Tuesday, February 4, 2025
Home‘ఏపీ సెట్స్‌`2025’ ఎప్పుడో?

‘ఏపీ సెట్స్‌`2025’ ఎప్పుడో?

. ఏటా జాప్యం… విద్యార్థులకు నష్టం
. కీలక పరీక్షలపై ఉన్నత విద్యామండలి నిర్లక్ష్యం
. తెలంగాణలో ఇప్పటికే నోటిఫికేషన్‌

విశాలాంధ్ర – బ్యూరోఅమరావతి: ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఆంధ్రప్రదేశ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏపీ సెట్స్‌)2025 నోటిఫికేషన్‌ జారీలో జాప్యం నెలకొంది. 202526 విద్యా సంవత్సరానిక వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు ఉమ్మడి సెట్స్‌కు నోటిఫికేషన్‌ జారీజేసి, ఆ తర్వాత విభాగాల వారీగా వేర్వేరుగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జనవరి 15వ తేదీన తెలంగాణ ప్రభుత్వం టీజీ సెట్స్‌2025 నోటిఫికేషన్‌ విడుదల చేసి…ముందంజలో ఉంది. ఏపీ ఉన్నత విద్యామండలి నేతృత్వంలో జారీజేసే సెట్ల నిర్వహణకు ఇంతవరకూ ఎటువంటి సన్నాహక సమావేశాలు నిర్వహించలేదని సమాచారం. ఈ విషయంలో ఏపీ కంటే తెలంగాణ ప్రభుత్వమే ముందంజలో ఉంది. జారీజేసిన సెట్ల ఆధారంగా టీజీఈఏపీసెట్‌(ఎంసెట్‌)కు నోటిఫికేషన్‌ జారీజేసింది. టీజీ ఈఏపీసెట్‌లో అగ్రిక్చలర్‌, ఫార్మసీకి ఏప్రిల్‌ 29, 30 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. ఇంజినీరింగ్‌ విభాగానికి మే 2 నుంచి 5వరకు పరీక్షలు నిర్వహిస్తారు. మిగిలిన విభాగాల పరీక్షలకూ తెలంగాణలో షెడ్యూలు ఇచ్చేశారు. దీని ఆధారంగా ఈ విద్యా సంవత్సరం కూడా ఏపీ కంటే..తెలంగాణలోనే ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ముందుండే అవకాశముంది. ఏపీసెట్స్‌`2024లో నోటిఫికేషన్‌ ఆధారంగా పరిశీలిస్తే..ఏపీ ఈఏపీసెట్‌, ఏపీఈసెట్‌, ఏపీ పీజీ ఈసెట్‌, లాసెట్‌, ఏపీ ఆర్‌సీఈటీ, ఏపీ పీఈ సీఈటీ, ఏపీ పీజీ ఈసెట్‌, ఏపీ ఎడ్‌సెట్‌, ఏపీ బి.యార్క్‌, ఏపీ పీజీ సెట్‌, ఐసెట్‌, ఓఏఎండీసీ తదితర ప్రాధాన్యత గల పరీక్షలు నిర్వహించారు. ఈసారి కూడా దాదాపు ఆయా విభాగాలతో ఏపీ సెట్స్‌2025 నోటిఫికేషన్‌ జారీజేయాల్సి ఉంది. ఈ సెట్స్‌లో ప్రధానంగా ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాలకు చెందిన ఏపీ ఈఏపీసెట్‌కు అధిక ప్రాధాన్యత ఉంది. దీనికి తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు పెద్దఎత్తున హాజరవుతారు. ఇలాంటి ప్రాధాన్యత పరీక్షతో ఇమిడి ఉన్న సెట్స్‌కు నోటిఫికేషన్‌ ఇవ్వడంలో జాప్యంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత విద్యామండలి అధికారుల నిర్లక్ష్యం, ప్రణాళికబద్ధంగా నిర్ణయాలు తీసుకోకపోవడమే ఆలస్యానికి కారణమన్న విమర్శలున్నాయి. దీని ప్రభావంతో ఉన్నత విద్యా కోర్సుల ప్రవేశాల కౌన్సెలింగ్‌ ఆలస్యమవుతుంది. గతంలో ఏపీఈఏపీసెట్‌2024 పరీక్షలతోపాటు వెబ్‌ కౌన్సెలింగ్‌ కూడా ఆలస్యమైంది. మూడు విడతలుగా గతేడాది డిసెంబరు వరకు కౌన్సెలింగ్‌ కొనసాగించాల్సి వచ్చింది.అయినప్పటికీ ఇంజినీరింగ్‌ సీట్లు మిగిలిపోయాయి. ఏ ప్రభుత్వాలు వచ్చినప్పటికీ, ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ను సకాలంలో నిర్వహించలేకపోతున్నారు. దీనివల్ల రాష్ట్రానికి చెందిన విద్యార్థులు… ఇతర రాష్ట్రాల్లో ఇంజినీరింగ్‌ సీట్లు పొందుతున్నారు. ఆ తర్వాత ఏపీ ఈఏపీసెట్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించడంతో సీట్లు మిగిలిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ విషయాన్ని పదేపదే విద్యార్థులు, తల్లిదండ్రులు అధికారులు, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితంలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సత్వరమే ఏపీ సెట్స్‌`2025 నోటిఫికేషన్‌ జారీకి చర్యలు తీసుకోవాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు