డాక్టర్ సి.ఎస్ క్షేత్రపాల్‌రెడ్డి
కార్పోరేట్ కంపెనీ పెట్టుబడులు, ప్రజా ప్రయోజనాల విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై భారత కమÖ్యనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య చేస్తున్న వ్యాఖ్యలు గందరగోళం కలిగించేలా ఉన్నాయంటూ కార్మిక నేతనని చెప్పుకున్న కోగంటి లెనిన్ రెండు రోజుల కిందట బహిరంగ లేఖ రాశారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఎవ్వరైనా ఎవరికైనా uహిరంగంగా లేఖ రాయోచ్చు. ఆ భావప్రకటన స్వేచ్ఛ ఆయనకు ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు ఆకర్షించడానికి వివిధ ప్రభుత్వాలు అనుసరించే విధానం స్పష్టంగా ఉందని, పెద్ద టెక్నాలజీ కంపెనీలు, డేటా సెంటర్లు, ఐటీ పార్కులు వంటి రంగాల్లో పెట్టుబడులు రావాలంటే భూమి సబ్సిడీ, పన్ను రాయితీలు, విద్యుత్, నీటి సౌకర్యాలు వంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం చాలా సాధారణ విషయాలేనని పేర్కొన్నారు. పెట్టుబడిదారులకు అనుకూల చర్యల్ని వెనకేసుకొస్తూ వాటిని నష్టాలుగా కాకుండా దీర్ఘకాలిక పెట్టుబడులుగా చూడాలని, లేకపోతే ఆ కంపెనీలు ఇతర రాష్ట్రాలు లేదా దేశాలకు వెళ్లిపోతే తీవ్రమైన నష్టమంటూ ప్రభుత్వానికి వంత పాడారు. విశాఖలో గూగుల్ అదానీ డేటా సెంటర్‌కు ఇస్తున్న రాయితీలను సమర్థించారు. పబ్లిక్ సెక్టార్‌లోని విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఆధునీకరించడం, పునర్వ్యవస్థీకరించడం కోసం ఏపీ ప్రభుత్వ చర్యలు ఆ సంస్థ అభివృద్ధికి చేసిన సహకారమంటూ పాలకులను కొనియాడారు. అభివృద్ధి పేరున పెట్టుబడులను ఆకర్షించడం మొదలు ఉపాధి కల్పనకు చేస్తున్న ప్రభుత్వ విధానాలన్నీ సరిగానే ఉన్నాయంటూ కార్మిక నేతనంటున్న ఆ వ్యక్తి పేర్కొన్న అంశాలు అసమంజసమైనవి, అర్థరహితమైనవి. ఏపీ పాలకులపై అతనికున్న ఇష్టం ఆ లేఖలో అంతర్లీనంగా వ్యక్తమైంది. అయితే పాలకుల్ని సమర్థించడం కోసం సీపీఐ ఆలోచనలపై అక్కసు వెళ్లగక్కడం సహించరానిది. అభివృద్ధి, సంక్షేమం విషయంలో సీపీఐకి స్పష్టమైన వైఖరున్నది. 99 పైసలకే ప్రభుత్వ భూముల్ని కార్పోరేట్లకు ఇస్తామంటూ ప్రభుత్వ పెద్దలు వ్యాఖ్యలపై అభ్యతరం చెబుతూనే ఉంది. అభివృద్ధి ముసుగులో ఇష్టానుసారం చేస్తున్న భూపందేరంపై పోరాటాలపై పోరాడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా దివాళా తీసిన లూలూ మాల్స్‌కు విజయవాడ, విశాఖపట్టణంలోని వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను దోచిపెట్టడాన్ని వ్యతిరేకించింది, పోరాటం చేసింది, చేస్తున్నది. రాజధాని అమరావతి కోసం ఇప్పటికి సమీకరించిన భూమి సరిపోదని రెండో విడత భారీగా భూసమీకరణకు పూనుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి పేరిట వేల ఎకరాల్ని సమీకరిస్తున్నది. ఇందుకు రాష్ట్రంలోని 1.40 లక్షల ఎకరాలు ప్రభుత్వ భూములను కార్పోరేట్ శక్తులకు కట్టబెట్టడానికి సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. వేల కోట్లు పెట్టుబడులంటూ వస్తున్న బడా కార్పోరేట్ కంపెనీలకు వేలాది ఎకరాలను అప్పగించడం ద్వారా ఇప్పటికే జరిగిన నష్టాలనేకం మన కళ్లముందున్నాయి. విశాఖలో ప్రభుత్వ రంగంలో వెలిసిన జింక్ పరిశ్రమ ప్రైవేటు శక్తుల చేతుల్లోకి చేరడంతో వేల మంది ఉపాధిని కోల్పోవడంతో పాటు దశాబ్ధాలుగా ఆ భూములన్నీ నిరుపయోగంగానే ఉన్నాయి. గడిచిన 20 ఏళ్లగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో అచ్యుతాపురం సెజ్, జెఎస్పీసీ పరవాడ, ఫార్మా పరవాడ, నక్కపల్లి క్లస్టర్, కోనా ల్యాండ్స్, తమ్మవరం ప్రాంతాల్లో 23,593 వేల ఎకరాలు ప్రజల నుంచి సేకరించారు. కాకినాడ సెజ్‌ల కోసం రైతుల నుంచి తీసుకున్న 19,436 వేల ఎకరాల్లో ఇండస్ట్రీయల్ బ్లాకుల ఏర్పాటు జరిగింది ఇప్పటికీ ఆ భూముల్లో వినియోగించుకున్నది కేవలం 5 వేల ఎకరాల్లోపే. మరో 14 వేల ఎకరాలకు పైగా ఖాళీగానే ఉన్నాయి. అటు రైతులకు చెందక, ఇటు ప్రభుత్వాలు చెప్పిన అభివృద్ధి, ఉపాధి కల్పన లేక ఆ భూములు నిరుపయోగంగా ఉండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో సీపీఐ ఆలోచనల్ని వ్యతిరేకిస్తున్న సదరు కార్మిక నేతే చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి భూపందేరాలు అనేకం. ఇంత పెద్దఎత్తున భూమి నిరుపయోగం అవడంతో లక్షలాది మంది ఉపాధి అవకాశాలను అందుకోలేకపోతున్నారు. ప్రపంచదేశాలు తమకు తీవ్ర నష్టం జరుగుతున్నది డేటా సెంటర్లు వద్దని పోరాటం చేసుంటే అయాచితంగా వచ్చే సెంటర్లను ఎంతో కష్టపడి తెచ్చినట్టు రాష్ట్రం ప్రజల నెత్తిన రుద్దడం అన్యాయం. అభివృద్ధి కోసం భూసమీకరణ తప్పు కాకపోయినా ఆ భూమిని సరైన పద్దతిలో వినియోగించుకోలేకపోవడం తప్పేనని ఈ విషయంలో నిరూపితమైంది. ఇవేవీ తమకు తెలియనట్టు సమాజహితం కోసం, సామాజిక అభివృద్ధి కార్యక్రమాల కోసం కమÖ్యనిస్టు దిగ్గజం చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ నిర్మాణం కోసం ఇచ్చిన భూముల్ని, కార్పోరేట్ శక్తులకు ఇస్తున్న భూముల్ని ఒకే గాటన కట్టడం సదరు కార్మిక నేతకు సమంజసం కాదు. కార్పోరేట్ శక్తులకు ప్రభుత్వాలు భారీ స్థాయిలో అందించే రాయితీలను సమర్థించే మీరు ఏపీకి పార్లమెంటు సాక్షిగా, చట్టబద్దంగా దక్కాల్సిన ఏపీ పునర్విభజన చట్టాన్ని సాధిస్తే మీరన్న రాయితీలు కేంద్రం ద్వారానే అందుతాయి. ఆ దిశగా పోరాడుతున్న వామపక్షాలతో కలసి కేంద్రంపై పోరాటం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాస్తే బాగుంటుందేమో. ఇక్కడ సదరు కార్మిక నేత గుర్తించాల్సిన ప్రాధమికాంశం ఏమిటంటే పారిశ్రామిక అభివృద్ధి అంటే అదేదో పూర్తిగా ప్రైవేటు రంగానికి సంబంధించిన అంశం కాదు. పెద్ద పెద్ద కంపెనీలు, లక్షల కోట్ల పెట్టుబడులతో భారీ పరిశ్రమలను స్థాపిస్తేనే పారిశ్రామికాభివృద్ధి చెందుతుందనేది భ్రమే. కొన్నేళ్ల కిందట రిలయన్సు కంపెనీ ముంబైలో ఆయిల్ రిపైనరీ పరిశ్రమ కోసం 600 కోట్లు ఖర్చు చేసింది. తీరా అ పరిశ్రమ ద్వారా లభించిన ఉపాధి ఇరవై మందికే. అంటే 30 కోట్ల పెట్టుబడికి ఒకరికి మాత్రమే ఉపాధి దొరికింది. కాబట్టి బడా కార్పోరేట్ పెట్టుబడుల కన్నా చిన్న, మధ్యతరగతికి చెందిన పరిశ్రమల స్థాపనకు పెద్ద పీట వేయాల్సిన అవసరాన్ని గుర్తించాలని సీపీఐ కోరుతున్నది. ఏపీకి వరంగా ఉన్న సముద్రతీర ప్రాంతాభివృద్ధికి సరైన చర్యలు తీసుకుంటే ఉపాధి అవకాశాలకు కొదువ ఉండదు. విశాఖపట్నం`చెన్నై కోస్టల్ ఎకనామిక్ కారిడార్‌కు నిధులు ఇస్తామని బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది. ఏపీలో 970 కిలోమీటర్ల మేర విస్తరించిన వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌కు నిధులు ఎందుకు రావడం లేదో ఆలోచించాలి. శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా తడ వరకూ ఈ కారిడార్‌లోని ప్రధాన పట్టణాటేవీ అభివృద్ధికి నోచుకోలేదు. కేంద్రం ‘బ్లూ ఎకానమీ పాలసీ’ పేరుతో సముద్ర తీరాన్ని కార్పోరేట్ కబందాల్లోకి తోస్తుంటే పాలకులు ఎందుకు మౌనం వహిస్తున్నారు. ఏపీ ఆర్థికవృద్ధికి వ్యవసాయం, అనుబంధ రంగాలూ కీలకమే. ఆయా విభాగాల్లో మెరుగైన అభివృద్ధి ప్రణాళికల్ని రూపొందించుకోవడం ద్వారా తక్కువ పెట్టుబడులతో భారీ ఉపాధి అవకాశాలను వస్తాయి. ఏపీలోని విశాఖ, విజయవాడ, తిరుపతి వంటి నగరాలు సేవల రంగానికి ఊతమవుతాయి. రాయలసీమలో ప్రత్యేక దృష్టి పెట్టి పవన విద్యుత్ వనరుల్ని పెంచి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలివ్వచ్చు. ఆహార సంరక్షణలోనూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉపాధి చూపవచ్చు. ఐటీ రంగాన్ని ఆరోగ్య రక్షణ, వ్యవసాయం, చేనేత, నీటి వనరుల నిర్వహణ, చేతివృత్తులు, వ్యవసాయ ఆధునీకరణ, పన్నుల సేకరణ, న్యాయ వ్యవస్థ, ఈ గవర్నెన్సు, న్యాయవ్యవస్థ, నేర నియంత్రణ వంటి వ్యవస్థల కోసం వినియోగించుకునే మార్గాలను అన్వేషిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయి. కాబట్టి అభివృద్ధి అంటే బడా కార్పోరేట్లను జపించడం కాదు. ఆ విధానాల్ని విడిచి సుస్థిరమైన అభివృద్ధి దృష్టికోణం ప్రభుత్వాలకు ఉండాలని కోరుకోవడం, ఆ దిశగా ప్రశ్నించడం నిర్మాణాత్మక ఆలోచనకాక ఏమవుతుందో సీపీఐకి బహిరంగ లేఖ రాసిన నేతే చెప్పాలి.
(కార్మిక నేతనని చెప్పుకుంటున్న కోగంటి లెనిన్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శికి రాసిన బహిరంగ లేఖకు సమాధానం) సెల్ : 9059837847


