డా॥ అరుణ్ మిత్ర
ఎన్నికలు దగ్గర పడే కొద్దీ కొత్త వివాదాలను సృష్టించడం ఆనవాయితీగా వస్తోంది. నిరుద్యోగం, అప్పుల భారం, విద్య, ఆరోగ్యం, అభివృద్ధి వంటి ప్రధాన అంశాలపై దృష్టి సారించాల్సిన సమయంలో, రాజకీయ చర్చలు భావోద్వేగాలను రెచ్చగొట్టే, సమాజంలో విభేదాలను పెంచే అంశాల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఈ అంశాలే రాజకీయ నాయకులకు వరంగా మారుతున్నాయి. ఘర్షణలు, హింస కారణంగా పంజాబ్ భారీ మూల్యం చెల్లించింది. ముఖ్యంగా 1980లలో, 1990ల సమయంలో రాష్ట్రం చీకటి దశను ఎదుర్కొంది. ఆ తరువాత అక్కడ శాంతిని పునరుద్ధరించడానికి, సమాజాన్ని తిరిగి మామూలు పరిస్థితికి తీసుకురావడానికి పంజాబ్ ప్రజలు ఎంతో కృషి చేశారు. పంజాబ్ చరిత్ర కేవలం ఘర్షణలకే కాదు ధైర్యం, త్యాగం, ప్రతిఘటనకు కూడా ప్రతీకగా నిలిచింది. శతాబ్దాలుగా విదేశీ దండయాత్రలను ప్రతిఘటించడంలో పంజాబ్ ముందంజలో ఉంది. భారత స్వాతంత్ర్య పోరాటంలో ఈ రాష్ట్రం పోషించిన పాత్ర విశేషమైంది. గదర్ ఉద్యమం పంజాబ్ విప్లవ వారసత్వానికి చిహ్నంగా నిలిచింది. షహీద్ భగత్‌సింగ్, కర్తార్‌సింగ్ సరాభా, సుఖ్‌దేవ్ థాపర్, ఉదమ్ సింగ్, లాలా లజపత్ రాయ్, తేజా సింగ్ సుతంతర్, సోహన్ సింగ్ జోష్‌తో పాటు అనేక మంది కమ్యూనిస్టు విప్లవకారులు సామ్రాజ్యవాదం, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. స్వాతంత్య్రం అనంతరం దేశ నిర్మాణంలో పంజాబ్ ప్రజలు కీలక పాత్ర పోషించారు. విస్తీర్ణంలో చిన్నదే అయినప్పటికీ, పంజాబ్ దేశ ఆహార భద్రతకు అపూర్వమైన సేవలందించింది. అయితే, 1978 ఏప్రిల్ 13న అఖండ్ కీర్తనీ జథా, దమ్దమీ తకాస్ల్, నిరంకారీ సంఘం మధ్య జరిగిన ఘర్షణతో పంజాబ్ చరిత్ర విషాదకర మలుపు తిరిగింది. అదే రాష్ట్రంలో దీర్ఘకాలిక అస్థిరతకు నాంది పలికింది. క్రమంగా పంజాబ్ ఉగ్రవాదం, వేర్పాటువాదం, ప్రభుత్వ అణచివేతల వలయంలో చిక్కుకుపోయింది. దీంతో ఇక్కడి ప్రజలు ఎన్నో ఏళ్ల పాటు హింస, భయాందోళనలను ఎదుర్కొన్నారు. అధికారిక గణాంకాల ప్రకారం, 1981 నుంచి 1993 మధ్య పంజాబ్‌లో ఉగ్రవాద హింస కారణంగా 21,350 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 11,690 మంది సాధారణ పౌరులు, రాజకీయ నాయకులు, 1,714 మంది పోలీసులు, పారామిలిటరీ సిబ్బంది, 7,946 మంది మిలిటెంట్లు ఉన్నారు. ఈ సమయంలో అన్ని మతాలు, వర్గాలకు చెందిన ప్రజలు నష్టపోయారు. మొదట్లో పోలీసు బలగాలు సాయుధ మిలిటెంట్లను ఎదుర్కోవడానికి వెనుకాడింది. ఎపðడైతే డీజీపీగా జూలియో రిబీరో నియమితులయ్యారో అప్పుడే ఇక్కడి పరిస్థితుల్లో మార్పులు రావడం మొదలయ్యింది. పోలీసు బలగాల్లో విశ్వాసాన్ని నింపి శాంతిభద్రతలు, మతసామరస్యాన్ని పరిరక్షించేలా వారిని ప్రోత్సహించారు. ఆ తర్వాత ఆయన స్థానంలో కె.పి.ఎస్. గిల్ నియమితులయ్యారు. ఆయన నాయకత్వంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం తీవ్రమైంది. ఇలాంటి క్లిష్ట సమయంలో సీపీఐకి చెందిన ఎంతోమంది కార్యకర్తలు దేశ సమగ్రత, సార్వభౌమాధికారాన్ని కాపాడేందుకు తమ ప్రాణాలను అర్పించారు. వారు “ హిందూ రాజ్యం వద్దు, ఖలిస్తాన్ వద్దు’ అనే నినాదాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. అదే సమయంలో పంజాబ్ ప్రజలు ప్రదర్శించిన సంయమనం కూడా విశేషమైనదే. 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక మారణకాండ తర్వాత పంజాబ్‌లో ప్రతీకార మతకలహాలు చోటుచేసుకోలేదు. అంటే అక్కడి సామాజిక ఐక్యత ఎంత బలంగా ఉందో చూపించే ఒక ఉదాహరణ. ఉగ్రవాదం విస్తరించడంతో తీవ్రవాద సంస్థలు మతపరమైన ప్రార్థనా స్థలాలను తమ కార్యకలాపాల కేంద్రాలుగా ఉపయోగించడం ప్రారంభించాయి. ఈ పరిస్థితులు 1984 జూన్‌లో నిర్వహించిన ఆపరేషన్ బ్లూ స్టార్‌కు దారితీశాయి. ఆ సమయంలో దెబ్బతిన్న అకాల్ తఖ్త భవనాన్ని ప్రభుత్వం పునర్నిర్మించినప్పటికీ, అనంతరం సిక్కు సమాజం స్వయంగా మరోసారి దానిని పునర్నిర్మించింది. ఈ పరిణామాల అనంతరం ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారు. ఆపరేషన్ బ్లూ స్టార్ తప్పనిసరిగా చేపట్టాల్సిన చర్యేనా లేక ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించవచ్చా అనే అంశంపై ఇప్పటికీ చర్చ కొనసాగుతోంది.
అయితే ఆ సమయంలో పంజాబ్ భయాందోళనల్లో కూరుకుపోయిందనే విషయంపై ఎలాంటి విభేదాలు లేవు. మిలిటెంట్లు కర్ఫూయూలు విధించడం, ప్రజల దైనందిన జీవితంపై ఆంక్షలు పెట్టడం, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించవద్దని ఆదేశించడం, మహిళల దుస్తులపై నియమాలు విధించడం వంటి చర్యలకు పాల్పడ్డారు. మతం, వర్గంతో సంబంధం లేకుండా ప్రజలందరిలో భయం, అనుమానాలు నెలకొన్నాయి. ఉగ్రవాదం మరోసారి పంజా విసరడంతో 1986లో అకాలీ ప్రభుత్వ హయాంలో ఆపరేషన్ బ్లాక్ థండర్ ప్రారంభించారు. అనంతరం 1988లో మరో దశ ఆపరేషన్ ద్వారా శ్రీ హర్మందిర్ సాహిబ్ (స్వర’ దేవాలయం) ప్రాంగణం నుంచి మిలిటెంట్లను బయటకు పంపారు. ఆపరేషన్ బ్లూ స్టార్‌తో పోలిస్తే బ్లాక్ థండర్ పారదర్శకంగా జరగడంతో ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం కాలేదు. అయితే ఇప్పటికీ కొన్ని కీలక ప్రశ్నలకు సమాధానాలు లభించలేదు. సిక్కు మతంలో పవిత్రమైన ప్రార్థనా స్థలాల్లోకి అత్యాధునిక ఆయుధాలు ఎలా వచ్చాయి ? అనే ప్రశ్నకు సమాధానం ఇంతవరకూ దొరకలేదు. ఆ కాలంలో జరిగిన పరిణామాలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసాయి. మరోవైపు ఉగ్రవాద సంస్థలు సాధారణ ప్రజలపై దాడులకు పాల్పడటంతో, తాము ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకున్న ప్రజల మద్దతునే కోల్పోయి 1993 నాటికి ఉగ్రవాదం చాలావరకు తగ్గిపోయింది. ఈ హింసాకాండలో బాధితులైన వేలాది మందికి న్యాయం జరగలేదు. ఒక్క రాత్రిలో ఎన్నో కుటుంబాలు తుడిచిపెట్టుకుపోయాయి. ప్రస్తుతం పంజాబ్ ఇస్త్రీ సభ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న నరిందర్ సోహల్ చిన్న వయసులోనే ఉగ్రవాదుల చేతిలో తన కుటుంబ సభ్యులను కోల్పోయినవారే. ఆమె లాంటి ఎంతోమంది బాధితులు జీవితాంతం అనుభవించిన మానసిక వేదన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మారణకాండలో వేలాది మంది పిల్లలు తమ తల్లిదండ్రులను, విద్యను, భద్రతను, భవిష్యత్ అవకాశాలను కోల్పోయారు. ఆ కాలంలో కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని ఎదుర్కోవడంలో ఉన్న తీవ్రమైన లోపాలను, అలాగే ప్రభుత్వ యంత్రాంగం చేసిన దుర్వినియోగాలను బహిర్గతం చేసింది. వేలాది మంది పోలీసులు ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ధైర్యంగా పోరాడినప్పటికీ ఎన్కౌంటర్లు, బలవంతపు అదృశ్యాలు, అక్రమ వసూళ్లు, అధికార దుర్వినియోగం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ పరిస్థితులను ఆసరాగా చేసుకుని కొందరు అధికారులు, ఇతర వ్యక్తులు అక్రమంగా అపారమైన సంపద కూడబెట్టారన్నారు. ఈ ఉల్లంఘనలు ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసి, అసంతృప్తిని పెంచాయి. మూడు దశాబ్దాల క్రితంతో పోలిస్తే నేటి పంజాబ్ చాలా ప్రశాంతంగా ఉన్నప్పటికీ, కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, బెదిరించి డబ్బు వసూలు చేయడం, అంతర్జాతీయ నేర ముఠాల కార్యకలాపాలు ప్రజల భద్రతకు ముప్పుగా మారుతున్నాయి. చట్టాలను అమలు సంస్థల అధికారుల పేర్లను ఉపయోగించి భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. మరోవైపు పంజాబ్ ఆర్థిక పరిస్థితి క్రమంగా దిగజారుతోంది. రాష్ట్ర అప్పులు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి. వీటితో పాటు నిరుద్యోగం పెరుగుతోంది. ప్రభుత్వ శాఖల్లో వేలాది ఉద్యోగ ఖాళీలు భర్తీ కావడం లేదు. విద్య, వైద్య సేవలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. వ్యవసాయం, పరిశ్రమలు, ఉపాధి రంగాల్లో అత్యవసర విధానపరమైన జోక్యం అవసరం. ద్వేషం, విభజనల కారణంగా పంజాబ్ ఇప్పటికే భారీ మూల్యం చెల్లించింది. అందువల్ల ఎన్నికల లాభాల కోసం పాత గాయాలను మళ్లీ రేపడం కంటే, సామాజిక సామరస్యాన్ని బలోపేతం చేయడం, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడం, ఉపాధి అవకాశాలను పెంచడం, విద్య, వైద్య రంగాలను మెరుగుపరచడం, ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం, భావితరాలకు మెరుగైన భవిష్యత్తు నిర్మించడం వంటి అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సమాజంలో శాంతి, పరస్పర విశ్వాసం, సహజీవన స్ఫూర్తిని దెబ్బతీసే అంశాలపై కాకుండా, ఈ అత్యవసర సవాళ్లపై ప్రజా చర్చలు జరగాలి.


