Homeరాజ్యాంగంపై ప్రత్యక్ష దాడి

రాజ్యాంగంపై ప్రత్యక్ష దాడి

- Advertisement -

కుల హింసపై సీపీఐ
ఒడిశా, యూపీలో బడుగులపై వివక్షకు ఖండన
దోషులపై తక్షణ చర్యల కోసం ఎన్‌హెచ్‌ఆర్‌సీకి వినతి

న్యూదిల్లీ : కుల హింస అన్నది రాజ్యాంగంపై, మానవాళిపై ప్రత్యక్ష దాడి అని సీపీఐ పేర్కొంది. బాధితులకు సత్వర న్యాయం, హేయమైన ఘటనలు జరిగిన రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి జవాబుదారీతనాన్ని డిమాండ్‌ చేసింది. సామాజిక న్యాయం, సమానత్వం కోసం తమ పోరాటం ఆగబోదని తేల్చిచెప్పింది. ఒడిశా, ఉత్తర ప్రదేశ్‌లో బలహీన వర్గాల వారిపై అగ్రకులస్తుల దాడులను అమానవీయంగా వర్ణించింది. వీటిపై తక్షణ చర్యలు కోరుతూ ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్‌పర్సన్‌, జస్టిస్‌ వి.రామసుబ్రమణ్యన్‌కు సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఆయన వెంట పార్టీ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు అనీరాజా, రామకృష్ణ పాండా, పల్లబ్‌సేన్‌ గుప్తా ఉన్నారు. ఒడిశాలోని గంజం జిల్లా, ధారకోటేలో ఇద్దరు దళితులపై భౌతిక దాడి, బలవంతపు శిరోముండనం, గడి తినిపించడం, మురికి నీరు తాగించడం… ఉత్తరప్రదేశ్‌, ఇట్టావాలో ఇద్దరు ఓబీసీలకు శిరోముండనం, దాడి, వారిపై అగ్రవర్ణాల వారు మూత్రవిసర్జన చేయడంపై సీపీఐ బృందం ఆవేదన వ్యక్తంచేసింది. అవమానకర చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించేలా ఆదేశాలివ్వాలని కోరింది. వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు సామాజిక వర్గాలను ప్రభావితం చేసే హేయమైన నేరాలకు కులాధారిత ఆధిపత్యమే కారణమని పేర్కొంది. అణగారిన వర్గాల రక్షణకు తక్షణమే పటిష్ఠ చర్యలు తీసుకోవాలని విన్నవించింది. జాతీయ నేరాల నమోదు బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాలను ప్రస్తావిస్తూ ఒక్క 2022 సంవత్సరంలోనే ఎస్‌సీలపై 57,571 దురాగతాల కేసులు నమోదైనట్లు రామసుబ్రమణ్యన్‌ దృష్టికి సీపీఐ నాయకులు తీసుకెళ్లారు. కుల హింస పెరగడం సంస్థాగత వైఫల్యమని నొక్కిచెప్పారు. రాజ్యాంగం హామీనిచ్చే సమానత్వం, గౌరవ జీవితానికి ఇవి విరుద్ధమన్నారు. పౌర హక్కుల రక్షణ చట్టం`1955, ఎస్‌/ఎస్‌టీ (దురాగతాల నివారణ) చట్టం సక్రమంగా అమలు కాకపోవడం, సంస్థాగత నిర్లక్ష్యం జరుగుతుండటానికి తోడుగా రాజకీయపరమైన మౌనం కూడా కుల హింసను ప్రోత్సహిస్తున్నదన్నారు. బలహీన వర్గాలపై వివక్ష, హేయమైన నేరాలు అరికట్టాలని, దోషులను నిర్దేశిత కాలంలోగా కఠినంగా శిక్షించాలని, ఇందుకోసం రాష్ట్రాల ప్రభుత్వాలకు తగు ఆదేశాలు జారీ చేయాలన్నారు. సీపీఐ నాయకుల విజ్ఞప్తికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్‌పర్సన్‌ సానుకూలంగా స్పందించారు. తక్షణమే తగు చర్యలను కమిషన్‌ చేపడుతుందని హామీనిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు