Homeవిశ్లేషణకార్పొరేట్లకు కౌగిలింతలు…రైౖతులకు సంకెళ్లు

కార్పొరేట్లకు కౌగిలింతలు…రైౖతులకు సంకెళ్లు

- Advertisement -

డా॥ సూర్యదేవర రామకృష్ణ

భారతదేశం అమృతకాలం వైపు అడుగులు వేస్తోంది. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే ఆశయంతో పరుగులు తీస్తోంది. ఈ ప్రయాణంలో బ్యాంకింగ్ రంగం ఒక ఇంజిన్ లాంటిది. ప్రజల రక్తం, చెమట రంగరించి దాచుకున్న పొదుపు సొమ్మును పెట్టుబడిగా మార్చి, దేశాభివృద్ధికి మళ్లించాల్సిన బాధ్యత ఈ వ్యవస్థపై ఉంది. అయితే, ఈ వ్యవస్థ పనితీరుపై ఇప్ప్పుడు ఒక ప్రశ్న ఎదురవుతోంది. వేల కోట్ల రూపాయలు ఎగవేసిన కార్పొరేట్ దిగ్గజాలకు రెడ్ కార్పెట్ పరుస్తున్న బ్యాంకులు, రెండు లక్షల అప్పు తీర్చలేని రైతుకు మాత్రం జప్తు నోటీసులు ఎందుకు పంపిస్తున్నాయి? ఇది కేవలం ఒక ఆర్థిక చర్చ కాదు. దేశంలోని మెజారిటీ ప్రజల ఆత్మగౌరవ సమస్య. ఒకవైపు పారిశ్రామికవేత్తలు విలాసవంతంగా జీవిస్తుంటే, మరోవైపు రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి పురుగుల మందు తాగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలే దీనికి ప్రధాన కారణం. గత దశాబ్ద కాలంలో బ్యాంకింగ్ పరిభాషలో కొన్ని కొత్త పదాలు సామాన్యులకు పరిచయమయ్యాయి. అందులో ప్రధానమైనవి రీస్ట్రక్చరింగ్, హేర్‌కట్, వన్-టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్). ఈ పదాల వెనుక ఉన్న అసలు అర్థం ఒక పెద్ద కంపెనీ వేల కోట్లు అప్పు తీసుకుని కట్టలేకపోతే, బ్యాంకులు ఆ అప్పులో కొంత భాగాన్ని వదిలేయడం లేదా తిరిగి కట్టే గడువును పెంచడం అన్నమాట. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ నుంచి మొదలుకొని నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ వంటి ఉదంతాల వరకు మనం చూసింది ఒకటే. వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోవడం లేదా ఇన్సాల్వెన్సీ పేరుతో చేతులెత్తేయడం. ఈ సందర్భాల్లో బ్యాంకులు సదరు కంపెనీల నుంచి కేవలం 20శాతం లేదా 30శాతం రికవరీ చేసుకుని, మిగిలిన 70-80శాతం మొత్తాన్ని రైట్ ఆఫ్ చేస్తున్నాయి. దీనినే ముద్దుగా హేర్‌కట్ అని పిలుస్తారు. అసలు ప్రశ్న ఏమిటంటే, ఆ మాఫీ అయిన సొమ్ము ఎవరిది? అది సామాన్య పౌరుడు బ్యాంకులో దాచుకున్న సొమ్ము కాదా? కార్పొరేట్ కంపెనీల వ్యాపార వైఫల్యాలకు దేశ ప్రజలు ఎందుకు మూల్యం చెల్లించాలి? అన్నది ఆలోచించాలి. ఇక నాణేనికి రెండో వైపు చూద్దాం. రైతు పంట పండించుకోవడానికి లోన్ తీసుకుంటాడు. కానీ ఏ సమస్య వచ్చినా పంట చేతికిరాదు. వచ్చినా మద్దతు ధర ఉండదు. ఫలితంగా రైతు తీసుకున్న లోన్ తీర్చలేక అవస్థలు పడతాడు. అప్ప్పుడు బ్యాంకు అధికారులు అప్ప్పు తీర్చాలంటూ ఒత్తిడి తెస్తారు. చివరికి భూమి వేలం వేసే వరకూ వెళతారు. దాంతో ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటాడు. ఏటా వేల సంఖ్యలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలు ఆర్థిక వైఫల్యాలు కావు, వ్యవస్థ చేసిన సామాజిక హత్యలు. బ్యాంకింగ్ నిపుణులు తరచుగా ఒక వాదన చేస్తారు. కార్పొరేట్ సంస్థలు కూలిపోతే దేశ జీడీపీ దెబ్బతింటుంది, వేల మంది ఉద్యోగాలు కోల్పోతారు. అందుకే వాటిని కాపాడాలి అని. కానీ ఇదే తర్కం వ్యవసాయానికి వర్తించదా? భారతదేశంలో 50 శాతం కంటే ఎక్కువ జనాభా నేటికీ వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నారు. దేశానికి అన్నం పెట్టే రంగం సంక్షోభంలో పడితే, అది దేశ భద్రతకే ముప్పు వ్యవసాయం రిస్క్ తో ఉండే రంగం. ప్రకృతి వైపరీత్యాలకు రైతులు ఏమీ చేయలేరు. ఇలాంటి టైంలో ఈ రంగానికి బ్యాంకులు వెసులుబాటు కల్పించాలి. కానీ రైతులకు మాత్రం ఎలాంటి రాయితీలు అందడం లేదు. రైతుల రుణమాఫీ ప్రకటించినప్పుడల్లా ఆర్థికవేత్తలు రకరకాలుగా మాట్లాడతారు. “ఒకసారి అప్పు మాఫీ చేస్తే, రైతులు మళ్లీ అప్పు కట్టరు, ఇది క్రమశిక్షణను దెబ్బతీస్తుంది” అంటుంటారు. ఇదే సూత్రం కార్పొరేట్లకు ఎందుకు వర్తించదు? వేల కోట్ల రూపాయల రుణాలను ఎన్పీఏలు(నాన్`పెర్ఫార్మింగ్ అసెట్స్)గా మార్చిన కంపెనీలకు మళ్లీ మళ్లీ రుణాలు ఇవ్వడం మోరల్ హజార్డ్ కాదా? పెద్ద కంపెనీలకు లాబీయింగ్ చేసే శక్తి ఉంటుంది. వారికి మేధావులు, లాయర్లు, మీడియా సలహాదారులు ఉంటారు. వారు తమ వైఫల్యాలను మార్కెట్ ఒడిదుడుకులుగా చిత్రీకరించగలరు. కానీ రైతుకు తన గోడు చెప్పుకోవడానికి ఏ వేదిక లేదు. అతని దగ్గర కేవలం ఓటు మాత్రమే ఉంటుంది. అందుకే రుణమాఫీ అనేది రైతులకు ఒక భిక్ష లాగా, ఎన్నికల వేళ ఇచ్చే లంచం లాగా చిత్రీకరించబడుతోంది. నిజానికి, రైతుకు కావాల్సింది రుణమాఫీ కాదు, రుణమే అవసరం లేని లాభదాయకమైన వ్యవసాయం. అది లేనప్పుడు, కనీసం అప్పుల విషయంలోనైనా మానవీయత చూపించాల్సిన అవసరం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు కాగితం మీద అందరికీ సమానంగానే ఉన్నట్లు కనిపిస్తాయి. కానీ అమలులో ఉన్న లొసుగులు కార్పొరేట్లకు రక్షణ కవచాలుగా మారుతున్నాయి. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టీ కోడ్ ద్వారా కంపెనీల ఆస్తుల పరిష్కారం జరుగుతోంది. ఈ క్రమంలో బ్యాంకులు భారీగా నష్టపోతున్నా, ప్రైవేట్ వ్యక్తులు మాత్రం ఆస్తులను తక్కువ ధరకు కొనుగోలు చేసి లాభపడుతున్నారు. మరోవైపు, రైతు రుణాలు వసూలు చేసే బాధ్యతను బ్యాంకులు తరచుగా థర్డ్ పార్టీ ఏజెంట్లకు (రికవరీ ఏజెంట్స్) అప్పగిస్తున్నాయి. ఈ ఏజెంట్లు అనుసరించే అమానవీయ పద్ధతులు రైతులను మానసిక క్షోభకు గురిచేస్తున్నాయి. చట్టం ధనికులకు చుట్టంలాగా, పేదలకు ఇనుప సంకెళ్లలాగా మారిందనడానికి బ్యాంకింగ్ రంగమే ఒక పెద్ద ఉదాహరణ. ప్రజా ధనంతో నడిచే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎవరికి ఎంత అప్పు మాఫీ చేశాయో పూర్తి వివరాలు బహిర్గతం చేయడంలో వెనుకంజ వేస్తుంటాయి. గోప్యత పేరుతో పెద్దల పేర్లను దాచిపెడతాయి. కానీ అప్పు కట్టని రైతుల పేర్లను గ్రామ పంచాయతీ నోటీసు బోర్డుల మీద ముద్రిస్తాయి. ఈ వివక్ష ఎందుకు ? అప్పు ఎగ్గొట్టిన వాడు కార్పొరేట్ అయితే అది వ్యాపార నష్టం, అదే రైతు అయితే అది నేరం అనే ముద్ర వేయడం ఎంతవరకు సమంజసం ? ఈ దుస్థితి మారాలంటే కేవలం విమర్శలు సరిపోవు. వ్యవస్థలో మార్పు రావాలి. బ్యాంకులు ప్రతి ఆరు నెలలకోసారి కార్పొరేట్ రుణాల మాఫీ వివరాలను, వాటి వెనుక ఉన్న కారణాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. వ్యవసాయ రుణాలకు ప్రత్యేకమైన రిస్క్ మేనేజ్మెంట్ వ్యవస్థ ఉండాలి. పంట నష్టం జరిగినప్పుడు వడ్డీ మాఫీ కాకుండా, అసలు చెల్లింపులో వెసులుబాటు కల్పించే శాశ్వత యంత్రాంగం ఉండాలి. బ్యాంకుల బోర్డు ఆఫ్ డైరెక్టర్లలో కనీసం ఒకరు వ్యవసాయ రంగ నిపుణుడు లేదా రైతు ప్రతినిధి ఉండాలి. అప్పుడే విధాన నిర్ణయాల్లో క్షేత్రస్థాయి వాస్తవాలు ప్రతిబింబిస్తాయి. డబ్బుతో నడిచే ప్రపంచంలో విలువల గురించి మాట్లాడటం కొంతమందికి విడ్డూరంగా అనిపించవచ్చు. కానీ ఒక దేశ ఆర్థిక పురోగతి కేవలం స్టాక్ మార్కెట్ సూచీలతోనో, బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లతోనో కొలవలేము. ఆ దేశంలోని అత్యంత సామాన్యుడు ఎంత గౌరవంగా బతుకుతున్నాడనేదే అసలైన కొలమానం. కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ, రైతుల ప్రాణాలను బలితీసుకునే వ్యవస్థ నిలబడదు.
సెల్ : 9490754169

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు