Homeసంపాదకీయంఉమ్మడి వివాహ చట్టం దిశగా మహారాష్ట్ర

ఉమ్మడి వివాహ చట్టం దిశగా మహారాష్ట్ర

- Advertisement -

ఉమ్మడి వివాహ చట్టం రూపొందించడానికి దేవేంద్ర ఫడ్నవిస్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఎక్కడ లేని ఆత్రుత ప్రదర్శిస్తోంది. ఉమ్మడి వివాహ చట్టం తీసుకురావడానికి కావలసిన ముసాయిదా బిల్లు తయారుచేసే బాధ్యతను ఫడ్నవిస్ ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీకి అప్పగించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజన దేశాయ్ ఈ కమిటీకి సారధ్యం వహిస్తారు. ఈ కమిటీలో బొంబాయి హైకోర్టు మాజీ న్యాయమూర్తులు ఆర్.సి.చవాన్, ఎస్.జి.మెహరె, మాజీ ప్రధాన కార్యదర్శి డి.కె.జైన్, మాజీ అడ్వొకేట్ జనరల్ బీరేంద్ర సరాఫ్, పద్మా అవార్డ్ గ్రహీత, ఆర్.ఎస్.ఎస్. సీనియర్ కార్యకర్త రమేశ్ పతంగే, సామాజిక కార్యకర్త సువర్ణ రావల్ ఉంటారు. వీరందరూ బీజేపీ అనుకూలురేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కమిటీ ఏర్పాటు చేయడం, ఆరు నెలల్లోగా నివేదిక సమర్పించాలని కోరడం, ఆ తరవాత వచ్చే మహారాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశంలో ఈ బిల్లు ప్రతిపాదించి ఆమోదిం చేయడం కేవలం లాంఛనాలే. ఉత్తరాఖండ్, గుజరాత్, అసోం రాష్ట్రాలలో ఉమ్మడి వివాహ చట్టం తీసుకు రావడానికి ఏర్పాటుచేసిన కమిటీలకు కూడా ఇదే మాజీ న్యాయమూర్తి రంజన దేశాయ్ అధిపతిగా ఉన్నారు. ఆమెనే మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్‌కు అధిపతిని చేయడంలో ఆంతర్యం ఏమిటో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. బెంగాల్‌లో కూడా ఇలాంటి కమిటీ ఏర్పాటు చేశారు. అందులోనూ రంజన దేశాయ్ ఉండడం యాదృచ్చికం కాదు. మొట్ట మొదట ఉత్తరాఖండ్‌లో బీజేపీ ప్రభుత్వం ఉమ్మడి వివాహ చట్టాన్ని ఆమోదించింది. ఆ తరవాత గుజరాత్, అస్సాం ఈ చట్టాలు తీసు కొచ్చాయి. ఇవన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలే. ఉమ్మడి వివాహ చట్టం రూపొందించే బాధ్యతను రాజ్యాంగ నిర్ణాయక సభ రాష్ట్రాల మీదే ఉంచింది. ఈ అంశాన్ని రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో చేర్చారు. ఆదేశిక సూత్రాలలో చేర్చడం అంటే పరిస్థితులు అనువుగా ఉన్నప్పుడు చట్టం చేసే అధికారం చట్టసభలకు ఉంటుంది. రాజ్యాంగం రూపొందించి నప్పుడు ఉమ్మడి వివాహ చట్టాన్ని రాజ్యాంగంలో చేర్చడానికి అను కూలమైన పరిస్థితులు లేవని భావించినందు వల్ల దీనిని ఆదేశిక సూత్రాలకు పరిమితం చేశారు. దేశమంతటికీ ఒకే రాజ్యాంగం వర్తిస్తున్నప్పుడు, ఒకే రకమైన చట్టాలు వర్తిస్తున్నప్పుడు వివాహ చట్టాలు ఒకే రకంగా ఉండాలని సూత్రప్రాయంగా అంగీకరించడానికి ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఉమ్మడి వివాహ చట్టాలు తీసుకు రావడానికి ప్రయత్నించడంలో బీజేపీ చూపుతున్న కారణాల్లో ముస్లిం వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇస్లాం మతం ప్రకారం ఒక్కో ముస్లిం పురుషుడు నలుగురిని పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంది కనక దీని వల్లే దేశంలో ముస్లింల జనాభా అనూహ్యంగా పెరిగి పోతోందన్న ప్రచారం సంఘ్ పరివార్ ఎప్పటి నుంచో చేస్తోంది. నలుగురిని పెళ్లి చేసుకోవడానికి ఇస్లామిక్ చట్టాలు అనుమతించే మాట నిజమే అనుకున్నా అందులో రెండు ప్రత్యేకమైన పరిస్థితులను సంఘ్ పరివార్ కప్పి పుచ్చుతోంది. ముస్లింలందరూ నాలుగేసి పెళ్లిళ్లుచేసుకుంటున్నారని దుష్ప్రచారం చేస్తూ వస్తోంది. “హం పాంచ్ హమారే పచ్చీస్” అన్న నినాదాన్ని సాక్షాత్తు ప్రధాన మంత్రి మోదీ బాగా ప్రచారంలో పెట్టారు. ఇది వాస్తవ విరుద్ధమైంది. ఎందుకంటే నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడానికి ఇస్లాం మతం గంపగుత్తగా అనుమతించదు. తగిన కారణాలు ఉంటేనే నలుగురి దాకా పెళ్లి చేసుకోవచ్చునని మాత్రమే ఇస్లామిక్ సూత్రాలు చెప్తున్నాయి. మొదటి భార్యకు దీర్ఘకాలం సంతానం కలగ కుండా ఉంటే, మతిస్థిమితం లేదనుకుంటే, సంసారానికి పనికి రాదనుకుంటే మరో పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఈ అన్ని సందర్భాలలోనూ మొదటి భార్య లేదా భార్యల సమ్మతి ఉండాలి. ఆ వాస్తవాన్ని పట్టించుకోకుండా ముస్లింలు నలుగురిని పెళ్లి చెసుకుంటున్నారని సంఘ్ పరివార్ ప్రచారం చేస్తోంది. నలుగురు భార్యలున్న ముస్లిం పురుషులు ఎంత మంది ఉన్నారన్న సమాచారాన్ని మాత్రం సంఘ్ పరివార్ వెల్లడించదు. ముస్లింలకు అధిక సంతానం ఉంటుందన్న మరో ప్రచారమూ సంఘ్ పరివార్ అదే పనిగా కొనసాగిస్తూ ఉంటుంది. అధిక సంతానానికి నలుగురిని పెళ్లి చేసుకోవడం కానే కాదు. పేదరికం, నిరక్షరాస్యత కారణంగా ఏ మతంలోనైనా సంతానంపై పరిమితి విధించు కోవడానికి అవకాశం ఉండకపోవచ్చు. బహుభార్యత్వం ముస్లింలకే పరిమితమైన వ్యవహారం అంతకన్నా కాదు. ఆ మాటకొస్తే హిందువులలోనూ బహుభార్యత్వం ఉంది. మరీ మాట్లాడితే హిందువులలోనే ఎక్కువ. హిందువులలో బహుభార్యత్వాన్ని అదుపు చేయడం గురించి సంఘ్ పరివార్ ఎప్పుడూ మాట్లాడదు. కానీ అదే ముస్లింల దగ్గరకొచ్చేసరికి నలుగురేసి భార్యలు ఉంటారని అసత్య ప్రచారం చేస్తూ ఉంటారు. ముస్లింలలోనే కాదు ఏ మతంలోనైనా అధిక సంతానం ఎప్పటికైనా సమస్యే. ప్రపంచంలో కెల్లా అధిక జనాభా ఉన్న దేశం మొన్నటిదాకా చైనా. ఇప్పుడు మనం చైనాను అధిగమించాం. కానీ జననాల రేటు ప్రస్తుతం అదుపులో ఉంది. ఈ అదుపు కేవలం హిందువులకే పరిమితం కాలేదు. ముస్లింలలోనూ జననాల రేటు తగ్గింది. ఈ వాస్తవాలను కప్పిపుచ్చి ఇస్లాం మతాను యాయుల మీద అక్కసు తీర్చుకోవడానికి సంఘ్ పరివార్ బహు భార్యత్వాన్ని సాకుగా చూపిస్తోంది. ఇదే పద్ధతిలో ముస్లిం మహిళల హక్కులు కాపాడుతున్నామని ప్రచారం చేసి ముమ్మారు తలాక్ విధానాన్ని నిషేధిస్తూ బీజేపీ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. ఇలాంటి చట్టం కావాలని ముస్లింలు ఎన్నడూ కోరిన దాఖలాలే లేవు. తలాఖ్, తలాఖ్, తలాఖ్ అని ముస్లింలు సునాయాసంగా విడాకులు ఇచ్చేయవచ్చున్నది కూడా సంఘ్ పరివార్ ప్రచారంలో పెట్టిన అసత్యమే. మూడు సార్లు తలాఖ్ అని విడాకులు ఇవ్వడానికీ ఓ పద్ధతి ఉంది. దాని గురించి సంఘ్ పరివార్ ఎన్నడూ మాట్లాడదు. ముమ్మారు తలాఖ్ విధానం దుర్వినియోగం అవుతున్న సందర్భాలు ఉండొచ్చు. కానీ అది సర్వ్వయాప్తమైన అంశం ఏమీ కాదు. విడాకులు ఇచ్చే వారు హిందువులతో పాటు ఇతర మతాలలోనూ ఉంటారు. ఆ విడాకులన్నీ చట్టబద్ధమైనవి కాకనూ పోవచ్చు. ఫడ్నవీస్ ఏర్పాటు చేసిన కమిటీలో అల్పసంఖ్యాక, అవ కాశాలు తక్కువగా ఉన్న వర్గాల వారి ప్రతినిధులు ఎవరూ లేకపోవడం పెద్ద లోపం. రాజ్యాంగంలోని 14, 29 అధికరణాలు అన్ని మతాలకు తమ మతాన్ని అనుసరించే స్వేచ్ఛ ఇస్తాయి. ప్రత్యేకించి ముస్లింలనే దృష్టిలో ఉంచుకుని ఉమ్మడి వివాహ చట్టం తీసుకురావడంలో దురుద్దేశం ఏమిటో అర్థం అవుతూనే ఉంది. సంఘ సంస్కర్త, సామాజిక కార్యకర్త హమీద్ దాల్వాయి “ముస్లిం సత్య శోధక్ మండల్’ 1970లలోనే ఏర్పాటు చేశారు. ఈ మండల్ ఉమ్మడి వివాహ చట్టం కావాలని కోరుతోంది. అంటే ముస్లింలలో కూడా చైతన్యం పెరుగుతోందని గమనించాలిగా!

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు