Homeతెలంగాణగ్రానైట్‌ గోల్‌మాల్‌ !

గ్రానైట్‌ గోల్‌మాల్‌ !

- Advertisement -

. నిబంధనలకు విరుద్ధంగా లారీల్లో తరలింపు
. పరిమితికి మించి తరలిపోతున్న రాళ్లు
. మామూళ్ల మత్తులో అధికారగణం
. చెక్‌పోస్టులో ఆపరు… పెనాల్టీ రాయరు
. జేబులు నింపుకుంటున్న అక్రమార్కులు
. ప్రభుత్వ ఆదాయానికి గండి

విశాలాంధ్ర బ్యూరో-ఖమ్మం: తెలంగాణలోని వరంగల్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల నుంచి ఖమ్మం జిల్లా మీదుగా నిబంధనలకు విరుద్ధంగా గ్రానైట్‌ను లారీల్లో కాకినాడ, విశాఖపట్నం పోర్టులకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి షిప్‌ల ద్వారా విదేశాలకు తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి పెద్దఎత్తున గండికొడుతూ అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు. 22 చక్రాల లారీపై 55 టన్నుల వరకే తీసుకెళ్లేందుకు అనుమతి ఉండగా… రవాణాశాఖ అధికారులకు మామూళ్లు ముట్టజెప్పి పరిమితికి మించి ఒక్కో లారీపై 70 నుంచి 90 టన్నుల వరకు గ్రానైట్‌ రాళ్లను తీసుకెళ్తున్నారు. ఖమ్మం జిల్లా మీదుగా ప్రతిరోజు 40 నుంచి 60 లారీల వరకు వెళుతుంటాయి. నిబంధనలకు విరుద్ధంగా ఓవర్‌ లోడ్‌ తో వెళుతున్న లారీలను మోటార్‌ వెహికిల్స్‌ ఇన్‌స్పెక్టర్లు (ఎంవీఐ)గాని, చెక్‌పోస్టులో గాని ఆపరు. అధిక బరువుతో వెళ్తున్న ఏ లారీకి పెనాల్టీ రాయరు అనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దీనికంతటికీ కారణం ప్రతి లారీ నుంచి ప్రతినెల సంబంధిత అధికారులకు నెలవారి ముడుపులు ముడుతున్నాయని విమర్శలు హల్‌చల్‌ చేస్తున్నాయి. 55 టన్నులు పైబడి ఎన్ని టన్నులు ఉంటే టన్నుకు వెయ్యి రూపాయల చొప్పున చలానా రాసి ఆ డబ్బును ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆయా చెక్‌ పోస్టులు వద్ద ఆపినా నామమాత్రపు చలానా రాయించడం… ముడుపులతో సర్దుకోవడం తప్ప … భారీ లోడుకు సరిపడా పెనాల్టీలు వేయడం లేదన్నది జగమెరిగిన సత్యం. నిత్యం ఖమ్మం జిల్లా మీదుగా ఓవర్‌ లోటుతో గ్రానైట్‌ రాళ్లు తీసుకెళ్లే లారీల్లో దాదాపు 90 వరకు ఒక మాజీ మంత్రి కి చెందినవిగా తెలుస్తోంది. దాదాపు 200 లారీలు ఖమ్మం జిల్లా మీదుగా గ్రానైట్‌ లోడు లారీలు వెళ్తుంటాయి. రవాణా అధికారులు చిత్తశుద్ధిగా విధులు నిర్వహిస్తే కోట్లాది రూపాయలు ప్రభుత్వ ఖజానాకు జమ అవుతుందని పలువురు పేర్కొంటున్నారు. కానీ అలా కాకుండా చేయకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి ఆశాఖ అధికారులు కొందరు జేబులు నింపుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు నీళ్లు వదిలి అడ్డగోలు లోడుతో లారీలు ప్రయాణం చేయడం వల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. తొర్రూరు పట్టణంలో కరీంనగర్‌ నుంచి కాకినాడ పోర్టుకు వెళుతున్న ఒక గ్రానైట్‌ హెవీ లోడ్‌ లారీ మంగళవారం రాత్రి ప్రమాదానికి గురై రాళ్లు కిందపడిపోవడం మచ్చుకు ఓ ఉదహరణ మాత్రమే. ఆ లోడు వే బిల్లులో చూపిన బరువుకి… వాస్తవ బరువుకి చాలా తేడా ఉంది. వివరాలు అడిగితే మీడియాకు పోలీసులు చెప్పలేదు. కానీ ఆ రాళ్లను తొలగించేందుకు వచ్చిన క్రేన్‌ ఆపరేటర్‌ 80 టన్నులకు పైబడి ఉంటుందని చెప్పడం కొసమెరుపు. ఈ ఉదంతం అక్రమాలకు మరింత బలాన్ని చేకూర్చుతోంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన జీఎస్టీ, మైనింగ్‌ టాక్స్‌ ఎగ్గొడుతున్నట్టు తెలుస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు