Homeప్రజా సమస్యలపై పోరుబాట

ప్రజా సమస్యలపై పోరుబాట

- Advertisement -

. జనగణనలో కులగణన
. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ఉద్యమం
. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం డిమాండ్

విశాలాంధ్ర`కాకినాడ: ప్రజాసమస్యలపై పోరుబాట పట్టాలని, సీపీఐని రాజకీయ ప్రత్యామ్నాయం దిశగా నడిపించాలని, ఆర్థిక, రాజకీయ, సామాజిక సమానత్వం కోసం జనగణనలో కుల గణన చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం డిమాండ్ చేసింది. జనాభా ప్రాతిపదికన బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. బీసీ కులాలు ఐక్యంగా సమరశీల పోరాటాలకు సమాయత్తం కావాలని, జనగణనలో కులగణన చేపట్టి… జనాభా ప్రాతిపదికన బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించాలని, రాజకీయ, సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం క్రియాశీల పోరాటాలకు సన్నద్ధం కావాలని సమావేశం పిలుపునిచ్చింది. సోమవారం ఉదయం నుండి రాత్రి వరకు సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తాటిపాక మధు అధ్యక్షతన జరిగింది. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకష్ణ, జాతీయ నాయకులు డా.కె.నారాయణ జాతీయ రాజకీయాలు వివరించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ గత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో బీసీలకు కేటాయించిన స్థానాలు తగ్గించడం వలన వేల సంఖ్యలో బీసీలు పదవులు కోల్పోయారన్నారు. జనాభా లెక్కల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కులగణన చేపట్టి, అందుకనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు స్థానిక సంస్థలలో సీట్లు కేటాయిస్తూ అసెంబ్లీలో రెండు బిల్లులు ఆమోదించిందని గుర్తుచేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లోనూ జనగణనలో కులగణన చేపట్టి… కులాల ప్రాతిపదికన బీసీలకు స్థానిక సంస్థలలో సీట్లు కేటాయించాలని సీపీఐ డిమాండ్ చేస్తున్నదని ఈశ్వరయ్య చెప్పారు. ‘పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, హోదాల్లోనూ, అవకాశాల్లోనూ సమానత్వం కల్పించాలని, ఇవి భారత రాజ్యాంగంలో మొదటి పేజీలో రాసుకున్న మూల సూత్రాలన్నారు. ఈ మహోన్నత లక్ష్యాలతో న్యాయపూర్వక సమాజాన్ని నిర్మించాలని సంకల్పించి 76 సంవత్సరాలు కావస్తున్నా… ఈ లక్ష్య సాధనకు అవసరమైన సమగ్ర కులగణన ఇప్పటికీ జరగలేదన్నారు. ‘ఎవరు ఎంత వెనుకబడి ఉన్నారు? ఎవరికి ఎంత అన్యాయం జరుగుతోంది? రాజ్యాంగ లక్ష్యాలు ఎంత దూరంలో ఉన్నాయి. డేటా లేకపోవడం వలన ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియడంలేదు. కులాల వారీగా సామాజిక-ఆర్థిక స్థితిగతులు, సంపద పంపిణీ, అవకాశాల అసమానతలు స్పష్టంగా తెలియకుండా పోయాయి. ఫలితంగా వెనుకబడిన వర్గాల (బీసీ) జాబితాలో ఉన్న కులాలు రాజకీయ శక్తి, విద్య, ఉద్యోగాలు, ఆర్థికవనరులలో తమకు రావాల్సిన హక్కులను కోల్పోతున్నాయి. కులగణన జరగకపోవడం వల్ల ఏర్పడుతున్న నష్టాలు అపారమైనవి. కులగణనను కేవలం జనాభా లెక్కలకు పరిమితం చేయకుండా… కులాల వారీగా ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతులు, సంపద పంపిణీ, అవకాశాల సమానత్వాన్ని తెలుసుకునే విధంగా సమగ్రంగా జరిపించాలి. కులగణన జరగడం వల్ల లభించే ప్రయోజనాలు, అణగారిన వర్గాలకు రావాల్సిన రిజర్వేషన్లు, సామాజిక కార్యక్రమాలు మరింత లక్ష్యబద్ధంగా అమలు చేయవచ్చు. కుల వ్యవస్థ ద్వారా ఏర్పడుతున్న అడ్డంకులను గుర్తించి పరిష్కరించవచ్చు. దాగివున్న కఠిన వాస్తవాలను సమాజం ముందు పెట్టవచ్చు’ అని ఆయన వివరించారు. జనగణనలో కులగణన చేపట్టాలనేది దేశవ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారన్నారు. దేశంలో 50 శాతానికి పైగా బీసీలు ఉన్నారనేది జగమెరిగిన సత్యమని, కచ్చితమైన లెక్కలు ప్రభుత్వం తేల్చాలని, ఆ ప్రాతిపదికన చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించాలని ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. జనగణనలో కులగణన చేపట్టి… జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, అందుకోసం సీపీఐ క్రియాశీలక పోరాటాలకు సన్నద్ధమవుతుందని ఈశ్వరయ్య ప్రకటించారు. జనగణనలో కులగణన చేపడితే బీసీల సంఖ్య తేలుతుందని, బీసీలకు సమాన అవకాశాలు కల్పించేందుకు ఏబీసీడీలుగా వర్గీకరణ చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు అన్ని కులాలకు, వర్గాలకు కలిగినప్ప్పుడే దేశం సమగ్రాభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. ప్రపంచం శాస్త్ర, సాంకేతిక రంగాలలో దూసుకుపోతుంటే… భారతదేశంలో కులాలను కుల వృత్తులకు కట్టిపడేస్తున్నారని విమర్శించారు. ఓట్లు, సీట్లు పొందుతున్న రాజకీయ పార్టీలు బీసీల అభివృద్ధి గురించి మాట్లాడవని, పదవుల విషయంలోనూ నిర్లక్ష్యమేనన్నారు. జనగణనలో కులగణన జరిపించాలని, అందుకు కావలసిన కార్యాచరణ తీసుకొచ్చేలా ఆయా రాజకీయ పార్టీల బీసీ నాయకులు ఒత్తిడి తీసుకురావాలన్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఈశ్వరయ్య చెప్పారు. సమావేశంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు రావుల వెంకయ్య, అక్కినేని వనజ, ముప్పాళ్ళ నాగేశ్వరావు, జేవీ సత్యనారాయణ మూర్తి, పి.హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు