లో అహ్మదాబాద్ కాంగ్రెస్ మహాసభలో, 1922 లో ‘గయ’లో ఈ గళాన్ని వినిపించారు. కమ్యూనిస్టు నాయకులైన మౌలానా హస్రత్ మొహాని, స్వామి కుమారనంద ఈ నినాదం ఇచ్చారు. కమ్యూనిస్టుల ఉద్యమ ప్రభావం రాజ్యాంగ పీఠికలో స్పష్టంగా కనిపించింది. దున్నేవాడికే భూమి నినాదంతో జమీందారి, జాగిర్ధారీ పాలనకు వ్యతిరేకంగా రైతు కూలీలను సమీకరించారు. భూ సమస్యను ఎజెండా మీదకు తెచ్చారు. కార్మికులు, కర్షకులతో పాటు మహిళలు, దళితులు, ఆదివాసీలు స్వాతంత్రోద్యమంలోకి వచ్చారు. మహిళా సమానత్వ హక్కును ఎజెండాలోకి తెచ్చారు. వరకట్నం, బాల్యవివాహాలకు వ్యతిరేకంగా సీపీఐ అనేక ఉద్యమాలు చేసింది. కందుకూరి, గురజాడ వంటి వారి సంస్కరణోద్యమాలకు కమ్యూనిస్టు ఉద్యమం ఊపిరి పోసింది. అభ్యుదయ రచయితలను, కళాకారులను ప్రోత్సహించారు. ప్రజాకళలను విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లారు. అనేక మంది ప్రజానాట్యమండలి కళాకారులు సీనీరంగంలో ప్రవేశించి రాణించారు. వారిలో నాగభూషణం, గుమ్మడి, అల్లు రామలింగయ్య, వి.మధుసూధన్‌రావు, తాతినేని ప్రకాశ్‌రావ్, తమ్మారెడ్డి కృష్ణమూర్తి, జి.వరలక్ష్మి, జమున, మాదాల రంగారావు, ఇంకా అనేక మంది కమ్యూనిస్టు అభిమానులైన నటులు సినీరంగంలో ఒక వెలుగు వెలిగారు. శ్రీశ్రీ లాంటి మహాకవులు, సుద్దాల హనుమంతు లాంటి ప్రజాకవులు, గద్దర్, గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, జయరాజ్, వందేమాతరం శ్రీనివాస్ లాంటి వారికి ప్రేరణ కమ్యూనిస్టు ఉద్యమమే. నాగార్జునసాగర్, శ్రీశైలం వంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం అనేక పోరాటాలు నిర్వహించింది.
వెల్లువెత్తిన ప్రజా పోరాటాలు-వర్గ సంఘాల ఏర్పాటు : 1920లో కమ్యూనిస్టుల సహకారంతో ఏఐటియుసి, 1936లో అఖిల భారత కిసాన్ సభ (ఏఐకెఎస్), 1936లో అఖిల భారత విద్యార్ధి సంఘం, 1936లో వ్యవసాయ కార్మిక సంఘం (బికెఎంయు), 1936లో అభ్యుదయ రచయితల సంఘం, 1943 లో ఇండియన్ పీపుల్స్ థియేటర్స్ అసోషియేషన్ (ఇప్టా-ప్రజా నాట్య మండలి), ఏర్పాటు చేశారు.
సాంస్కృతిక ఉద్యమాలు, సామాజిక కార్యక్రమాలు : ఇఫ్టా, ఆరసంలాంటి సాస్కృతిక సంఘాలు దేశవ్యాప్తంగా సాంస్కృతిక విప్లవానికి నాంది పలికాయి. దళితులు మందిరాల్లో ప్రవేశానికి, అంటరానితనానికి వ్యతిరేకంగా, మూఢ నమ్మకాలకు, ఆచారాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. ప్రజల్లో హేతువాద, శాస్త్రీయ ఆలోచనలు పెంచడానికి కృషి చేశారు. బాల్యవివాహాల రద్దుకు, అభ్యుదయ వివాహాలకు, సతీసహగమనం రద్దుకై అనేక పోరాటాలు చేశారు.
కమ్యూనిజం ఆవశ్యకత : దేశంలో కమ్యూనిజం ఆవశ్యకత, అవసరం ఎన్నడూలేని విధంగా ఈనాడు ఉంది. ఉద్యోగ భద్రత లేదు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికుల పేరుతో అతి తక్కువ వేతనాలతో కొత్త రూపంలో శ్రమ దోపిడి జరుగుతున్నది. భావాన్ని, ప్రశ్నించేవారిని అణచివేస్తున్నారు. రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారు. కవులు, కళాకారులను మతోన్మాద ఆరాచకులు కాల్చి చంపుతున్నారు. సోషల్ మీడియాను ఒక యూనివర్శిటీగా మలుచుకొని విద్రోహపూరిత విషజ్వాలలను సమాజంలో విరజిమ్ముతున్నారు. ఆర్ధిక అసమానతలు ఎన్నడూలేని విధంగా పెరిగాయి. ప్రపంచంలోనే మనది 4 వ ఆర్ధిక వ్యవస్థ అంటున్నప్పటికీ సంపద కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకృతమైంది. అలీన విధానాన్ని గాలికి వదిలేసి అమెరికా ఆదేశాలను పాటించే స్థితికి దేశ పాలకులు వచ్చారు. కరోనా లాంటి కష్టకాలంలో ప్రపంచం ఆర్ధిక మాంధ్యంతో తల్లడిల్లిపోయినా భారతదేశ వ్యవస్థను బలంగా నిలపగలిగిన ప్రభుత్వరంగ సంస్థలైన బ్యాంకింగ్, ఇన్సూరెన్సు రంగాలను సరళీకరణ పేరుతో విదేశీ శక్తులకు, కార్పోరేట్ శక్తులకు స్వాధీన పరుస్తున్నారు. బొగ్గుగనులు, ఉక్కు కర్మాగారాలు, రైల్వే వ్యవస్థ, రక్షణ వ్యవస్థ, ఆఖరికి అణుశక్తి లాంటి వ్యవస్థల్లో విదేశీయులను పెట్టుబడుల పేరుతో స్వేచ్ఛగా అనుమతిస్తున్నారు. ఈ దశలో దేశానికి కమ్యూనిజం అవసరం ఏనాడు లేనివిధంగా ఉంది. ప్రజలు కమ్యూనిస్టు వ్యవస్థను కోరుకుంటున్నారు. హిడ్మా, నంబూరి కేశవరావు వంటివారిని ఎన్‌కౌంటర్ పేరుతో హతమారుస్తుంటే కోట్లాది గుండెలు తల్లడిల్లుతున్నాయి. చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, సురవరం సుధాకర్‌రెడ్డి, ఏచూరి సీతారాం లాంటి వారు మరణిస్తే కోట్లాది మంది నీరాజనాలు పలికారు.
ప్రపంచంలో బలమైన శక్తి కమ్యూనిజం : ప్రపంచ జనాభాలో మూడో వంతు అనగా 187కోట్ల జనాభా కలిగిన దేశాలలో కమ్యూనిస్టులు అధికారంలో ఉండడమే కమ్యూనిజం ఇంకెక్కడ ఉన్నది అనేవారికి జవాబు. చైనా, ఉత్తరకొరియా, వియత్నాం, లావోస్, కంబోడియా, శ్రీలంక, నేపాల్, లాటీన్ ఆమెరికా దేశాలు, బ్రెజిల్ లాంటి దేశాలలో కమ్యూనిస్టులు, వామపక్షాలు అధికారంలో ఉన్నాయి. భారతదేశం లాంటి దేశాలలో కమ్యూనిస్టులు అధికారంలో లేకపోయినా కోట్లాదిమంది ప్రజాసంఘాలలో, కార్మిక సంఘాలలో సభ్యులుగా కొనసాగుతూ ప్రజాసమస్యలపైన నిరంతరం పోరాడుతున్నారు.
కమ్యూనిస్టుల ఐక్యత నేటి కర్తవ్యం : కమ్యూనిస్టు పార్టీ చీలికల వల్ల దేశంలో అణగారిన వర్గాలకు తీరని అన్యాయం జరిగింది. నక్సల్స్ పేరుతో, అర్భన్ నక్సల్స్ పేరుతో కమ్యూనిస్టులను, అభ్యుదయవాదులను అంతం చేస్తున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రత్యామ్నాయం సోషలిస్టు వ్యవస్థ మాత్రమే. మనిషి కేంద్రంగా పుట్టిన సిద్ధాంతం కమ్యూనిస్టు సిద్దాంతం. మనిషి ఉన్నంతకాలం, మనిషిలో ఆలోచనలు, భావాలు, ప్రశ్నలు ఉన్నంత కాలం కమ్యూనిజం ఉంటుంది. ఈ దశలో కమ్యూనిస్టుల ఐక్యత అంతిమంగా కమ్యూనిస్టుల విలీనమే దేశానికి, దేశ ప్రయోజనాలకు ఒక దిక్సూచి.
ఎంఎల్‌ఏ, కొత్తగూడెం
కార్యదర్శి సీపీఐ, తెలంగాణ రాష్ట్ర సమితి


