విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీ ఈఏపీసెట్ 2026) మంగళవారం ప్రారంభమైంది. రోజుకు రెండు విడతలుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో ఈ పరీక్షలు జరుగుతాయి. మొత్తంగా 42 నగరాలు, పట్టణాలలోని 142 కేంద్రాల్లో ఆన్లైన్ విధానంలో వీటిని ఈ ఏడాది కాకినాడ అధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించని నిబంధనతో విద్యార్థులు గంటరెండు గంటల ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. దూర ప్రాంతాల విద్యార్థులు హడావిడిగా చివరి నిమిషంలో పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. తమ అడ్మిట్ కార్డులు చేతబట్టుకుని గేట్ల వద్ద బారులుతీరిన విద్యార్థులను కళాశాలల సిబ్బంది పరిశీలించి లోపలికి పంపారు. రాష్ట్రవ్యాప్తంగా 3,55,008 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ఇంజినీరింగ్‌కు 2,75,794 మంది, అగ్రికల్చర్ఫార్మసీకి 78,421 మంది, రెండింటికీ (అగ్రికల్చర్ఫార్మసీ, ఇంజినీరింగ్)792 మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ, హైదరాబాద్‌లో కొన్ని పరీక్షా కేంద్రాలు అందుబాటులో ఉంచారు. 12 నుంచి 15వ, 18వ తేదీ వరకు ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు జరుగుతాయి. ఆ తర్వాత 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల పరీక్షలు జరగనున్నాయి. రెండు స్ట్రీమ్‌ల పరీక్షలు 14 సెషన్లలో నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు రెండో సెషన్ జరుగుతుంది. ఏపీ ఈఏపీసెట్ సెట్ కన్వీనర్ ఎన్.మోహనరావు పరీక్షల నిర్వహణను ప్రత్యేకంగా పరిశీలించారు. విద్యార్థులు తమకు కేటాయించిన కేంద్రంలోకి గంట ముందుగానే చేరుకుని తమకు కేటాయించిన కంప్యూటర్ సరిగా పనిచేస్తుందో లేదో సరిచూసుకోవాలని సూచించారు. పరీక్షకు సంబంధించిన సందేహాలు నివృత్తి చేసుకోవడానికి 08842359599, 2342499 నంబర్లT అందుబాటులో ఉంచినట్లు కన్వీనర్ తెలిపారు. పరీక్షలు పూర్తయిన తర్వాత 23న ఆన్సర్ కీ విడుదల చేసి, జూన్ 1న ఫలితాలు వెల్లడిస్తారు.
ఈఏపీసెట్ ప్రారంభం
- Advertisement -


