నటి ప్రత్యూష మృతి కేసుపై సుప్రీం తీర్పు
న్యూదిల్లీ : రెండు దశాబ్దాల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు మంగళవారం తుది తీర్పు వెల్లడించింది. ఈ కేసులో హైకోర్టు విధించిన జైలుశిక్షను సవాల్ చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. నిందితుడికి గతంలో హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సమర్థించిన సుప్రీం ధర్మాసనం… నాలుగు వారాల్లో లొంగిపోవాలని సిద్ధార్థరెడ్డిని ఆదేశించింది. ఈ కేసులో పోస్టుమార్టం జరిగిన తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పోస్టుమార్టం నిర్వహించిన పద్ధతి సరిగా లేదని అభిప్రాయపడింది. ప్రత్యూష, సిద్ధార్థరెడ్డి హైదరాబాద్‌లో ఇంటర్ చదువుతున్నప్ప్పుడు ప్రేమించుకున్నారు. ఇంటర్ పూర్తయిన అనంతరం ప్రత్యూష సినిమాల్లోకి వెళ్లగా… సిద్ధార్థరెడ్డి ఇంజినీరింగ్‌లో చేరాడు. 2002 ఫిబ్రవరి 23 సాయంత్రం 7.30-8 గంటల మధ్య ఇద్దరూ విషం తాగిన పరిస్థితిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ప్రత్యూష 24న చనిపోయారు. చికిత్స అనంతరం మార్చి 9న సిద్ధార్థరెడ్డి డిశ్చార్జి అయ్యాడు. వారు కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలిపి తాగినట్లు పరీక్షల్లో గుర్తించారు. ఆర్గానోఫాస్ఫేట్ కారణంగా ప్రత్యూష మరణించారని, ఊపిరాడకుండా చేయడం, మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి వంటివి జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ముగ్గురు వైద్యుల బృందం నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా దర్యాప్తు జరిపిన సీబీఐ… నిందితుడిపై 306 (ఆత్మహత్యకు పురికొల్పడం), 309 (ఆత్మహత్యకు యత్నించడం) సెక్షన్ల కింద చార్జిషీట్ దాఖలు చేసింది. నిందితుడు సిద్ధార్థరెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఐదేళ్ల కఠిన కారాగారశిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ 2004 ఫిబ్రవరి 23న తీర్పు ఇచ్చారు. దీనిపై సిద్ధార్థరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా… జైలుశిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ, జరిమానాను రూ.50 వేలకు పెంచుతూ 2011 డిసెంబరు 28న తీర్పు వెలువరించింది. దీనిపై సిద్ధార్థరెడ్డి, ప్రత్యూష తల్లి సరోజినీదేవి 2012లో సుప్రీంకోర్టులో వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై ఇటీవల విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం… తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాలంటూ తీర్పు వెలువరించింది.
24 ఏళ్లుగా నరకం: ప్రత్యూష తల్లి
తన కుమార్తె మృతి కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రత్యూష తల్లి సరోజినీదేవి స్పందించారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తున్నానని, కానీ తమకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని అన్నారు. ప్రత్యూష మృతి సమయంలో కొన్ని బెదిరింపులు వచ్చాయని, తన కూతురిది ఆత్మహత్య కాదు హత్యేనని ఆమె తెలిపారు. న్యాయం కోసం మొదటి నుంచీ ఒంటరి పోరాటం చేస్తున్నానని, ఉన్నతస్థాయికి చేరుకోవాల్సిన తన కూతురి జీవితం నాశనమైందన్నారు. నిందితుడు సిద్ధార్థరెడ్డి విదేశాల్లో ఉన్నాడని తెలిసిందన్నారు. ఈ కేసును తొలి దశలోనే తారుమారు చేశారని ఆరోపించారు. తన వద్ద ఉన్న కొన్ని సాక్ష్యాలతోనే పోరాటం చేస్తూ వచ్చానని, అప్ప్పుడే అన్ని సాక్ష్యాలు ఉండి ఉంటే అతడికి తప్పకుండా జీవితకాల శిక్ష పడేదని అభిప్రాయపడ్డారు. కన్నతల్లిగా తాను ఇచ్చిన వాంగ్మూలం పక్కన పెట్టేశారన్నారు. 24 ఏళ్లుగా నరకం అనుభవిస్తున్నానని, ఇన్నేళ్లలో ఎవరూ తనకు తోడుగా నిలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు.


