- పంచాయతీల నిధులు గోల్మాల్
- కాకినాడ జిల్లాలోనే రూ.1.91 కోట్ల అక్రమాలు
- నకిలీ ఇంధన బిల్లులతో ప్రజాధనం స్వాహా
- అటవీ, పర్యావరణ శాఖల్లోనూ ఉల్లంఘనలు
- మడ అడవులు నరికేసి…
రొయ్యల చెరువుల తవ్వకం - భారీగా మట్టి, గ్రావెల్ తవ్వకాలు… పర్యావరణానికి ముప్పు
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సొంత శాఖల్లో అవినీతి ఆరోపణలు గుపðమంటున్నాయి. ఒక వైపు ోం శాఖ తన చేతుల్లో లేనందున బతికిపోయారంటూ ఇటీవల కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ ఆరోపణలకు గురైన సాయికృష్ణ ఉదంతంపై పవన్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. గతంలోనూ హోం మంత్రి వంగలపూడి అనిత బాధ్యతగా నిర్వహించకపోతే… ఆ శాఖలోకి తాను ప్రవేశిస్తానని మాట్లాడిన విషయం విదితమే. అసలు పవన్ బాధ్యతలు నిర్వహిస్తున్న శాఖల్లో… సగం శాఖలపై అవినీతి ఆరోపణలున్నాయి. ఇప్పటికి ఆయన నిర్వహిస్తున్న శాఖలే సక్రమంగా లేకపోతే… ఇక పవన్ కల్యాణ్ ోం శాఖను ఎలా నిర్వహిస్తారనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. తాజాగా గ్రామ పంచాయతీలలో నిధుల దుర్వినియోగం ఆరోపణలు… ఏకంగా పవన్‌కు, కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చిపెట్టేలా మారాయి. అటవీ, పర్యావరణ శాఖల్లోనూ నిబంధనల ఉల్లంఘన కొనసాగుతున్నప్పటికీ పవన్ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రజలు నిలదీస్తున్నారు. సముద్ర తీరంలోని కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం ఇంతేరు గ్రామంలో మడ అడవులను విధ్వంసం చేసి… రొయ్యల చెరువులను అక్రమంగా తవ్వుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో పాటు ఎన్టీఆర్ జిల్లాలో భారీగా మట్టి, గ్రావెల్ తవ్వకాలతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందన్న వాదనలున్నాయి.
ప్రభుత్వాలు మారుతున్నా పంచాయతీల నిధుల దుర్వినియోగం ఆగడం లేదు. కూటమి ప్రభుత్వ పాలనలో కాకినాడ జిల్లాలో వెలుగు చూసిన పంచాయతీ నిధుల గోల్మాల్ వ్యవహారం… ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. కేవలం అది కాకినాడ జిల్లాలకే పరిమితం కాలేదని, అన్ని జిల్లాల్లోనూ లోతుగా అధ్యయనం చేస్తే మరింత అవినీతి బయటపడుతుందన్న వాదనలున్నాయి. ఈ ఏడాది మార్చి నుంచి మే మధ్య ఈ నిధుల మళ్లింపు పెద్ద ఎత్తున జరిగినట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచుల ఐదేళ్ల అధికారిక పదవీ కాలం 2026 ఏప్రిల్/మే నాటితో ముగిసింది. ప్రత్యేక అధికారులు బాధ్యతలు చేపట్టే ముందే సర్పంచుల డిజిటల్ కీ గడువు ముగిసిపోయే లోపు కొందరు పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు కలిసి హడావుడీగా ఈ సొమ్ము డ్రా చేసినట్లు సమాచారం. ఈ ఆరోపణలపై పంచాయతీరాజ్ శాఖ ప్రాథమిక నివేదికను సిద్ధం చేసి… ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. సర్పంచుల పదవీకాలం ముగియడానికి సరిగ్గా కొన్ని రోజుల ముందు ఏకంగా 669 పంచాయతీల్లో ఒకే తరహాలో (పెట్రోల్, డీజిల్ నకిలీ బిల్లులతో) దాదాపు రూ.20 కోట్లు డ్రా చేసిన ఆరోపణలపై నిఘా విభాగాలు ఇప్పుడు లోతుగా దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. తాజాగా కాకినాడ జిల్లాలోని 61 గ్రామ పంచాయతీల్లో రూ.1.91 కోట్ల ప్రజాధనంలో అక్రమాలు కొనసాగినట్లు గుర్తించిన పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కాకినాడ జిల్లా ఇంఛార్¨ డీపీవో లక్షˆణ్‌తో కమిషనర్ నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా హల్చల్ అవుతోంది. దీంతో పంచాయతీ నిధుల గోల్మాల్ ఆరోపణలకు బలం చేకూరుతోంది. కాకినాడ రూరల్ మండలంలోని రమణయ్యపేట గ్రామ పంచాయతీలో డీజిల్ ఖర్చుల పేరుతో రూ.20 లక్షలు డ్రా చేసిన వ్యవహారంపై పంచాయతీరాజ్ కమిషనర్ టెలీకాన్ఫరెన్స్‌లో ప్రత్యేకంగా ఆరా తీశారు. అక్రమంగా చెల్లించిన బిల్లులను వెనక్కి రప్పించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ప్రజా ధనం ముట్టుకుంటే చేతులు కాలిపోతాయంటూ ఆయన తీవ్ర హెచ్చరికలు చేశారు. ప్రజలు ప్రభుత్వంపై విశ్వాసంతో పన్నులు చెల్లిస్తున్నారని, ఆ నమ్మకాన్ని అధికారులు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందని సూచించారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తే..ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని టెలీకాన్ఫరెన్స్‌లో హెచ్చరించారు.
నాడు ఆర్థిక సంఘం నిధుల దారిమళ్లింపు వివాదం
వైసీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం 14వ, 15వ ఆర్థిక సంఘం కింద కింద పంచాయతీల అభివృద్ధి కోసం విడుదల చేసిన దాదాపు రూ.8,283 కోట్లకు పైగా నిధులను, గ్రామ పంచాయతీల అనుమతి లేకుండానే రాష్ట్ర ఆర్థిక శాఖ విద్యుత్ సంస్థలకు బకాయిల కింద మళ్లించిందన్న ఆరోపణలున్నాయి. ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగంపై పవన్ కల్యాణ్ దర్యాప్తు చేయాలంటూ డిమాండ్ చేసిన విషయం విదితమే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా ఇదే తంతుగా పంచాయతీల నిధులు పక్కదారి పట్టిస్తుంటే… ఏకంగా ఉప ముఖ్యమంత్రి సొంత శాఖలోనే ఇలా కొనసాగుతుంటే… ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లోనూ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తే మరిన్ని అవినీతి ఆరోపణలు వెలుగు చూసే అవకాశం ఉంది.
మడ అడవులు నరికేసి… రొయ్యల చెరువులు
పవన్ కల్యాణ్ బాధ్యతలు నిర్వహిస్తున్న అటవీ, పర్యావరణ శాఖల పైనా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. సముద్ర తీరంలోని కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం ఇంతేరు గ్రామంలో మడ అడవులు విధ్వంసం యదేచ్ఛగా కొనసాగుతోందంటూ ఏకంగా టీడీపీ అనుకూల మీడియాలోనే కథనాలు వచ్చాయి. అక్కడ మడ అడవులను దాటుకుని సముద్రపు అంచులు తాకేలా రొయ్యల చెరువులను ఏర్పాటు చేస్తున్నారు. ఆ చెరువు గట్లు సముద్ర తీరానికి అత్యంత సమీపంలో ఉన్నాయంటే నిబంధనల ఉల్లంఘన ఏ స్థాయిలో ఉందనేదీ అర్థమవుతోంది. ఇదే శాఖపై ఎన్టీఆర్ జిల్లాలోనూ భారీగా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మట్టి, ఫ్లైయాష్ తవ్వకాల వల్ల పర్యావరణానికి భారీ ముప్పు వాటిల్లుతోందని మాజీ మంత్రి జోగి రమేశ్ ఇటీవల మైలవరం నియోజకవర్గంలోని అనేక ప్రాంతాలకు వెళ్లి అక్రమాలను మీడియాకు వివరించారు. కోట్లాది రూపాయల మట్టి, గ్రావెల్, ఇసుక తవ్వకాల్లో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే నేతృత్వంలో తరలించుకుపోతున్నారని ఆరోపించారు. చుట్టూ తోటలు ఉన్నప్పటికీ, మధ్యలో ఈ తరహాగా మట్టి తవ్వకాలు చేపట్టి విధ్వంసానికి పాల్పడుతున్నారని, దీనివల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మేల్కొని తన సొంత శాఖలలో వస్తున్న అవినీతి ఆరోపణలపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాల్సిన అవసరం ఉంది.


