రాజన్ క్షీరసాగర్
అమెరికా-భారత్ మధ్య కుదిరింది వాణిజ్య ఒప్పందం కాదు దేశాన్ని తాకట్టు పెట్టే లొంగుబాటు చర్య. అమెరికా వాణిజ్య ఉచ్చులో మోదీ పడిపోవడమే కాదు దేశాన్ని కూడా పడేసారు.అమెరికా పత్రాలపై మంత్రులు, ప్రధానులు సంతకాలు చేసి ఈ ఒప్పందాన్ని దౌత్య విజయంగా చెప్పుకుంటున్నారు కానీ పంట పండించే రైతులు, ప్రజలు మూల్యం చెల్లించుకునే స్థితికి తెచ్చాడు మోదీ. రాత్రికి రాత్రి పెద్దన్నతో చేతులు కలిపేశాక గోదీ మీడియా తెల్లార్లు కోడై కూసేసింది. భారతదేశం 500 బిలియన్లకు పైగా అమెరికా ఉత్పత్తుల కొనుగోలుకు “కట్టుబడి ఉంది” అంటూ టముకేసుకుంది. కానీ పెద్దన్న మామూలోడు కాదన్న విషయం ప్రపంచమంతటికి తెలుసు ఒక్క మోదీకి తప్ప. ఈ ట్రేడ్ డీల్ ప్రకటన విడుదలైన 24 గంటల్లోనే అమెరికా ఆ ప్రకటనను తనకు అనుకూలంగా మార్చేసుకుంది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జిటిఆరఐ) అంచనా ప్రకారం, బోయింగ్ విమానాలు ఎలఎన్జి కొనుగోలు చేసినా కూడా, ఐదేళ్లలో 150-200 బిలియన్‌లు మాత్రమే అవుతుంది తప్ప 500 బిలియన్‌లు అవదు. మరి మోదీ ఇంత పెద్ద సంఖ్యను చెప్పేసి భారత్ జుట్టును అమెరికా చేతికి ఇచ్చేశాడు. ఒకవేళ ఈ టార్గెట్ పూర్తి కాకపోతే పెద్దన్న ఎంతకైనా తెగిస్తాడన్న విషయం ప్రధానికి ఎందుకు పట్టడం లేదో అర్ధం కావట్లేదు. మన దేశ రైతులు అమెరికాతో పోటీ పడగలరు అంటూ మంత్రులంతా టీవీ కార్యక్రమాలకు వెళ్లి ప్రసంగాలిచ్చేస్తున్నారు. మరి క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. అమెరికా ట్రేడ్ డీల్‌ని అంత తొందరగా ఒప్పుకోవాల్సిన అవసరం ఏంటి ,కేంద్రం కొన్ని రోజులు ఆగి ఉంటె బాగుండేదనే విమర్శలు వినిపిస్తున్నాయి .అమెరికా ప్రభుత్వం తన రైతులకు సబ్సిడీ కింద ప్రతి సంవత్సరం 21.7 బిలియన్ డాలర్‌లను ఇస్తుంది. మన దేశంలో మాత్రం 12 కోట్ల రైతులకు గాను ఒక్కో రైతుకు అందే సాయం నామమాత్రం. 2025-26 సంవత్సరానికి సోయాబీన్ క్వింటాల్‌కు మద్దత్తు ధర 5,328 ఉండగా మధ్యప్రదేశ్‌లో మార్కెట్ ధర 3,600 కు పడిపోయింది. సుమారు 1,728 తక్కువన్న మాట. ఇక ఈ ఒప్పందం తర్వాత మరో 8-11 శాతం తగ్గిపోయాయి. హెక్టారుకు సగటున పది క్వింటాళ్ల దిగుబడి వస్తే, దీని వల్ల హెక్టారుకు దాదాపు 17,000 స్థూల ఆదాయ లోటు ఏర్పడుతుంది. రెండు హెక్టార్లలో సాగు చేసే సాధారణ చిన్నకారు రైతుకు, సీజన్‌కు 35,000 నష్టం వాటిల్లుతోంది. ప్రపంచంలో 5వ అతిపెద్ద సోయాబీన్ ఉత్పత్తిదారు దేశం భారత్. 12.4 మిలియన్ హెక్టార్లలో 13.1 మిలియన్ టన్నుల సోయాబీన్ ఉత్పత్తి అవుతుంది. దేశంలో 40 లక్షల రైతు కుటుంబాలు ఈ పంటపై ఆధారపడుతున్నాయి. మధ్యప్రదేశ్ 48% ,మహారాష్ట్ర 32% ఉత్పత్తి చేస్తుంటాయి. ఇటీవల భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం కింద అమెరికా సోయాబీన్ నూనె డీడీజీఎస్ పై సుంకాలు తగ్గించేందుకు భారత్ అంగీకరించింది. దీని కారణంగా దేశీయ సోయా మీల్‌కు డిమాండ్ తగ్గే అవకాశం ఉందని పశుగ్రాసం తయారీదారుల సంస్థ అంచనా వేసింది. రానున్న మూడేళ్లలో 2.5 మిలియన్ టన్నుల సోయామీల్ మార్కెట్‌లో కనిపించకపోవచ్చు కూడా అని చెప్పింది. దీని ప్రభావంగా 3.1మిలియన్ టన్నుల సోయాబీన్ క్రష్ అంటే సోయాబీన్ నుంచి నూనె తీసే ప్రక్రియకు డిమాండ్ తగ్గవచ్చని చెబుతోంది. ఇది భారతదేశ మొత్తం సోయాబీన్ పంటలో 25%కి సమానమన్నమాట. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రం రైతులు సురక్షితంగా ఉన్నారని, మార్కెట్ ధరలు స్థిరంగా ఉన్నాయని కబుర్లు చెప్తున్నారు. కానీ కనీస మద్దత్తు ధర లేక రైతులు అవస్థలు పడుతున్నారన్నది మాత్రం వాస్తవం. ఇక పత్తి విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం పత్తిపై ఉన్న 11% దిగుమతి సుంకాన్ని 2025 ఆగస్టు 19న రద్దు చేసింది. ఈ నిర్ణయం తర్వాత దేశీయ మార్కెట్‌లో పత్తి ధరలు క్వింటాల్‌కు సుమారు 6,000 వరకు పడిపోయాయి. ఇది కనీస మద్దతు ధర కంటే తక్కువ. సి2G50% ప్రకారం 2025-26 సంవత్సరానికి పత్తికి మద్దత్తు ధర 10,075 ఉండాలి. ఈ లెక్కన రైతులు క్వింటాల్‌కు 2,365 వరకు నష్టపోతున్నారు. అంచనాల ప్రకారం పత్తి రైతులు ఈ సీజన్‌లో 12,416 కోట్ల మేర భారీ నష్టాలను చవిచూశారు. ఇక పోతే విత్తనాలపై పేటెంట్ అంశం కూడా రైతులకు భారంగా మారబోతోంది. భారత్ పేటెంట్ చట్టం, 1970లోని సెక్షన్ 3(జె) ప్రకారం విత్తనాలు, మొక్కలు వంటి వాటికి పేటెంట్లు ఇవ్వడం నిషేధం. ఐతే ప్రస్తుతం పత్తి రైతులు బీటీ విత్తనాలపై ఒక్కో ప్యాకెట్‌కు సుమారు 49 ట్రైట్ ఫీజు చెల్లిస్తున్నారు. ఈ ఫీజును ప్రభుత్వం నియంత్రిస్తోంది. పేటెంట్ నిబంధనలు మారితే మాత్రం, ఎకరాకు 15-20 డాలర్ల ధర పెరిగే అవకాశం ఉంది. ఈ ట్రేడ్ డీల్ పర్వత ప్రాంత రైతుల్లో గుబులు పుట్టిస్తోంది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఆపిల్, వాల్‌నట్, బాదం వంటి పళ్లు, డ్రై ఫ్రూట్స్‌కి సుంకం ఉండదు. దీంతో భారత మార్కెట్ ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంది. కానీ భారత్ నుంచి ఎగుమతయ్యే పండ్ల విషయంలో మాత్రం సుంకాలు కొనసాగుతున్నాయని విమర్శలు ఉన్నాయి. దీంతో హిమాలయ ప్రాంతాల్లో పండ్లు పండించే రైతుల్లో ఆందోళన నెలకొంది. భారత్‌లో సంవత్సరానికి సుమారు 2.5లక్షల మెట్రిక్ టన్నుల ఆపిల్ ఉత్పత్తి అవుతుంది. ఇందులో 75శాతం జమ్మూ కాశ్మీర్‌లోనే పండుతుంది. దీనిద్వారా సంవత్సరానికి రూ.12,000కోట్లకు పైగా ఆదాయం లభిస్తుంది. హిమాచల్‌ప్రదేశ్‌లో ఉన్న ఆపిల్ పరిశ్రమ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కీలకం. రూ.4,500కోట్ల టర్నోవర్‌తో 2.5 నుంచి 6 లక్షల కుటుంబాలకు ఉపాధి లభిస్తోంది. దేశంలోని 98శాతం అప్రికాట్ కూడా జమ్మూకశ్మీర్‌లో ఉత్పత్తి అవుతోంది. అమెరికా పళ్ళను భారత్ దిగుమతి చేసుకుంటే దేశీయ రైతులపై ధరల ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని రైతు సంఘాలు చెబుతున్నాయి. అలాగే వీటి సాగుపై ఆధారపడిన సుమారు 15లక్షల కుటుంబాలపై ప్రభావం ఉంటుందంటూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఇన్ని సమస్యలు ఉంటాయని తెలుస్తున్నా కేంద్ర ప్రభుత్వం కానీ మంత్రులు కానీ స్పష్టత ఇవ్వడం లేదు. “ఏ రైతుకూ నష్టం కలిగించే ఉత్పత్తులు ఒప్పందంలో లేవు” అని చెప్పి చేతులు దులిపేసుకుంటున్నారు. కానీ సోయాబీన్, మొక్కజొన్న, పత్తి వంటి పంటలపై తీవ్ర ప్రభావం ఉంటుందంటున్నారు విమర్శకులు. అలాగే జిఎం ఉత్పత్తులు దిగుమతి విషయంపై కూడా చర్చ వచ్చింది. 2009లో బీటీ వంకాయ వివాదం తర్వాత, భారత్‌లో జీఎం పంటలకు అనుమతులు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు జీఎం పంటలకు మార్గం సుగమం అయ్యే అవకాశం ఉందంటున్నారు. వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, ముఖ్య వ్యవసాయ ఉత్పత్తులకు సడలింపులు ఇవ్వలేదన్నారు. కానీ ఒక సంయుక్త ప్రకటనలో సోయాబీన్ నూనె, డిడిజిఎస్ వంటి ఉత్పత్తులపై సుంకాలను సడలించినట్లు విమర్శలు వస్తున్నాయి. అమెరికా-భారత్ మధ్య సుంకేతర అడ్డంకుల అంశంపై చర్చ జరుగుతోంది. ఇది వ్యవసాయ రంగంలోని కొన్ని నియంత్రణలను సడలించే అవకాశం ఉంటుందని విమర్శకులు భావిస్తున్నారు. ఈ అంశం దేశంలోని కోట్లాది మంది రైతు కుటుంబాలపై మీద, పీడీఎస్ ఆహార భద్రత, కనీస మద్దతు ధర విధానంపై ప్రభావం ఉండవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాలతో పాటు రుణ మాఫీ, ఆహార భద్రతపై కూడా ఆందోళనలు చెలరేగుతున్నాయి. బ్యాంకింగ్ సంస్కరణలు, విదేశీ పెట్టుబడులు పెరిగితే పబ్లిక్ సెక్టార్ అలాగే బ్యాంకుల్లో ప్రైవేట్ భాగస్వామ్యం, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల పాత్ర పెరిగే అవకాశం ఉంది. దీంతో భవిష్యత్తులో రైతు రుణమాఫీ నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుందని, రుణ వసూళ్లు కఠినంగా ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. అలాగే భారత్ కోడెక్స్ అలిమెంటారియస్ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే ఆహార భద్రత నిబంధనల్లో మార్పులు వచ్చే అవకాశం కూడా ఉంది. పురుగుమందుల అవశేషాలు, ఆఫ్లాటాక్సిన్ పరిమితుల విషయంలో ప్రమాణాలు కూడా మారే అవకాశం కనిపిస్తోంది. ఇండో-అమెరికా వాణిజ్య చర్చల్లో డిజిటల్ ట్రేడ్ నిబంధనలను చేర్చడం పై వివాదం నెలకొంది. ఈ నిబంధనలతో విదేశీ కంపెనీలకు భారత రైతుల వ్యవసాయ డేటా వివరాలు తెలుస్తాయి. పంట వివరాలు, నేల సారం, ఉత్పత్తి సమాచారం వంటి డేటా భద్రత ఎంతవరకు సేఫ్‌గా ఉంటుంది అనే అంశంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత్ అమెరికా నుంచి భారీస్థాయిలో ఇంధనం కొనుగోలు చేయడానికి అంగీకరించింది. పెట్రోలియం శాఖ రష్యా, అమెరికా నుంచి చమురు దిగుమతులపై వారానికోసారి సమాచారం ఇవ్వాలని రిఫైనరీలకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలపై ప్రతిపక్షం ప్రశ్నిస్తోంది. ఇండో-అమెరికా వాణిజ్య ఒప్పందంపై దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒప్పందం కారణంగా రైతులే ఎక్కువగా నష్టపోయే అంశాలు చాలా ఉన్నాయని మండిపడుతున్నారు. ఇలాంటి సమయంలో ఆల్ ఇండియా కిసాన్ సభ, సంయుక్త కిసాన్ మోర్చా ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు నిర్వహించారు. వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌ను పదవీ నుంచి తొలగించాలని, ప్రధానమంత్రి ఒప్పందంపై సంతకం చేయొద్దంటూ డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. ఈ విషయం మీద మళ్లీ ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే ఈ నిరసనలు భవిష్యత్తులో తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఆల్ ఇండియా కిసాన్ సభ అధ్యక్షులు, 9860488860


