నటుడు సోనూసూద్‌ను అభినందించిన సీఎం
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: ఆరోగ్యం
సామాజిక సంక్షేమం విషయంలో సేవలందించే సూద్ చారిటీ ఫౌండేషన్ రాష్ట్రంలో ప్రజారోగ్య సంరక్షణ కోసం నాలుగు అంబులెన్స్‌లను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు, ప్రముఖ బాలీవుడ్ సినీనటుడు సోనూసూద్ సోమవారం అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి ఫౌండేషన్ అంబులెన్స్‌లను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు. అనంతరం నాలుగు అంబులెన్స్‌లను సీఎం ప్రారంభించారు. మర్యాద పూర్వకంగా తనను కలవడానికి వచ్చిన సోనూసూద్‌ను ఈ సందర్భంగా చంద్రబాబు అభినందించారు. ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, ఇందులో ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’ భాగస్వామి అయినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రా అంటే ప్రత్యేక ప్రేమ : సోనూసూద్
ఏపీ నాకు రెండో ఇల్లు లాంటిందని, ఇక్కడి ప్రజల కారణంగానే తాను ఇంతటి వాడినయ్యానని, అందుకే ఆంధ్రా అంటే ప్రత్యేక ప్రేమ అని సోనూసూద్ అన్నారు. నటుడిగా తనపై ప్రేమ చూపించిన తెలుగు ప్రజలందరికీ సోనూసూద్ ధన్యవాదాలు తెలిపారు. వైద్య సదుపాయాలు సరిగ్గాలేని ప్రాంతాల కోసం నాలుగు అంబులెన్స్‌లను ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వానికి ఇచ్చామన్నారు. ఈ అంబులెన్స్‌లు ప్రజల ప్రాణాలను కాపాడటంలో ప్రభుత్వానికి ఉపకరిస్తాయని ఆకాంక్షించారు. తెలుగు ప్రజలు తనకు అత్యంత ఆప్తులన్న ఆయన… వారికి ఏదైనా చేయటం తన బాధ్యతగా భావిస్తానని చెప్పారు. తన సతీమణి కూడా ఆంధ్రాకు చెందిన వారేనని తెలిపారు. కొవిడ్ సమయంలోనే ప్రజలను ఆదుకోవాలన్న నా బాధ్యత మొదలైంది. సమాజానికి మేలు చేయాలనే విషయంలో సీఎం చంద్రబాబు చాలా మందికి స్ఫూర్తి. నాకు ఎలాంటి రాజకీయపరమైన ఆశలు లేవు. సామాన్య వ్యక్తిని, ప్రజల మనిషిని. సమాజానికి తిరిగి ఇవ్వాలన్న తపనే నన్ను ఇలా నడిపిస్తోంది. కొవిడ్ సమయం నుంచి సీఎం చంద్రబాబుతో టచ్‌లో ఉన్నా. వారి ఆశీర్వాదం కూడా ఇప్పుడు తీసుకున్నా అని సోనూసూద్ వివరించారు. ఎవరికైనా ఒక్క ఫోన్‌కాల్ దూరంలోనే సోనిసూద్ ఉంటాడని తెలిపారు.