Homeనీట్ కేసులన్నీ రద్దు

నీట్ కేసులన్నీ రద్దు

- Advertisement -
  • విద్యార్థుల నిరసనలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం
  • 3 నెలల్లో మృతుల కుటుంబాలకు పరిహారమివ్వాలని ఆదేశం
  • తీవ్ర నేరచరిత్ర ఉన్నవారిపై విచారణకు అనుమతి
  • కోర్టు నిర్ణయంపై సీజేపీ హర్షం… 5న నిరసన ర్యాలీ విరమణ

న్యూఢిల్లీ: నీట్ నిరసనలకు సంబంధించి విద్యార్థులపై కేసుల ఎత్తివేతకు తాము సిద్ధంగా ఉన్నామని… భవిష్యత్తులో కొత్త కేసులు నమోదు చేయబోమని కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇచ్చిన నేపథ్యంలో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన విద్యార్థులపై దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్‌ఐఆర్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఆర్టికల్ 142 ప్రకారం సంక్రమించిన అధికారాలను ఉపయోగిస్తూ సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే తీవ్రమైన నేరచరిత్ర ఉన్న వారిపై మాత్రం కేసుల నమోదుకు కేంద్రం, దిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. మొత్తం 2,873 మందిపై కొత్తగా ఎఫ్‌ఐఆర్ల నమోదుకు అనుమతి మం జూరు చేసింది. ఇక ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లింపులపై విధివిధానాలు రూపొందించాలని సూచించింది. విధివిధానాలు రూపొందించిన మూడు నెలల్లోగా కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. దీంతో సెప్టెంబరు 5న దిల్లీలో తలపెట్టిన నిరసన మార్చ్ను ఉపసంహరించుకుంటున్నట్లు కాక్రోచ్ జనతాపార్టీ (సీజేపీ) ప్రకటించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇరుపక్షాలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే, అన్ని సమస్యలు ఒక్కొకక్కటిగా పరిష్కరించుకోవచ్చని వ్యాఖ్యానించింది. నిష్పక్షపాతంగా చర్చించలేనంత సంక్లిష్టమైన అంశం ఈ ప్రపంచంలో ఏదీ లేదని పేర్కొంది. దేశ రాజధాని దిల్లీలోని జంతర్‌మంతర్‌కు నిజాయితీగా నిరసన తెలిపేందుకు వచ్చిన యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కేసులు రద్దు చేసినట్లు వెల్లడించింది. కాగా క్రిమినల్ చరిత్ర ఉన్న 2,873 మంది వ్యక్తులపై జంతర్ మంతర్ నిరసనలకు సంబంధించి దిల్లీ పోలీసులు నమోదు చేసిన ఒక ఎఫ్‌ఐఆర్‌ను కొనసాగించడానికి కోర్టు అనుమతించింది. జులై 25న నిరసనకారులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ బీహార్, అసోం, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం (దిల్లీ పోలీసులు) సంయుక్తంగా ఎఫ్‌ఐఆర్ల రద్దు కోసం దరఖాస్తులు దాఖలు చేసినట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. నిరసనకారులపై ఐదు రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్‌ఐఆర్లను కొట్టివేసిన న్యాయస్థానం… ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఇదే ఆందోళనలకు సంబంధించిన కేసులను కొనసాగించరాదని ఆదేశించింది. దీంతో సెప్టెంబరు 5న దిల్లీలో తలపెట్టిన నిరసన మార్చ్ను ఉపసంహరించుకుంటున్నట్లు సీజేపీ ప్రకటించింది. సంబంధిత పిటిషన్లను మంగళవారం విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జోయ్మాల్య బాగ్చీ, వి. మోహనాతో కూడిన ధర్మాసనం… రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తమకున్న అసాధారణ అధికారాలను వినియోగిస్తూ… యువ ఆందోళనకారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ‘యువ ఆందోళనకారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని.. సంపూర్ణ న్యాయం కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద మాకు ఉన్న అధికారాలను వినియోగిస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది.
ఐదు రాష్ట్రాల్లో ఎఫ్‌ఐఆర్ల కొట్టివేత
2026 జులై 20 నుంచి 25 వరకు జరిగిన ఆందోళనలకు సంబంధించి దిల్లీ, బీహార్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, అసోం రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్‌ఐఆర్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇదే ఆందోళనలకు సంబంధించి ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నమోదైన కేసులను సైతం దర్యాప్తు చేయడం, కొనసాగించడం చేయరాదని స్పష్టం చేసింది. అవన్నీ మూసివేసినట్లుగా పరిగణించాలని ఆదేశించింది. జులై 20-25 మధ్య జరిగిన ఆందోళనలకు సంబంధించి ఇకపై కొత్తగా ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయరాదని కూడా తేల్చిచెప్పింది.
2,873 మందిపై విచారణకు అనుమతి
కాగా, దిల్లీ పోలీసులు జులై 20 నుంచి 25 మధ్య నమోదు చేసిన 13 ఎఫ్‌ఐఆర్లను కొట్టివేయాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
అయితే జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) సమాచారం ఆధారంగా ‘తీవ్రమైన నేర చరిత్ర’ ఉన్న 2,873 మందిపై చర్యలు కొనసాగించాలని కోరింది. ఈ వ్యక్తులపై శారీరక హాని లేదా ఆస్తి నష్టానికి సంబంధించిన ఆరోపణలకు మాత్రమే విచారణను పరిమితం చేయాలని, ఒకే కొత్త ఎఫ్‌ఐఆర్ ద్వారా విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అటువంటి కేసును నమోదు చేయడానికి దిల్లీ పోలీసులకు ధర్మాసనం అనుమతినిచ్చింది. ఇదే సదుపాయాన్ని ఐదు రాష్ట్రాలకు పరిమితం చేయకుండా ఇతర రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్‌ఐఆర్లకూ వర్తింపజేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు.
విద్యార్థుల కుటుంబాలకు పరిహారం
జులై 20-25 ఆందోళనలకు సంబంధించి దిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ పోలీసులు కేసులను కొనసాగించబోరని సీజేపీ నాయకత్వానికి కేంద్రం హామీ ఇచ్చిందని తుషార్ మెహతా తెలిపారు. విద్యా సంబంధిత సమస్యలు, ముఖ్యంగా నీట్ పరీక్షకు సంబంధించిన పరిణామాల నేపథ్యంలో ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందించడంపై కూడా కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని ఆయన తెలిపారు. పరిహార పథకం విధివిధానాలను రూపొందించేందుకు సుమారు మూడు నెలల సమయం పడుతుందని మెహతా చెప్పగా… రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి విధానాన్ని రూపొందించాలని ధర్మాసనం ఆదేశించింది.
సెప్టెంబరు 5న మార్చ్ ఉపసంహరణ
కేంద్రం ఇచ్చిన హామీలు అమలవుతాయో లేదన్న అనుమానాలతోనే సెప్టెంబరు 5న దిల్లీలో నిరసన మార్చ్కు సీజేపీ పిలుపునిచ్చిందని విచారణ సందర్భంగా మెహతా తెలిపారు. కోర్టులోనే ఉన్న సీజేపీ కోకన్వీనర్ సౌరవ్ దాస్… సెప్టెంబరు 5న చేయ తలపెట్టిన మార్చ్ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. కేంద్రం ఇచ్చిన హామీలు, వాటికి సుప్రీంకోర్టు ఆదేశం ద్వారా లభించిన న్యాయపరమైన భరోసాను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. సీజేపీ నిర్ణయాన్ని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ అభినందించారు. ఇరు పక్షాలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే సమస్యలను ఒక్కొకక్కటిగా పరిష్కరించుకోవచ్చని వ్యాఖ్యానించారు. “రెండు పక్షాలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే అన్ని సమస్యలను ఒక్కొకక్కటిగా పరిష్కరించుకోవచ్చు. మనసు విప్పి చర్చిస్తే ప్రపంచంలో పరిష్కరించలేనంత సంక్లిష్టమైన సమస్య ఏదీ లేదు” అని సీజేఐ పేర్కొన్నారు. మంగళవారం జారీ చేసిన ఆదేశాలను కేంద్రం, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, సీజేపీ తప్పనిసరిగా పాటించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. మరోవైపు నీట్ పేపర్ లీక్‌పై నిరసన తెలిపిన విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్లను రద్దు చేయాలని కోరుతూ బీహార్, బెంగాల్, మహారాష్ట్ర, అసోం రాష్ట్రాలు కూడా సుప్రీంను ఆశ్రయించాయి. ఆందోళనలను విరమించుకుంటే, కేసులను ఉపసంహరించుకుంటామని జులై 25న సీజేపీకి కేంద్రం ఇచ్చిన హామీనే ఈ రాష్ట్రాలు కూడా ప్రస్తావించాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు