బీహార్ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ గురువారం పూర్తి అయింది. సాయంత్రం అయిదు గంటలకల్లా 65 శాతం ఓట్లు పోలైనట్టు అంచనా. కొన్ని చోట్ల మామూలుగా కన్నా పది శాతం ఎక్కువ పోలింగ్ జరగడం దేనికి సంకేతమో చూడాలి. అధికారపక్షానికి దిక్కు తోచడం లేదు. ప్రతిపక్షాలు అత్యంత ఉత్సాహంగా కనిపిస్తున్నాయి. ఇరవై ఏళ్లుగా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి అధికారం నిలబెట్టు కోగలరా లేదా అన్నది ఆసక్తికరమైన అంశంగా మారింది. నితీశ్ కుమార్‌ను పక్కకు తోసేసి తామే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీ గట్టి సన్నాహాలే చేసింది. జేడీ(యు) నాయకత్వంలో ఉన్న ఎన్డీయేకు కాలం చెల్లినట్టే కనిపిస్తోంది. ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు సమ్రాట్ చౌదరి, విజయ్‌సిన్హా పరిస్థితి అనుమానంగా ఉంది. బీజేపీ తానే అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తు న్నందువల్ల ముఖ్యమంత్రి అభ్యర్థి పేరేదీ ప్రకటించలేదు. దీనికి విరుద్ధంగా ప్రతిపక్షాల మహాకూటమి గెలిస్తే రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) నాయకుడు తేజస్వీ యాదవ్ ముఖ్యమంత్రి అవుతారని కూడా ప్రకటించింది. నిరుద్యోగం, వలసలు, అవినీతి, విద్య, ఆరోగ్య సంరక్షణ లాంటి అంశాలను ప్రధాన చర్చనీయాంశాలుగా మలచడంలో తేజస్వీయాదవ్ సఫలమయ్యారు. 20 ఏళ్లపాటు అధికారంలో ఉన్న నితీశ్ ప్రభుత్వంపై జనంలో అసమ్మతి ఉండడం సహజమే కానీ ఈ అసమ్మతి ఆయన మీద కాకుండా బీజేపీపై ఎక్కువగా కనిపించింది. చిరాగ్ పాశ్వాన్ కిందటి సారి ఒంటరిగా పోటీ చేసి నితీశ్ కుమార్ పార్టీ విజయావకాశాలను దెబ్బ తీశారు. కానీ ఈ సారి ఆయన ఎన్డీయే భాగస్వామిగా పోటీ చేస్తున్నారు. కానీ బీజేపీ ఓట్లు ఆయన పార్టీకి బదిలీ అవుతాయో లేదో సందిగ్ధంగా ఉంది. ఇదివరకు ఎన్డీయేను గెలిపించిన వారు, ముఖ్యంగా నితీశ్ పార్టీ మద్దతుదార్లు ఈ సారి ఆర్‌జేడీ పక్షాన నిలబడే సూచనలు కనిపిస్తున్నాయి. నితీశ్ పార్టీ మునుపటికన్నా ఎక్కువ సీట్లు సంపాదించవచ్చు. ముస్లిం ఓట్లు ఎంఐఎం, జన సురాజ్ పార్టీ మధ్య చీలుతాయా లేదా ఆర్‌జేడీ వేపు వెళ్తాయా అన్నది చెప్పలేని స్థితి ఉంది. ప్రతి ఇంటికి ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇస్తామన్న తేజస్వీ యాదవ్ వాగ్దానం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆ లెక్కన 1.3 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వవలసి వస్తుంది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పోటీ చేస్తున్న శాసన సభా నియోజక వర్గం, తేజస్వీ యాదవ్ పోటీ చేస్తున్న రాఘోపూర్ నియోజక వర్గాలకు గురువారమే పోలింగ్ జరిగింది. ఆర్‌జేడీ అధిపతి లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్ మొదటి దశ పోలింగ్‌లోనే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇవాళ మధ్య బీహార్‌లోని 121 స్థానాలకు పోలింగ్ జరిగింది. 2020 ఎన్నికలలో ప్రతిపక్ష మహా ఘట్బంధన్ ఈ నియోజక వర్గాలలో మంచి పట్టు సంపాదించింది. అప్పుడు ఈ 121 స్థానాలలో 63 సీట్లు ప్రతిపక్షాలకే దక్కాయి. బీజేపీ, జేడీ(యు) కు కలిపి 55 స్థానాలు దక్కాయి. నితీశ్ కుమార్ భవిష్యత్తు ఏమిటి అన్న ప్రశ్నకన్నా ఎన్నికల కమిషన్‌ను పరికరంగా మార్చుకుని ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ ఏ మేరకు సఫలం అవుతుందన్నది పెద్ద ప్రశ్న. ఎన్నికలు జరగడానికి దాదాపు రెండు నెలల ముందే బీహార్‌లో జ్ఞానేశ్ కుమార్ నాయకత్వంలోని సమగ్ర, సునిశిత ఓటర్ల జాబితా సవరణ పెద్ద దుమారమే రేపింది. ఓటర్ల జాబితాలో కొత్తగా అర్హులైన వారి పేర్లు చేర్చడం మీద కన్నా ఉన్న ఓటర్ల పేర్లు ఏదో ఒక సాకుతో తొలగించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎన్నికల కమిషన్‌ను గుప్పెట్లో పెట్టుకుని అధికారం సంపాదించడానికి మోదీ నాయకత్వంలోని బీజేపీ చేసిన ప్రయత్నాలు ప్రశ్నార్థకం అయ్యాయి. దాదాపు 47 లక్షల మంది ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించారు. వీరిలో ముస్లింలు, బడుగు వర్గాల వారే ఎక్కువ అంటున్నారు. అయితే ఈ ఆరోపణలను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. కానీ ఆరోపణలు ఎన్నికల కమిషన్ మీద వస్తే వాటికి జ్ఞానేశ్ కుమార్ సమాధానం చెప్పిన సందర్భాల కన్నా బీజేపీ నాయకులు జవాబు చెప్పడం అనుమానాలకు దారి తీసింది.
బీహార్‌లో జనాభా, పేదరికం రెండూ ఎక్కువే. ఉపాధి వెతుక్కుంటూ లక్షలాది మంది ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తుంటారు. మానవాభివృద్ధి సూచికలన్నింటిలో బీహార్ అధమ స్థానంలో ఉంది. కానీ అక్కడి ప్రజల్లో రాజకీయ చైతన్యం అధికమే. బీహార్‌లో ఓటింగ్ ప్రారంభం కావడానికి ఒక రోజు ముందు ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ పెద్ద బాంబు పేల్చారు. ఒక బ్రెజిల్ మహిళ పేరు హర్యానా ఓటర్ల జాబితాలో అనేక సార్లు ఉందని చెప్పారు. దీనిలో నిజానిజాలు తేలాల్సి ఉన్నప్పటికీ బీహార్ ఓటర్ల మనసులను ఇది కచ్చితంగా కలచి వేసే అంశమే. ప్రతిపక్షాలు ఇన్నాళ్లుగా చేస్తున్న వాదనకు రాహుల్ గాంధీ ఆరోపణలు అదనపు బలం చేకూరుస్తున్నాయి. బీహార్‌లో ఇప్పటిదాకా బీజేపీ సొంత బలం మీద ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది అని కూడా గుర్తుంచుకుంటే ఎన్నికల కమిషన్ బుజాల మీద తుపాకి పెట్టి ఓటర్ల జాబితాను కంగాళీగా మార్చడం వెనక బీజేపీ ఉద్దేశం ఏమిటో తేటతెల్లం అవుతుంది. ఈ సారి ప్రశాంత్ కిశోర్ నెలకొల్పిన జన సురాజ్ పార్టీ కూడా పోటీలో ఉంది. ఆయన పార్టీ ఎన్ని ఓట్లు చీలుస్తుంది, ఆ చీల్చే ఓట్లు ఎన్డీయే కూటమివా లేక ప్రతిపక్ష మహా ఘట్బంధన్‌వా అన్నది ఫలితాలను విశ్లేషిస్తే తప్ప తేలదు. వైశాలి, దర్భంగా, రాఘవపూర్, ముజఫ్ఫర్ పూర్, తానా పూర్, భక్తియార్ పూర్ తో సహా పది జిల్లాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలలో లోపాలు కనిపించాయి. కొన్ని చోట్ల ఓటు వేయదలచుకున్న అభ్యర్థి పేరు దగ్గర ఉన్న మీట పని చేయడమే లేదట. మూడు నాలుగు గంటల పాటు ఈవీఎంలు పని చేయలేదన్న ఫిర్యాదులు ఉన్నాయి. తమ ఓటులో ఏదో గడబిడ ఉందని ఓటర్లు భావిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి విజయ్ సిన్హా పోటీ చేస్తున్న లఖీసరాయ్ నియోజక వర్గంలోని 404, 405 నెంబర్లు పోలింగ్ కేంద్రాలను స్వాధీనం చేసుకున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. చప్రా జిల్లాలోని బ్రహ్మపూర్‌లో కనీసం 150 మంది ఓటర్లు తమ పేర్లు ఓటర్ల జాబితాలో కనిపించలేదంటున్నారు. కొంత మంది ఓటర్లను ఓటు వేయనివ్వలేదన్న ఫిర్యాదులూ ఉన్నాయి. కొందరు ఓటు వేయడానికి వెళ్లే సరికే వారి ఓటు వేసినట్టు చెప్తున్నారు. కావాలని ఓటింగ్ సరళిని మందగింప చేసిన ఆరోపణలూ ఉన్నాయి. పోలింగ్ జరుగుతున్న సమయంలోనే డబ్బులు, చీరలు పంపిణీ చేస్తున్న దాఖలాలు కనిపించాయి. ఈ పని చేసింది బీజేపీ వారే అంటున్నారు. ఫిర్యాదుల సరళిని పరిశీలిస్తే ఎన్ని రకాల అవకతవకలకు అవకాశం ఉందో అవన్నీ జరిగాయి. వివిధ రాష్ట్రాలకు వలస వెళ్లిన వారిని పోలింగ్‌కు తరలించడానికి బీజేపీ సకల ఏర్పాట్లూ చేసిందంటున్నారు. అవకతవకలన్నింటినీ గమనిస్తే బీజేపీ వెన్నులో ఎంత వణుకు ఉందో అర్థం అవుతోంది.
ఫిర్యాదుల మధ్య బీహార్‌లో పోలింగ్
- Advertisement -


