Homeఅమరావతిలోటాటా ఇన్నోవేషన్‌ హబ్‌

అమరావతిలోటాటా ఇన్నోవేషన్‌ హబ్‌

- Advertisement -

ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఏపీ స్టార్టప్‌ ఆవిష్కరణల కేంద్రంగా మారుతుందని వెల్లడి

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ఆవిష్కరణలకు కేంద్రంగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. యువ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, స్టార్టప్‌లకు ఊతమిచ్చేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ పనిచేస్తుందన్నారు. అమరావతితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఐదు చోట్ల ఇన్నోవేషన్‌ కేంద్రాలను హబ్‌ అండ్‌ స్పోక్‌ మోడల్‌లో ఏర్పాటు చేసినట్టు వివరించారు. బుధవారం మంగళగిరిలోని మయూరి టెక్‌ పార్కులో ఏర్పాటు చేసిన రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ను టాటా సన్స్‌ చైర్మన్‌ చంద్రశేఖరన్‌ తో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… రతన్‌ టాటా నిరాడంబరత, దేశానికి చేసిన సేవ అందరికీ ఆదర్శమన్నారు. రతన్‌ టాటా ఆలోచనల్ని భవిష్యత్‌ తరానికి అందించాలన్న లక్ష్యంతోనే ఇన్నోవేషన్‌ హబ్‌లను ప్రారంభించామని… విజయవాడ, విశాఖ, తిరుపతి, అనంతపురంలోనూ దీనికి అనుబంధంగా కేంద్రాలు పనిచేస్తాయని తెలిపారు. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో ఇన్నోవేషన్‌ కేంద్రాలు ఉండాలని నిర్ణయించినట్లు వెల్లడిరచారు. యువతకు ఉన్న వినూత్న ఆలోచనల్ని క్రోడీకరించి ప్రోత్సహించేలా ఈ ఇన్నోవేషన్‌ హబ్‌ పని చేస్తుందని, యువపారిశ్రామిక వేత్తలు అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు. అమరావతి నగరం క్వాంటం కంప్యూటింగ్‌ హబ్‌ గా అభివృద్ధి చెందుతుందని… తద్వారా రియల్‌ టైమ్‌ డేటాను విశ్లేషించి క్షేత్రస్థాయిలో అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఒక వైపు సందప సృష్టిస్తూనే… మరోవైపు పేదల జీవన ప్రమాణాల్ని మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీగా ఏపీని మారుస్తామన్నారు.
విద్యార్థి దశనుంచే ఆవిష్కరణలపై దృష్టి: లోకేశ్‌
విద్యార్థి దశనుంచే ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని ఐటీ,విద్యాశాఖా మంత్రి నారా లోకేష్‌ పిలుపునిచ్చారు. ఆవిష్కరణలకు వనరులు అడ్డంకి కాదన్నారు. ఇన్నోవేషన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియాగా ఏపీని తీర్చిదిద్దేందుకు దిగ్గజ పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలతో కల్సి పనిచేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. టాటా సన్స్‌ చైర్మన్‌ చంద్రశేఖరన్‌ మాట్లాడుతూ… ఇన్నోవేషన్‌ కేంద్రాల ద్వారా ఆరోగ్యం, డిఫెన్సు, వ్యవసాయం ఇలా వేర్వేరు రంగాల్లో పరిష్కారాలకు స్టార్టప్‌ లకు అవకాశాలున్నాయన్నారు. ఎన్నో ఆలోచనల సమాహారంగా ఈ రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ మారుతుందని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు తన దార్శనికతతో కొద్ది సమయంలోనే రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ కు రూపం ఇచ్చారని చంద్రశేఖరన్‌ అభినందించారు.
రికార్డుల స్థాయి రిజిస్ట్రేషన్లు…గిన్నిస్‌ రికార్డు
ఏపీలో ఇన్నోవేషన్‌, బిజినెస్‌ స్టార్టప్‌ ల కోసం రికార్డు స్థాయిలో 1,67,321 రిజిస్ట్రేషన్లు జరిగాయి. 24 గంటల్లో ఈ స్థాయి రిజిస్ట్రేషన్లు జరగటంపై ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీకి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు నమోదైంది. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డును ఆ సంస్థ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు అందజేశారు. రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభోత్సవం సంద ర్భంగా మయూరి టెక్‌ పార్క్‌ ప్రాంగణంలో వివిధ స్టార్టప్‌ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించిన స్టాళ్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. మంత్రు లు లోకేశ్‌, నాదెండ్ల, టీజీ భరత్‌, భారత్‌ ఫోర్జ్‌ చైర్మన్‌ బాబా కల్యాణి, అమర్‌ రాజా బ్యాటరీస్‌ చైర్మన్‌ జయదేవ్‌ తదితరులు హాజరయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు