. భూ సమస్యలతో 5 లక్షల కుటుంబాల అవస్థలు
. 14 ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని దుస్థితి
. హామీలిస్తూ నిర్లక్ష్యం చేస్తున్న పాలకులు
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : ఇల్లు ఉంది, కరెంటు మీటరు ఉంది. ఏళ్ల తరబడి కట్టిన ఇంటి పన్ను రసీదులు ఉన్నాయి. ఇంటి కొనుగోలుకు సంబంధించి రిజిస్ట్రేషన్ దస్తావేజులు, లింక్ డాక్యుమెంట్లు సైతం ఉన్నాయి. అలానే ఆపార్ట్‌మెంట్లు, వ్యవసాయ భూములు ఉన్నాయి కానీ ఆ రైతులు, ఇళ్ల యజమానులు, అపార్ట్‌మెంట్ యజమానులు తమకు సంబంధించిన ఆస్తులను అమ్ముకోవడానికి లేదా బ్యాంకులో తనఖా పెట్టుకోవడానికి వీలులేకుండా ఉంది. కొందరికి తమ తండ్రులు, తాతల నుంచి సంక్రమించిన పొలాలు, ఇళ్లు కాగా… కొందరు తమ కష్టార్జితంతో కొనుగోలు చేసిన భూములు, ఇళ్లు, భవనాలు ఉన్నాయి. వాటిని తమ పిల్లలకు వివాహం కోసం అమ్ముకోవాలన్నా కుదరని పరిస్థితి. ఈ భూములు, స్థలాలపై పైసలు పుట్టే పరిస్థితి లేదు. కొందరికి చేసిన అప్పులు తీరే మార్గం లేదు. ఇక తాము బతికుండగా ఈ సమస్య తీరుతుందా లేదా అని మంచాన పడి రోజులు ఈడుస్తున్న వయోవృద్ధులూ కొందరు. ఇది పది మందో 20 మందో సమస్య కాదు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది సమస్య. ఈ సమస్య పరిష్కారానికి బాధితులు అనేక మార్లు ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు వినతులు సమర్పించి…విసుగు చెంది నిరసనలు వ్యక్తం చేయడం కూడా చేశారు. ఈ సమస్య రాష్ట్రంలోని ఎమ్మెల్యే మొదలు కొని మంత్రులు, ముఖ్యమంత్రి వరకూ తెలిసిన సమస్యే. కానీ నెలలు, ఏళ్లు గడుస్తున్నా పరిష్కారం కావడం లేదు. గ్రామాలకు, దేవాలయాలకు సేవలందించే వారి జీవనోపాధికి స్వాతంత్య్రానికి పూర్వం రాజులు, జమీందారులు సాగు భూములను ఇనాం (విరాళం)గా ఇచ్చేవారు. జమిందారీ వ్యవస్థ రద్దయ్యాక 1956లో నాటి ప్రభుత్వం ఇనాం చట్టాన్ని తీసుకొచ్చి రైతువారీ పట్టాలు మంజూరు చేసింది. అప్పట్లో అనర్హులు కూడా భూములు పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. 2013లో ఉమ్మడి ఏపీలో నాటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ‘ఇనాం ల్యాండ్ అబాలిషన్’ చట్టాన్ని సవరించింది. ఈ నిబంధనను 1956 నుంచి ఉన్న లావాదేవీలకూ వర్తింపజేసింది. చట్టంలో ఒకచోట ‘ప్రాస్పెక్టివ్’కు బదులు ‘రెట్రాస్పెక్టివ్’ అని పేర్కొనడంతో 1956 నుంచి 2013 వరకు జారీచేసిన రైతువారీ పట్టాల భూములు కూడా నిషిద్ధ జాబితాలో చేరాయి. ఆ క్రమంలో విభజిత ఆంధ్రప్రదేశ్‌లో ఉభయగోదావరి జిల్లాల్లో 2,500 ఎకరాలు, ఉమ్మడి కృష్ణా 3,500, గుంటూరు 6,700, ప్రకాశం 3,600, కడప 3,500, కర్నూలు 4,000, అనంతపురం 400, చిత్తూరు 180, ఉమ్మడి ప్రకాశం తదితర జిల్లాల్లో కలిపి రాష్ట్రవ్యాప్తంగా 25 వేల ఎకరాలు (22ఏ – సీ) నిషిద్ధ జాబితాలో చేర్చడంతో ఈ సమస్య ఏర్పడిరది. ఈ భూముల క్రమ విక్రయాలు నిలిచిపోయాయి. ఫలితంగా యజమానులు తమ అవసరాలకు అమ్ముకోలేక పోతున్నారు. నిషిద్ధ జాబితా నుంచి తొలగించాలని ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ అధికారులు చుట్టూ తిరుగుతూ వినతులు సమర్పిస్తూనే ఉన్నారు. అయితే వీటి క్రయవిక్రయాలకు వీలుగా 2019 ఫిబ్రవరి 23న నాటి టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ (ఆంధ్ర ఏరియా) ఇనామ్స్ (అబాలిషన్ అండ్ కన్వర్షన్ ఇన్‌టూ రైత్వారీ) అమెండ్‌మెంట్ ఆర్డినెన్స్-2019ని తెచ్చింది. దీని ప్రకారం 1957 నుంచి 2013 మధ్య ఇచ్చిన పట్టాలు చెల్లుబాటు (ప్రాస్పెక్టివ్) కావాలి. ఇనాం సర్వీసు భూముల అంశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలో ఉన్నందున ఈ చట్ట సవరణను కేంద్రమూ ఆమోదించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో నిర్ణయం జరిగినప్పటికీ, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం తదనుగుణంగా చర్యలు తీసుకోలేదు. ఆర్డినెన్స్ కాలపరిమితి ముగియడంతో బాధిత రైతులకు ఉపశమనం లభించలేదు. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో 2022లో రిటైర్డ్ జిల్లా జడ్జిల నేతృత్వంలో ఈ సమస్య పరిష్కరించేందుకు జిల్లాల వారిగా ప్రత్యేక కమిటీలను నియమించింది. అయితే ఆ క్రమంలో కొందరు పలుకుబడి ఉన్న వారు తమ పనులు చక్కబెట్టుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా బాధితుల సమస్య పరిష్కారం కాలేదు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సైతం ఆయా ప్రాంతాల్లో ఈ భూయజమానులకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మరల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ భాధితులకు ఆశలు చిగురించాయి. గత నవంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ సమస్యను మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. మంత్రివర్గ ఉప సంఘం సమావేశమవుతున్నప్పటికీ ఇనాం భూముల సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు పడటం లేదు. ఈ సమస్య పరిష్కారం కోసం మరోమారు ఆర్డినెన్స్ జారీచేయాలన్న చర్చ వచ్చినప్పటికీ ఈ దిశగానూ కార్యాచరణ జరగలేదని తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఏడాదిన్నర దాటుతున్నా సమస్య మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉండి పోయింది. తాజాగా ఈ సమస్యపై తాడేపల్లి మండలం కొలనుకొండకు చెందిన వంద మంది చిన్న, సన్నకారు బాధితులు వేమూరి వీర రాఘవయ్య తదితరుల నేతృత్వంలో మంత్రి నారా లోకేశ్‌ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. అంతకు ముందు ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన ఇనాం భూముల రైతు బాధితుల సంఘం అధ్యక్షుడు రాటకొండ రామకోటేశ్వరరావు, ఇతర ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి గత టీడీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించి, సమస్య త్వరిగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.


