. పెట్టుబడిదారులకు ఆ భూములా…
. చట్టానికి తూట్లు… భూ కమిటీ సిఫార్సులు తుంగలోకి…
. పేదల హక్కులు లాక్కోవడమేనని ప్రజా సంఘాల ఆందోళన
. లీజు లాభమంటున్న ప్రభుత్వం
విశాలాంధ్ర-సచివాలయం : అసైన్డ్ చట్టానికి కూటమి ప్రభుత్వం సవరణ తీసుకురావడం పేదలకు అన్యాయం చేయడమేనని ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి. అయితే పేదలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకపోగా వారికి మరింత లాభం చేకూరుతుందని ప్రభుత్వం సన్నాయి నొక్కులు నొక్కుతోంది. వాస్తవంగా అసైన్డ్ చట్టం`1977 ప్రకారం అసైన్డ్ భూమి అంటే ప్రభుత్వ భూమి… అంటే అంతిమంగా అది ప్రజలదే. అసైన్డ్ భూములు పొందే హక్కు కేవలం పేదలు, గిరిజన, వెనుకబడిన వర్గాల వారిదే. క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలిస్తే పేదలకు ప్రభుత్వాలు అందించిన అసైన్డ్ భూములను భూబకాసురులు ఎప్పుడో తమ ఖాతాల్లో వేసుకున్నారు. అసైన్డ్ భూములు రిజిస్టర్ చేయరాదన్న నిబంధన చట్టంలో ఉండటంతో ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్లు జరగనప్పటికీ సదరు భూములు పెద్దల చేతుల్లో బందీలుగా ఉన్న మాట వాస్తవం. కానీ భూములను చేజిక్కించుకున్న వారి చేతికి అధికారాలు లేకపోవడంతో కూటమి ప్రభుత్వం దొంగ చేతికే తాళాలు అందించిన చందాన అసైన్డ్ భూములను లీజుపేరుతో పేదల భూములకు ఎసరు పెట్టడానికి చట్ట సవరణ చేసింది.
ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు అసైన్డ్ భూములను పెద్దల కబంధ హస్తాల నుంచి కాపాడి పేదలకు అందిస్తానని వాగ్దానం చేశారు. తీరా అధికారం చేపట్టిన తరువాత పేదలన్నవారికి కనీసం సెంటు భూమి కూడా లేకుండా పన్నిన పన్నాగమే అసైన్డ్ చట్ట సవరణ అని తేటతెల్లమవుతోంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి తన తండ్రి 300 ఎకరాలు అసైన్డ్ భూమి పొందారని, దానిని వెనుకకు ఇస్తానని అసెంబ్లీ సాక్షిగా వెల్లడిరచారు. ఒక్క రాజారెడ్డి చేతిలోనే 300 ఎకరాలు ఉన్నాయంటే రాష్ట్రం మొత్తం మీద పెద్దల చేతుల్లో ఎన్ని లక్షల ఎకరాలు పేదల భూమి పెద్దల కంబంధ హస్తాల్లో చిక్కుకుందో అన్నది అర్థమైపోతుంది. భూముల ధరలు ఆకాన్నంటుతున్న నేటి రోజుల్లో పెద్దలు తమ చేతుల్లో ఉన్న విలువైన అసైన్డ్ భూములను వదులుకోవడానికి సిద్ధంగా లేరు. వారికి వంత పాడుతూ కూటమి ప్రభుత్వం చట్ట సవరణ చేసి లీజుకు ఇవ్వవచ్చన్న నిబంధన చేర్చింది. దీంతో పెద్దల చేతుల్లో ఉన్న భూములను పేదల పేరుతో లీజుకు ఇచ్చి తద్వారా వచ్చే ఫలాలు పెద్దలు దర్జాగా అనుభవిస్తారన్నది అక్షర సత్యం.
పెద్దల చేతుల్లో ఉన్న భూముల క్రయవిక్రయాలు జరపాలంటే 9/77 చట్టం అడ్డువస్తుంది. అందుకనే ప్రభుత్వం మధ్యేమార్గంగా లీజుకు ఇవ్వవచ్చు అని ఆ చట్టానికి సవరణ పేరుతో తూట్లు పొడిచి పెద్దల చేతుల్లోకి అసైన్డ్ భూములు దర్జాగా అప్పజెప్పేందుకు కుయుక్తులు పన్నిందని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో మొత్తం అసైన్డ్ భూములు 36,36,748 ఎకరాలు కాగా ఫ్రీ హోల్డ్‌కు అర్హమైన భూములు 13,62,345 ఎకరాలు. ఇప్పటికే ప్రీ హోల్డ్ చేసిన భూములు 9,93,248 ఎకరాలు, లీజుకు ఇచ్చేందుకు అవకాశం ఉన్న భూములు 26,43,500 అని చెబుతోంది. అసైన్డ్ భూములను పునరుత్పాదక విద్యుత్ కంపెనీలకు… అంటే సౌర, పవన విద్యుత్, సీబీజీ, పంప్డ్ స్టోరేజ్ కంపెనీలకు మాత్రమే ఇవ్వాలని చెబుతోంది. లీజు ప్రక్రియ నెడ్ క్యాప్ ద్వారా గానీ, రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయబోయే రూరల్ బోర్డు ద్వారా గానీ జరుగుతుందని చెప్పుకొస్తోంది. అంతేకాకుండా అసైన్డ్ రైతులు తమంతట తాము ఆ భూముల్లో సాగు చేస్తే వచ్చే ఆదాయం కన్నా పునరుత్పాదక విద్యుత్ కంపెనీలకు లీజుకు ఇస్తే వచ్చే ఆదాయం నికరంగా ఉంటుందని, ప్రకృతి విపత్తులు, ఆరుగాలం శ్రమించి గిట్టుబాటు ధర లభించలేదన్న భయం ఉండదని భరోసా ఇస్తోంది. వాస్తవంగా అసైన్డ్ భూములు రైతుల చేతుల్లో ఉన్నవాటి కంటే పెద్దల చేతుల్లో ఎక్కువగా ఉండటంతో ఆ కంపెనీలు అందించే లీజు కూడా పెద్దల జేబుల్లోకి చేరుతుంది. అలాగే కొన్ని సంవత్సరాల తరువాత పెద్దల పక్షాన నిలిచే ఈ ప్రభుత్వాలు మరో సవరణ పేరుతో పెద్దలకు దారాదత్తం చేయవన్న గ్యారెంటీ ఇచ్చేవారే లేరు. పేదలు, బడుగు, బలహీన వర్గాల పక్షాన ఉండే ప్రభుత్వమయితే ముందుగా క్షేత్రస్థాయిలో అసైన్డ్ భూముల సర్వే నిర్వహించి, పేదలకే హక్కులు ఉండేలా పటిష్ట చర్యలు తీసుకోవాలి. అటుపై ఇటువంటి సవరణలు చేయడం వల్ల ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. అంతేకానీ పేదల పేరుతో పెద్దలకు దోచేపెట్టే ఆలోచన చేయడం వల్ల భవిష్యత్‌లో పేదలు మరింత పేదలుగా మారడం ఖాయం.
ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడెక్కడ పునరుత్పాదక విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయవచ్చో ఇప్పటికే గుర్తించింది. ఆ ప్రాంతాల్లోనే పునరుత్పాదక ప్లాంట్లు పెట్టాలని ఆలోచన చేస్తుంది. అక్కడ ప్రభుత్వ భూములుంటే కేటాయిస్తుంది. ప్రయివేట్ భూములుంటే ఆ కంపెనీ లీజుకు తీసుకోవచ్చు. కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం అసైన్డ్ చట్టానికి చేసిన సవరణకు కేబినెట్ ఆమోదం ద్వారా అసైన్డ్ భూములను కూడా లీజుకు తీసుకునే అవకాశం కల్పించారు. ఇప్పటికే పరిశ్రమ ఉన్న వారు వారి అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ప్రాంతాల్లో పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ కంపెనీలు ప్రయివేట్ భూమలు లీజుకు తీసుకున్నప్పుడు రైతులకు ప్రయోజనాలు కలుగుతాయని ప్రభుత్వం చెబుతోంది. ఎకరాకు రూ.30 నుంచి 40 వేల లోపు ఏడాదికి కౌలు, ప్రతి రెండేళ్లకొకసారి 5 శాతం పెంపు, ఆ ఇంట్లో నిరుద్యోగి ఉంటే ఉద్యోగం… ఇదే ప్రయోజనం అసైన్డ్ రైతులకు కూడా కలుగుతుంది. ఎకరాకు 30 నుంచి 40 వేల ఆదాయం అంటే మెట్ట భూముల్లో మంచి ఆదాయం కిందే లెక్క. సాధరణంగా అసైన్డ్ భూములు ఎకరా నుంచి అత్యధికంగా ఐదెకరాల లోపు ఒక్కో పేదవానికి ఉంటుంది. ఎకరం లేదా రెండెకరాలు ఉన్న పేదలు ఏడాదంతా ఆ పొలంలో పని చేసుకొని పంట పండితేనే ఆదాయం తీసుకునే పరిస్థితి ఉంటుంది. అదే పంట నష్టం అయితే వారి శ్రమ కూడా వృధా అవుతుంది. అదే కంపెనీలకు లీజుకు ఇస్తే నికర ఆదాయం లభిస్తుంది. దాంతో వారు ఏడాది పాటు వేరో చోట శ్రమ చేసుకోవడం ద్వారా అక్కడ కూడా నికర ఆదాయం లభిస్తుంది. రోజుకు రూ.200 చొప్పున కుటుంబానికి ఇద్దరు చొప్పున నెలకు 20 రోజులు చొప్పున 10 నెలల పాటు పని చేశారని భావించినా ఏడాదికి 80 వేల రూపాయలు వారికి ఆదాయం లభిస్తుంది. మొత్తంగా పేద, బడుగు రైతులకు ఇది సువర్ణ అవకాశంగా కూటమి ప్రభుత్వం చెబుతోంది.


