Homeరైతు నుంచి నేరుగా వినియోగదారుడికి…

రైతు నుంచి నేరుగా వినియోగదారుడికి…

- Advertisement -

. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌పై కొత్త వ్యూహం
. దేవరపల్లి మండలం యడవోలు వద్ద కోకో సిటీ
. జులైలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన
. పులివెందులలో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ పూర్తికి నిధులు
. వ్యవసాయ, అనుబంధ రంగాలపై చంద్రబాబు సమీక్ష

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రైతులు పండించిన ఉత్పత్తులు నేరుగా వినియోగదారుల ఇళ్లకు చేర్చేలా ఫార్మ్ టూ హోమ్ విధానం అమలు చేసేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రత్యేకించి కూరగాయలు, పండ్ల ఉత్పత్తులు నేరుగా వినియోగదారుడికి చేర్చేలా చూడాలని, తద్వారా తక్కువ వ్యయం తో లభించేలా ఈ కొత్త వ్యూహం ఉపయోగపడుతుందని అన్నారు. క్యాంపు కార్యాలయంలో మంగళవారం వ్యవసాయం, ఇతర అనుబంధ శాఖలు, ప్రాథమిక రంగంలో ఆరు మిషన్లపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈసారి రాష్ట్రంపై ఎల్‌నినో చూపుతున్న ప్రభావాన్ని అంచనా వేస్తూ ప్రాంతాల వారీగా పంటల సాగు అంచనా జరగాలని, దానికి అనుగుణంగానే చర్యలు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. వివిధ ప్రాంతాల్లో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో పీఎండీఎస్- హాఫ్‌మÖన్ విధానాల్లో సేద్యం చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎల్‌నినో కారణంగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావం ఉన్నప్పటికీ రైతులు నష్ట పోకుండా పంటలకు కనీస మద్ధతు ధర లభించేలా చూడాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ విషయంలో కేంద్ర సహకారం తీసుకుని… రాష్ట్రంలో చేపడుతున్న ప్రకృతి సేద్యానికి మరింత ప్రోత్సాహం కల్పించాలని, ఇప్పటికే ఈ సాగుతో విజయవంతమైన రైతుల సేవల్ని వినియోగించుకోవాలని సీఎం సూచించారు.
అరటికి కోల్డ్ స్టోరేజ్ సౌకర్యం
కృష్ణా, గోదావరి డెల్టా సహా వివిధ ప్రాంతాల్లో పంటలకు సాగునీటిపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. పంట తెగుళ్లను నియంత్రించేలా పురుగుమందుల వినియోగం ఏ మేరకు రాష్ట్రంలో తగ్గించగలిగామో అంచనా వేయాలని సీఎం ఆదేశించారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గించి మైక్రో న్యూట్రియంట్లు పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. యుద్ధ ప్రభావం నేపథ్యంలో రసాయన ఎరువుల లభ్యతపైనా ప్రభావం పడే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ప్రకృతి సేద్యం వైపుగా రైతుల్ని ప్రోత్సహించాలన్నారు. రాయలసీమలో అరటికి కోల్డ్ స్టోరేజి సౌకర్యం కల్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరాపల్లి సమీపంలో యడవోలు వద్ద కోకో సిటీ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. జులై నాటికి మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన చేయనున్నట్టు సీఎం వెల్లడించారు.
బ్లూ ఎకానమీగా ఆక్వారంగం ఆభివృద్ధి
పులివెందులలో సెంట్రల్ ఫుడ్ టెస్టింగ్ లేబరేటరీని పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని, దీనికి అవసరమైన రూ.3 కోట్లను తక్షణమే విడుదల చేసి కార్యకలాపాలు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఆక్వా జోన్లలో ఆక్వా సాగు చేసే రైతులకు ఇచ్చే విద్యుత్ సబ్సిడీ అంశంపైనా ముఖ్యమంత్రి కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆక్వా రంగానికి యÖనిట్‌కు రూ.1.50 చొప్ప్పున ఇప్పటికే ఇచ్చిన 50 వేల కనెక్షన్లతో పాటు కొత్తగా రిజిస్ట్రేషన్లు చేసుకున్న 12,680 ఆక్వా కనెక్షన్లకూ ఈ సబ్సిడీ వర్తింప చేయాలని ఆదేశించారు. ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,100 కోట్లు ఇస్తోందని తెలిపారు. బ్లూ ఎకానమీ దిశగా ఆక్వా రంగాన్ని ప్రోత్సహిస్తామని సీఎం స్పష్టం చేశారు. రైతు బజార్లను ఆధునికంగా మార్చేలా చర్యలు తీసుకోవాలని, 90 నియోజకవర్గాల్లో రైతు బజార్ల ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. సమీక్షకు వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు, సీఎస్ సాయి ప్రసాద్, వ్యవసాయ, ఉద్యాన, మత్స్యశాఖ, ఫుడ్ ప్రాసెసింగ్, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖల అధికారులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు హాజరయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు