. సోనియాను మోసం చేసిన చరిత్ర కేసీఆర్‌ది
. తెలంగాణ కోసం కాంగ్రెస్‌లో చేరింది నేను
. పదేళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా?
. రైతు సెంటిమెట్‌ను ఆదాయ వనరుగా మార్చుకున్న బీఆర్‌ఎస్
. సీఎం రేవంత్
విశాలాంధ్ర – హైదరాబాద్ : సచివాలయం సాక్షిగా రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు ఇవాళ పండుగ చేసుకుంటున్నారన్నారు. ఉన్న ఊరిని, సొంత భూమిని తల్లిదండ్రులతో సమానంగా చూసుకుంటామని, ప్రజా ప్రభుత్వంలో మా మొదటి ప్రాధాన్యత రైతులు, ఆ తరువాత మా ఆడబిడ్డలు, ఉద్యమకారులు, విద్యార్థులు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆనాడు కేసీఆర్ రైతు బంధు ఎగ్గొడితే మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రూ.7,625 కోట్ల నిధులను విడుదల చేశామని గుర్తు చేశారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం వద్ద నిర్వహించిన రైతు భరోసా విజయోత్సవ సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అప్పుల్లో కూరుకుపోయిన రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి ఆత్మగౌరవాన్ని నిలబెట్టామన్నారు. 25 లక్షల 35 వేల 964 మంది రైతులకు రూ.20,617 కోట్లు వారి ఖాతాల్లో వేసి రుణ విముక్తులను చేశామని తెలిపారు. ఆనాడు వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టే అని కేసీఆర్ చెబితే ప్రభుత్వం వ్యాపారం చేయదు… వడ్లు కొనం అని మాట్లాడారని గుర్తు చేశారు. కానీ ప్రజా ప్రభుత్వంలో వరి పండిరచండి… చివరి గింజ వరకు కొనడమే కాదు, మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తామని మాట ఇచ్చామని తెలిపారు. మా మాటపై నమ్మకంతో రైతులు 2 కోట్ల 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండిరచి దేశంలోనే తెలంగాణను మొదటి స్థానంలో నిలిపారని అన్నారు. కేసీఆర్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను క్యాన్సర్ బారిన పడేసి మాకు అప్పగించారని… మామ శకుని అయితే అల్లుడు శనీశ్వరుడంటూ హరీశ్‌రావును ఉద్దేశించి ధ్వజమెత్తారు. శకుని మామకు తగ్గట్టు శనీశ్వర అల్లుడు జమై రైతులకు మీరేం చేశారని మాట్లాడతుండని, కాని ఆనాడు రైతు భరోసా ఇవ్వాలంటే కోకాపేటలో భూములు అమ్మిన చరిత్ర మీదని, రైతు రుణమాఫీ చేయాలంటే ఔటర్ రింగ్ రోడ్డును తెగనమ్మిండ్రని దుయ్యబట్టారు. రైతుల పేరుతో అప్పులు చేసిండు… దోపిడీ చేసిండు… రైతులకు నీళ్లిస్తామని కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు కొల్లగొట్టిండంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రైతుల ముసుగులో, రైతు సెంటిమెంట్‌ను ఆదాయ వనరుగా మార్చుకుని వేల కోట్లు సంపాదించుకున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు మీ ఆర్థిక పరిస్థితి ఏమిటని, మొయినాబాద్‌లో హరీశ్ రావుకు ఫామ్ హౌస్ ఎట్లా వచ్చిందన్నారు. జన్వాడలో కేటీఆర్‌కు, గజ్వేల్‌లో కేసీఆర్‌కు ఫామ్ హౌస్‌లు ఎట్లా వచ్చినయ్ అని, మీరు వేల కోట్ల అధిపతులయ్యారు? రాష్ట్రానికి 8 లక్షల కోట్ల అప్పు ఎలా వచ్చిందంటూ ప్రశ్నించారు. పదేళ్లలో నిజాం నవాబుల కంటే ధనవంతులయ్యారు… కానీ ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఇవాళ దివాలా తీసిందని చెప్పారు. పదేళ్లు వాళ్లు చేయలేనిది మేం మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశామని, లెక్కబెట్టుకుంటమంటే ఎల్బీ స్టేడియంలో తలలు లెక్కగట్టి అప్పచెప్పి నిరూపిస్తామన్నారు. పదేళ్లలో మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. 18 నెలల్లో 1 లక్షా 4 వేల కోట్లు కేవలం రైతుల కోసం ఖర్చు చేసిన రైతు ప్రభుత్వం మాదని, రైతును రాజుగా చేసి వ్యవసాయాన్ని పండుగ చేసిన ప్రజా పాలన అని తెలిపారు. దీనిపై చర్చకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారా అని అడిగారు. కాళేశ్వరం పేరుతో మీరు లక్ష కోట్లు కొల్లగొడితే… వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ఉక్కు సంకల్పంతో ప్రజా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళుతున్నామని చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా వారిని ప్రోత్సహిస్తున్నామని, ప్రజలు ఈ విషయంలో ఆలోచన చేయండి… అంచనా కట్టండి… బేరీజు వేయండి… పదేళ్ల వాళ్ల పాలన ఎలా ఉందో… 18 నెలల మా పాలన ఎలా ఉందో చర్చ పెట్టండని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.
కల్వకుర్తి… భీమా… నెట్టెంపాడు ఎందుకు పూర్తికాలేదు?
తెలంగాణకు గోదావరి నీటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందంటూ విమర్శలు చేస్తున్న బీఆర్‌ఎస్ నాయకులు బనకచర్లపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్ చేశారు. గోదావరి`బనకచర్లపై శాసన సభలో చర్చ పెడదామని… దీనిపై మీరే స్పీకర్‌కు లేఖ రాయండి… మీరు చెప్పిన తారీకున అసెంబ్లీ పెట్టించే బాధ్యత మా మంత్రి శ్రీధర్ బాబు తీసుకుంటారని చెప్పారు. గోదావరి జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిందెవ్వరో నువ్వు నేను చర్చ చేద్దాం… మొత్తం వివరాలతో నేనే వస్తానంటూ సీఎం ప్రకటించారు. కేసీఆర్ కుట్రలు, కుతంత్రాలతో కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన సాగునీటి ప్రాజెక్టులను ఒక్కటి కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. కాళేశ్వరం కూలేశ్వరమై లక్ష కోట్లు గోదావరిలో కలిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు కూలిపోయినందుకు నిన్ను కాళేశ్వరంలోనే ఉరి తీసినా తప్పు లేదని అక్కడి రైతాంగం అంటున్నది నిజం కాదా అంటూ ధ్వజమెత్తారు. కేసీఆర్ కాంట్రాక్టర్లకు రూ.2 లక్షల కోట్లు చెల్లించిండు… మరి వెయ్యి కోట్లతో పూర్తి కావాల్సిన కల్వకుర్తి ఎందుకు ఆగిపోయిందని నిలదీశారు. రూ.300 కోట్లతో పూర్తి కావాల్సిన భీమా, రూ.200 కోట్లతో పూర్తి కావాల్సిన నెట్టెంపాడు ఎందుకు పూర్తి కాలేదు. అలాగే రూ.6 వేల కోట్లతో పూర్తి కావాల్సిన సీతారామ ప్రాజెక్టు ఎందుకు ఆగిపోయింది… దేవాదుల పూర్తి చేస్తే 4 వేల ఎకరాలు సాగయ్యేవి… ఎందుకు పూర్తి చేయలేదంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులపై సీమాంధ్రులు నిర్లక్ష్యం వహించారన్న నువ్వు… పదేళ్లలో ఇంకొక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశావా అంటూ నిలదీశారు. ఈ దుర్మార్గానికి నువ్వు, నీ కుటుంబం కారణం కాదా, లక్ష కోట్లు దోచుకుని, వేల ఎకరాలు ఆక్రమించుకుని ఇవాళ బనకచర్ల విషయంలో నాపై దుర్మార్గపు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. నేను చంద్రబాబుతో అంటకాగాలనుకుంటే అక్కడే ఉండేవాణ్ణి కదా? రాజీవ్ గాంధీ ఆశీర్వాదం తీసుకునేందుకు ఇక్కడికి ఎందుకు వచ్చేవాడిని కేసీఆర్ అంటూ అడిగారు. సోనియమ్మను నమ్మకద్రోహం చేసిన చరిత్ర నీదైతే… తెలంగాణలో ప్రజా ప్రభుత్వం తేవాలని చంద్రబాబును కాదని కాంగ్రెస్‌లో చేరి ప్రజలతో కదం కదం కలిపానని సీఎం రేవంత్ అన్నారు.