అనేక రాష్ట్రాలతో పాటు తెలంగాణలోనూ సమగ్ర, సునిశిత ఓటర్ల జాబితా సవరణ (ఎస్.ఐ.ఆర్.) మొదలైంది. బిహార్‌లో ఎస్.ఐ.ఆర్. జరిగినప్పుడు విదేశీయులను ఏరివేస్తాం అన్నారు. కానీ ఇంతవరకు ఆ విదేశీయులను పంపించిన దాఖలాలే లేÉవు. బెంగాల్‌లో ఎస్.ఐ.ఆర్. దగ్గరకు వచ్చే సరికి తార్కిక వ్యత్యాసాలు అన్నారు. తెలంగాణలో కూడా ఈ తార్కిక వ్యత్యాసాల మంత్రదండాన్నే వినియోగించబోతున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఎస్.ఐ.ఆర్.కు ముందు జరిగే ప్రాథమిక ప్రక్రియ మొదలైంది. ఇందులోనే 89 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించే ప్రమాదం కనిపిస్తోంది. ఈ తార్కిక వ్యత్యాసాల ప్రశ్న మారుమూల జిల్లాల్లో లేకపోయినా హైదరాబాద్, ఆ పరిసర నియోజకవర్గాలలో సమస్యగా మారబోయే ప్రమాదం కనిపిస్తోంది. అందులోనూ పట్టణ ప్రాంతాల్లో, పట్టణాలలాంటి చోట్ల ఈ సమస్య తలెత్తేట్టు ఉంది. ఉదాహరణకు ఇప్పుడే కుత్బుల్లాపూర్, ఎల్.బి.నగర్, ఉప్పల్, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సైతం తార్కిక వ్యత్యాసాలు బయటపడ్తున్నాయి. బెంగాల్‌లో లాగే తెలంగాణాలో, ముఖ్యంగా హైదరాబాద్ ముస్లింలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. బెంగాల్‌లో లాగే భారీ సంఖ్యలో ముస్లింల పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించే సూచనలున్నాయి. ఇలా తొలగించే వారిని బంగ్లా దేశీయులంటున్నారు లేదా పాకిస్థానీయులుగా ముద్ర వేస్తున్నారు. మన దేశంలో పౌరసత్వ కార్డులు ఏమీ లేవు. అయినా ఎస్.ఐ.ఆర్. సందర్భంగా పౌరసత్వాన్నే ప్రధానాంశం చేస్తున్నారు. తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి రకరకాల పత్రాలు ఉండాలంటున్నారు. చదువుకున్న వారు ఈ పని కొంతమేరకైనా చేయగలగొచ్చు. చదువులేని వారి పరిస్థితి ఏమిటి అన్నది అసలు ప్రశ్న. జనం తరచుగా ఇళ్ళు మారడం వల్ల, అపార్ట్మెంట్లలో నివాసం ఉంటున్నందువల్ల తార్కిక వ్యత్యాసం జాబితాలో పడే వారి సంఖ్య పెరుగుతోందని ఎన్నికల కమిషన్ అధికారులు అంటున్నారు. తరతరాల నుంచి ఇక్కడే ఉంటున్న వారి పౌరసత్వం కూడా ప్రశ్నార్థకం అవుతోంది. అద్దె ఇళ్లల్లో ఉన్న వారు తరచుగా ఇళ్లు మారాల్సి రావొచ్చు. తార్కిక వ్యత్యాసాల జాబితాలో చేర్చిన వారిలో చాలా మంది దశాబ్దాలుగా ఓటు హక్కు వినియోగించుకుంటూనే ఉన్నారు. అయినా ఒకే కుటుంబంలో కొందరి పేర్లు ఉంటే మరికొంత మందివి మాయమవుతున్నాయి. ఓటరు గుర్తింపు ఉన్న వారి పేర్లు కూడా కనిపించడం లేదు. తెలంగాణాలో 69 శాతం మంది ఓటర్ల ప్రాథమిక పరిశీలన పూర్తి అయింది. అందులోనే 89 లక్షల మంది ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయంటున్నారు. మొత్తం పూర్తి అయితే ఈ సంఖ్య ఇంకా పెరగొచ్చు. ఎస్.ఐ.ఆర్.కు 2002 నాటి ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. తరక్కసహిత వ్యత్యాసాలు అన్న పేరుతో లక్షలాది మంది పేర్లు ఓటర్ల జాబితాలో చేర్చడం లేదు. పౌరసత్వాన్ని నిరూపించుకోలేక పోయిన వారిని నిర్బంధ శిబిరాల్లో ఉంచే అవకాశమూ ఉంటుంది. ప్రాథమిక పరిశీలన మొదలైనప్పటి నుంచి చాలా మంది తాము సేకరించగలిగిన పత్రాలను చేతబట్టుకుని అధికారుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ తిరుగాల్సి వస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో ఎస్.ఐ.ఆర్. ప్రకియకు ముందు 7.66 కోట్ల పేర్లు ఓటర్ల జాబితాలో ఉండేవి. అందులో 91 లక్షల పేర్లు తొలగించారు. 27 లక్షల మందిని తార్కిక వ్యత్యాసాల జాబితాలో పడేశారు. వీరి ఫిర్యాదులు పరిశీలించడానికి సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం ట్రిబ్యునళ్లు ఏర్పాటుచేశారు. ఆ ట్రిబ్యునళ్లు పరిష్కరించింది వెయ్యి పైచిలుకు ఫిర్యాదులే. మొత్తం మీద దాదాపు 27 లక్షల మందికి ఓటు వేసే అవకాశమే రాలేదు. అదేమంటే సుప్రీంకోర్టు విచిత్రంగా వచ్చేసారి వేయొచ్చు లెండి అని సరిపెట్టింది. ఓటు హరించే ఏ ప్రక్రియ అయినా ప్రజాస్వామ్యంలో ఎలా చెల్లుతుంది అన్న ధ్యాసే సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు వచ్చినట్టు లేదు. ఇంతకీ ఎన్నికల కమిషన్ చెప్తున్న తార్కిక వ్యత్యాసాలు అంటే ఎమిటి ? ఒక చోటకన్నా ఎక్కువ చోట్ల ఓటరుగా నమోదు కావడం, ఒక వ్యక్తి వయస్సు వివిధ రికార్డులలో భిన్నంగా ఉండడం, కుటుంబ సంబంధాలు నియతంగా లేకపోవడం, పేర్లలో తేడాలు ఉండడం ఎన్నికల కమిషన్ లెక్క ప్రకారం తార్కిక వ్యత్యాసాల కింది లెక్క. ఓటర్ల పేర్లు తెలుగులోనో, ఉర్దూలోనో రాసినప్పటి కన్నా అవి ఇంగ్లీష్‌లో రాస్తే తేడాలు రావొచ్చు. పెళ్లి అయిన మహిళల ఇంటి పేరు మారిపోవచ్చు. కొందరికైతే అత్తవారి ఇంటికి వెళ్లిన తరవాత అసలు పేరే మార్చేస్తారు. తమకు ఇంపైన పేరు పెడ్తారు. ఇలాంటి వ్యత్యాసాలను తొలగించడానికే ఎస్.ఐ.ఆర్. అవసరమని ఎన్నికల కమిషన్ చెప్తోంది. 2002 నాటి ఓటర్ల జాబితాతో తమ వివరాలు సరిపోలకపోతే తమ ఓటు హక్కు పోతుందేమోన్న బెరుకు చాలామందిని భయపెడ్తోంది. పౌరసత్వం ప్రశ్నార్థకమై, ఓటర్ల జాబితాలో పేరు కూడా లేకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల ప్రయోజనం దక్కదేమో అన్న ఆందోళన చాలా మందిలో ఉంది. మరో సమస్య ఏమిటంటే 2002 ఓటర్ల జాబితాను కంప్యూటర్ విజ్ఞానం ఆధారంగా తయారుచేయలేదు. ఇప్పుడు కంప్యూటర్ విజ్ఞానాన్ని వినియోగించి చేస్తున్నారు. దానివల్లా కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. ఉదాహరణకు సయ్యద్ ముస్తాఖ్ అన్న పేరు ఒకసారి ఎస్.ముస్తాఖ్ అని మాత్రమే రాసి ఉండొచ్చు. ఆ ఎస్. సయ్యద్ ఒకటి కాదని తార్కిక వ్యత్యాసాల జాబితాలో పడేస్తున్నారు. అక్షర క్రమంలో వచ్చే మార్పుల వల్ల కూడా కొన్ని పేర్లు మాయం అవుతున్నాయి. పైగా ఇంటి నెంబర్లు మారిపోతుంటాయి. స్థానిక సంస్థల వారే ఇంటి నెంబర్లు మార్చేసిన ఉదంతాలు ఉన్నాయి. అదీ తార్కిక వ్యత్యాస జాబితాలో పడిపోతే ఓటు హక్కు పోయినట్టే. వివిధ ప్రభుత్వ సంస్థలు ఇచ్చిన సమాచారంలోనూ తేడాలు ఉండొచ్చు. అలాంటప్పుడు పత్రాలు ఉన్నా ప్రయోజనం లేదు. వయసు పైబడిన వారి దగ్గర పాత పత్రాలే ఉండొచ్చు. ఇవన్నీ ఎన్నికల కమిషన్ ప్రకారం తార్కిక వ్యత్యాసాల కిందకే వస్తాయి. ఒక్కో సారి ఓటరు గుర్తింపు కార్డులో ఉన్న సమాచారం ఆధార్ కార్డులో ఉండే సమాచారంతో సరిపోలక పోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం నివాస ధృవీకరణ పత్రాలు ఇవ్వదు. ఓటు వేసేటప్పుడు గుర్తింపు పత్రం కింద డ్రైవింగ్ లైసెన్సును, ఆహార భద్రతా కార్డుని కూడా అంగీకరిస్తారు. ఓటర్ల నమోదుకు మాత్రం అవి చెల్లడం లేదు. ఏ సవరణ ప్రక్రియైనా పరిపాలనా విభాగం సామర్థ్యం పై ఆధారపడి ఉంటుంది. అయితే ప్రజలకు దాని మీద విశ్వాసం ఉండాలి. సమస్యల్లా బీజేపీకి ఓటు వేయరనుకున్న వారి పేర్లు తొలగించడానికే ఎస్.ఐ.ఆర్. ఉపకరిస్తోంది. ఒక పార్టీ లేదా కొన్ని పార్టీల మద్దతుదార్లÁను ఓటర్ల జాబితాలోంచి తొలగిస్తే ప్రజాస్వామ్యానికి ముప్పే. ఓటర్ల జాబితా ప్రతి వ్యక్తికి ప్రాధాన్యం వహిస్తుంది. ప్రతి సవరణ ఓటర్ల మీద ప్రభావం చూపుతుంది. తమకు అనుకూలమైన వారినే ఓటర్ల జాబితాలో చేర్చాలని బీజేపీ ప్రభుత్వం అనుకుంటూ ఉంటే సక్రమమైన ఏ వాదనా నిలబడదు.


