Friday, April 4, 2025
Homeఏపీ బ్రాండ్‌ తిరిగొచ్చింది

ఏపీ బ్రాండ్‌ తిరిగొచ్చింది

పారిశ్రామిక పునరుజ్జీవన చర్యలతో సత్ఫలితాలు
ప్రఖ్యాత సంస్థలు 7లక్షల కోట్ల పెట్టుబడులతో వచ్చాయి
మల్లవల్లి అశోక్‌ లేలాండ్‌ యూనిట్‌ ప్రారంభించిన మంత్రి లోకేశ్‌

విశాలాంధ్ర బ్యూరో అమరావతి: చంద్రబాబు అధికారంలోకి రావడంతో ఏపీ బ్రాండ్‌ మళ్లీ తిరిగి వచ్చిందని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. విజయవాడ సమీపంలోని మల్లవల్లి మోడల్‌ ఇండస్ట్రియల్‌ పార్కులో అశోక్‌ లేలాండ్‌ ప్లాంటును మంత్రి లోకేశ్‌ బుధవారం ప్రారంభించారు. తొలుత మంత్రి లోకేశ్‌ అశోక్‌ లేలాండ్‌ తయారు చేసిన డబుల్‌ డెక్కర్‌ బస్సులో ప్లాంటు వద్దకు విచ్చేశారు. ప్లాంటు ఆవరణలో మొక్క నాటిన అనంతరం రిబ్బన్‌ కట్‌ చేసి ప్లాంటును ప్రారంభించారు. తర్వాత అశోక్‌ లేలాండ్‌ సంస్థ తయారు చేసిన ఎంఎస్‌ ఆర్టీసి బస్సులను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా జరిగిన సభలో మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ మల్లవల్లిలో అశోక్‌ లేలాండ్‌ అత్యాధునిక బస్సు తయారీ కర్మాగారం ప్రారంభించడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. 2023 ఆగస్టు 24న తన పాదయాత్ర సందర్భంగా మల్లవల్లికి వచ్చినపుడు అశోక్‌ లేలాండ్‌ను తిరిగి తీసుకువస్తామని హామీ ఇచ్చాను. అది నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. అశోక్‌ లేలాండ్‌, హిందూజా గ్రూపునకు చెందిన పెద్దలు, పరిశ్రమ ప్రముఖులు, ప్రభుత్వ అధికారులకు అభినందనలు తెలిపారు. దేశచరిత్రలో మరే ఇతర రాజకీయ పార్టీ ప్రకటించని విధంగా ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, దానికనుగుణంగా హామీ నిలబెట్టుకునేందుకు కృషి చేస్తున్నామన్నారు. గతపాలనలో నష్టపోయిన పారిశ్రామిక సంస్థల్లో అశోక్‌ లేలాండ్‌ కూడా ఒకటి అన్నారు. సుమారు 1360 ఎకరాల్లో 2014-19 నడుమ టీడీపీి ప్రభుత్వ హయాంలో ఏర్పాటుచేసిన మల్లవల్లి పారిశ్రామిక పార్కును వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. తాము ఒప్పందాలు చేసుకున్న 450 కంపెనీల్లో చాలావరకు గత వైసీపీ పాలకుల వేధింపుల కారణంగా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రాలేదని తెలిపారు.
1800 మందికి ఉద్యోగ అవకాశాలు
రాష్ట్రానికి కొత్త పెట్టుబడిదారులను ఆహ్వానించే ముందు వారిలో విశ్వాసాన్ని కలిగించేందుకు చర్యలు చేపడుతున్నామని లోకేశ్‌ చెప్పారు. అశోక్‌ లేలాండ్‌కు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కూడా ఇది ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందన్నారు. అశోక్‌ లేలాండ్‌కు కేటాయించిన 75 ఎకరాలకుగాను 40 ఎకరాల్లో ప్లాంటును అభివృద్ధి చేశారన్నారు. ఈ ప్లాంట్‌ ఏటా 4,800 బస్సులు ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉందన్నారు. ఇది అశోక్‌ లేలాండ్‌ నిబద్ధతను సూచిస్తుందన్నారు. దీనిద్వారా మొదటిదశలో 600 ఉద్యోగాలు, రెండో దశలో 1,200 మందికి ఉద్యోగాలు లభిస్తాయని, ఇది పరిసర ప్రాంతాలను శక్తిమంతం చేయడమేగాక సామాజిక-ఆర్థిక వృద్ధి పెంపుదలకు దోహదపడుతుందన్నారు. తమ దార్శనికతపై అచంచలమైన విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ ప్రాజెక్టును…కేవలం తొమ్మిది నెలల్లోనే అశోక్‌ లేలాండ్‌ నిజం చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడిదారులకు గమ్యస్థానంగా, ప్రపంచస్థాయి సంస్థలకు ప్రేరణగా నిలుస్తుందని మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు. మంత్రులు టీజీ భరత్‌, కొల్లు రవీంద్ర, కలెక్టర్‌ డీకే బాలాజీ, ఏపీఐఐసీ చైర్మన్‌ రామరాజు, ఎండీ అభిషిక్త్‌, ఆర్‌టీసీి ఎండీ ద్వారకా తిరుమలరావు, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, హిందూజా అధినేత అశోక్‌ హిందూజా, అశోక్‌ లేలాండ్‌ చైర్మన్‌ ధీరజ్‌ హిందూజా, ఎండీ షేనూ అగర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు