Sunday, December 1, 2024
Homeసంపాదకీయంమండుతున్న మణిపూర్‌నిశ్చేష్టంగా మోదీ

మండుతున్న మణిపూర్‌నిశ్చేష్టంగా మోదీ

గత గురువారం నుంచి మణిపూర్‌ మళ్లీ భగ్గుమంటోంది. హింసకు దిగినవారిని కట్టడి చేయడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించాడు. పరిస్థితిని అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అదనంగా మరో 50 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలను పంపింది. దీనితో మణిపూర్‌లో నియోగించిన కేంద్ర సాయుధ పోలీసుదళాల సంఖ్య అయిదువేలకు చేరింది. సోమవారం నాటికి హింసాత్మక సంఘటనలు మరింత పెచ్చరిల్లాయి. మెయితీ వర్గానికి చెందిన రెండేళ్ల బాలుడి తల లేని మొండెం, ఆ బాలుడి నాయనమ్మ అర్థ నగ్న మృతదేహం బరాక్‌ నదిలో తేలుతూ కనిపించాయి. మెయితీలు, కుకీల మధ్య ఘర్షణల్లో మరో ఆరుగురు మరణించారంటున్నారు. భద్రతా దళాలకు కుకీ ఆందోళన కారులకు మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. పరిస్థితి విషమించిన తరవాత మణిపూర్‌లోని చాలా చోట్ల కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్‌ సదుపాయాన్ని నిలిపివేశారు. పాఠశాలలు, కళాశాలలతో పాటు అన్ని విద్యా సంస్థలను మంగళవారం దాకా మూసేశారు. ఈ లోగా మణిపూర్‌లో అధికారంలో ఉన్న ఎన్‌.డి.ఎ. ప్రభుత్వానికి నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ నాయకుడు కోన్రాడ్‌ సంగ్మా మద్దతు ఉపసంహరించారు. అయితే ఎన్‌.డి.ఎ. ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీలేదు. మణిపూర్‌ ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ అసమర్థత, తన బాధ్యతను పూర్తిగా విస్మరించిన మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఉదాసీనత వల్ల గత 19 నెలలుగా మణిపూర్‌ అగ్నిగుండంగా మారింది. మణిపూర్‌లో పరిస్థితిని చక్కదిద్దడానికి మోదీ సర్కారు ఇంతవరకు చేసింది ఏమీలేదు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఉదాహరణ ప్రాయంగా ఒక్కసారి మణిపూర్‌ వెళ్లివచ్చారు. కానీ ఆయన ఘర్షణ పడ్తున్న మెయితీ, కుకీల ప్రతినిధులతోగానీ, సామాన్య ప్రజలతోగానీ సంప్రదింపులు జరపనేలేదు. కనీసం బాధితులను పరామర్శించిన పాపాన కూడా పోలేెదు. అతిథిగృహంలో కూర్చుని కొంతమంది ఉన్నతాధికారులను పిలిపించి పరిస్థితిని సమీక్షించాననిపించుకుని దిల్లీ వెళ్లిపోయారు. ప్రధానమంత్రి మోదీ అయితే దేశదేశాలూ తిరుగుతున్నారు కానీ 2023 మే మూడు నుంచి మణిపూర్‌లో హింసాత్మక సంఘటనలు జరుగుతున్నా ఆ రాష్ట్రాన్ని సందర్శించాలన్న ఆలోచనే ఆయనకు రాలేదు. ఈ లోగా డజన్ల కొద్దీ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. అనేక విదేశీయాత్రలు చేసి వచ్చారు. ఇప్పుడు కూడా ఆయన విదేశీ యాత్రల్లోనే ఉన్నారు. మణిపూర్‌లో అంటుకున్న అగ్గిని ఆర్పేయడానికి మోదీ చేసిందేమీ లేకపోయినా రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం నిలిపివేయిస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్న అమిత్‌ షా మణిపూర్‌లో పరిస్థితి విషమించిందని తెలిసి ప్రచారం మధ్యలోనే నిలిపివేసి దిల్లీ పరుగెత్తారు. అక్కడా ఆయన చేసిందల్లా సమీక్షా సమావేశాలు నిర్వహించడమే. హింస చెలరేగుతున్న ప్రాంతంలో పరిస్థితిని అదుపు చేయడానికి అమిత్‌ షా కూడా చేసింది, చేస్తున్నది ఏమీలేదు. మణిపూర్‌ మండిపోతుంటే ఇంత ఘోరంగా నిష్క్రియాపరత్వం ప్రదర్శించడం మోదీకి, అమిత్‌ షాకే చెల్లింది. అక్కడి గవర్నర్‌ హింస చెలరేగిన వెంటనే పరిస్థితిని కట్టడి చేయాలని అమిత్‌ షాకే కాక రాష్ట్రపతికి కూడా మొరపెట్టుకున్నారు. ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ను తొలగించాలని ఎంతమంది చెప్తున్నా మోదీ ప్రభుత్వ చెవికెక్కడం లేదు.
డబుల్‌ ఇంజన్‌ సర్కారు ఉంటే ఏ రాష్ట్రమైనా త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని, శాంతి భద్రతలు సుస్థిరంగా ఉంటాయని ఊదరగొడ్తున్న మోదీ ప్రభుత్వం మణిపూర్‌ను మాత్రం పట్టించుకోవడంలేదు. నిజానికి అక్కడ అధికారం సంపాదించడానికి మెయితీ, కుకీ జాతుల మధ్య తంపులు పెట్టిందే మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం. జాతి కలహాలు ఇప్పుడు అక్కడ పెద్ద భూతంలా తయారయ్యాయి. గత 19 నెలల కాలంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది మహిళలమీద అత్యాచారాలు జరిగాయి. మహిళలను నగ్నంగా ఊరేగించారు. ఇదంతా ఏదో పరాయి దేశంలోనో, మనకు సంబంధంలేని వ్యవహారంగానో మాత్రమే మోదీ సర్కారు భావిస్తోంది. శాంతి భద్రతలు పరిరక్షించడానికి లేదా రాజకీయ పరిష్కారం కనుగొనడానికి కానీ చేసిందేమీలేదు. భిన్న జాతుల వారి మధ్య విద్వేషంనింపి అధికారం మాత్రం సంపాదించింది. సామాజిక-రాజకీయ విభేదాలకు ఆజ్యం పోసింది. మణిపూర్‌లో కొనసాగుతున్న విధ్వంసం మునుపెన్నడూ లేనిదని, ఈ చిచ్చును చల్లార్చడానికి రాజకీయ, పరిపాలనాపరమైన తగిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు చెవిని ఇల్లుకట్టుకుని చెప్తున్నా మోదీ ప్రభుత్వంలో చలనంలేదు. మెయితీ మద్దతుదార్లు ప్రభుత్వ కార్యాలయాలకు తాళం పెడ్తున్నారు. కర్ఫ్యూ ఉల్లంఘించి మెయితీ ఉద్యమకారులు ప్రభుత్వ కార్యాలయాలను స్వాధీనం చేసుకుంటున్నారు. సోమవారం నాటికి బయటపడ్డ ఏడు మృతదేహాలు కూడా అంతకు ముందు కుకీలు అపహరించుకువెళ్లిన వారివేనంటున్నారు. ఇంఫాల్‌ లోయలోని అయిదు జిల్లాల్లో మెయితీల ప్రభావం ఎక్కువ. ఆందోళనకారులు ఎన్నికల అధికారి కార్యాలయాన్ని కూడా ఆక్రమించారు. ఇంటర్నెట్‌ సదుపాయం నిలిపివేస్తే సమస్య పరిష్కారం అవుతుందన్న ప్రభుత్వ ఆలోచన కేవలం భ్రమే. దీనివల్ల అందవలసిన సమాచారం అందకుండా పోతోంది. ఇది అదనపు సమస్యలకు దారి తీస్తోంది. మణిపూర్‌లో హింసాకాండ చెలరేగుతుంటేనే బీజేపీకి ప్రయోజనం అన్న ఆరోపణలూ వస్తున్నాయి. కనీసం వీటిని ఖండిరచడానికైనా మోదీ ప్రభుత్వంలో కదలిక కనిపించడం లేదు. మణిపూర్‌లోని వివిధ పక్షాలతో సంప్రదించాలని, ఆ తరవాత దిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి ఏం జరుగుతోందో వివరించి పరిస్థితి అదుపు చేయడానికి ఏం చేయాలో నిర్ణయించాలని ప్రతిపక్షాలు ఎన్నిసార్లు విజ్ఞప్తిచేసినా మోదీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. నవంబర్‌ 25న పార్లమెంటు సమావేశాలు మొదలయ్యే లోగా అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తే పరిస్థితి సానుకూలంగా మారుతుంది. ఈ సూచననూ మోదీ సర్కారు ఖాతరు చేయడంలేదు. ప్రతిపక్ష పార్టీలు సాధారణంగా ఏ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినా విమర్శిస్తాయి. కానీ మణిపూర్‌లో అసమర్థ ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ను తొలగించి రాష్ట్రపతి పాలన విధిóంచాలని ప్రతిపక్షాలు కోరుతున్నా మోదీ ప్రభుత్వం మౌనమే సమాధానం అన్నట్టుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం చేసిందల్లా పౌరుల మీద జరిగిన మూడు కేసుల దర్యాప్తు బాధ్యతను జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించడమే. కేంద్రం తీసుకున్న మరో చర్య ఏమిటంటే సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఎ.ఎఫ్‌.ఎస్‌.పి.ఎ.) మళ్లీ అమలు చేయడమే. బీజేపీ, కాంగ్రెస్‌ నాయకుల ఇళ్ల మీద దాడులు జరుగుతున్నాయి. శనివారం ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ చెందిన ఇంటిమీద కూడా దాడి చేశారు. ఒక ఎమ్మెల్యే అయితే తన ఇంటి చుట్టూ బంకర్లు నిర్మించుకు కూర్చున్నారు. తీవ్ర దాడులు ఎదుర్కుంటున్న మెయితీలు ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు