అగ్ని ప్రమాదమని ఆర్పేందుకు వెళితే బయటపడిన వైనం
దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి వర్మపై చర్యలకు డిమాండ్
అలహాబాద్ హైకోర్టుకు బదిలీకి సుప్రీం కొలీజియం నిర్ణయం
న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు వెలుగుచూసిన ఘటన దేశ న్యాయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో 14వ తేదీన అగ్నిప్రమాదం జరగడంతో మంటలు ఆర్పేందుకు వెళ్లిన సిబ్బందికి అనుకోకుండా అక్కడ భారీఎత్తున డబ్బు కనిపించింది.
న్యూదిల్లీ : న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు వెలుగుచూసిన ఘటన దేశ న్యాయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో 14వ తేదీన అగ్నిప్రమాదం జరగడంతో మంటలు ఆర్పేందుకు వెళ్లిన సిబ్బందికి అనుకోకుండా అక్కడ భారీఎత్తున డబ్బు కనిపించింది. దీంతో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం స్పందించి జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయించింది. అయితే అగ్నిప్రమాదం జరిగిన సమయంలో జస్టిస్ వర్మ నగరంలో లేరు. ఆయన కుటుంబ సభ్యులే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు ఫోన్ చేసి పిలిపించారు. వారు అక్కడ అగ్నికీలలను ఆర్పేశాక… అక్కడ భారీఎత్తున నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు దానిని స్వాధీనం చేసుకొన్నారు. అది మొత్తం లెక్కల్లో చూపని నగదుగా గుర్తించారు. వెంటనే ఈ విషయం ఉన్నతాధికారుల ద్వారా సీజేఐ ఖన్నాకు చేరింది. దీనిని ఆయన తీవ్రంగా పరిగణించి వెంటనే కొలీజియం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ వర్మను అలహాబాద్‌కు బదిలీ చేయాలని నిర్ణయించారు. గతంలో వర్మ అక్కడే పనిచేసి 2021లో దిల్లీకి వచ్చారు. కాగా భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం ఈ సంఘటన తర్వాత అత్యవసరంగా సమావేశమై, జస్టిస్ వర్మను దిల్లీ హైకోర్టు నుంచి బదిలీ చేసే ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించింది. కొలీజియం సిఫార్సును కేంద్రం ఆమోదించిన తర్వాత జస్టిస్ వర్మ ప్రతిపాదిత బదిలీ అమలులోకి రావచ్చు. తాజా పరిణామాల నేపథ్యంలో హైకోర్టులో రెండవ సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ వర్మ శుక్రవారం కోర్టుకు హాజరుకాలేదు.
బదిలీ మొదటి అడుగే… ఉన్నత న్యాయస్థానం విచారణ
జస్టిస్ యశ్వంత్ వర్మ బదిలీ మొదటి అడుగు మాత్రమేనని శుక్రవారం మధ్యాహ్నం ఒక ఆంగ్ల వార్తా సంస్థకు ఆ వర్గాలు తెలిపాయి. విషయంపై సుప్రీం కోర్టు ప్రాథమిక దర్యాప్తునకు ఆదేశించిందని ఆ వర్గాలు ధ్రువీకరించాయి. దర్యాప్తు ఫలితాల ఆధారంగా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(4) ప్రకారం, 56 ఏళ్ల జస్టిస్ వర్మను రాజీనామా చేయమని లేదా పదవి నుంచి తొలగించమని పార్లమెంటు కోరవచ్చు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.కె.ఉపాధ్యాయ నుంచి నివేదికను కోరారని, ఉన్నత న్యాయస్థానంలోని తోటి న్యాయమూర్తులకు కూడా వివరించారని కూడా వెల్లడిరచాయి. జస్టిస్ వర్మను బదిలీ చేయడం మాత్రమే సరిపోదని సుప్రీం కోర్టు న్యాయవాదులు, ప్రతిపక్ష కాంగ్రెస్, న్యాయ నిపుణులు సహా న్యాయవాదులు చేసిన పిలుపుల తర్వాత విచారణకు సంబంధించిన ధ్రువీకరణ వచ్చింది. ఉన్నావ్ అత్యాచార కేసుతో సహా వివాదాస్పద విషయాలపై జస్టిస్ వర్మ తీర్పులు ఇచ్చారని కాంగ్రెస్ ఈ అంశంపై తీవ్రంగా స్పందించింది. ‘న్యాయ వ్యవస్థపై విశ్వాసం నిలుపుకోవడానికి, ఆ డబ్బు ఎవరిదో, దానిని న్యాయమూర్తికి ఎందుకు ఇచ్చారో తెలుసుకోవడం ముఖ్యం…’ అని అధికార ప్రతినిధి పవన్ ఖేరా అన్నారు. జస్టిస్ వర్మ అక్టోబరు 13, 2014న అలహాబాద్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఫిబ్రవరి 1, 2016న హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. అక్టోబరు 11, 2021న దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
అలహాబాద్ హైకోర్టు ‘చెత్త కుప్ప కాదు’
అలహాబాద్ హైకోర్టు ‘చెత్త కుప్ప’ కాదని ఆ కోర్టు బార్ అసోసియేషన్ శుక్రవారం ప్రకటించింది. అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులకు రాసిన లేఖలో, డబ్బును కనుగొన్న తర్వాత సుప్రీం కోర్టు కొలీజియం నిర్ణయించినట్లుగా జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు తిరిగి పంపడాన్ని ఆ బృందం వ్యతిరేకించింది. కొలీజియం నిర్ణయంతో తాము ‘ఆశ్చర్యపోయామని’ అసోసియేషన్ పేర్కొంది.
రాజ్యసభలో ప్రస్తావన
ఈ అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకొచ్చింది. దీనిపై నిర్మాణాత్మక చర్చకు చర్యలు తీసుకుంటామని సభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ తెలిపారు. ఈ అంశాన్ని లేవనెత్తిన కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ మాట్లాడుతూ… న్యాయపరమైన జవాబుదారీతనంపై సభాధ్యక్ష స్థానం స్పందన కోరుతూ… అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిపై అభిశంసనకు సంబంధించి పెండిరగ్‌లో ఉన్న నోటీసు గురించి ఆయనకు గుర్తు చేశారు. ‘ఈ ఉదయం, దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి నివాసంలో భారీ మొత్తంలో నగదు బయటపడిన దిగ్భ్రాంతికరమైన కేసు గురించి మేము చదివాం’ అని జైరాం రమేశ్ అన్నారు. ‘దయచేసి దీనిపై మీరు కొన్ని పరిశీలనలు చేయాలని, న్యాయపరమైన జవాబుదారీతనాన్ని పెంచే ప్రతిపాదనను తీసుకురావడానికి ప్రభుత్వానికి అవసరమైన ఆదేశాలు ఇవ్వాలని నేను అభ్యర్థిస్తున్నాను’ అని అన్నారు. అభిశంసన అంశంపై, రాజ్యసభలోని 55 మంది సభ్యుల నుంచి తనకు వినతులు అందినట్లు చైర్మన్ తెలిపారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నానని ధన్‌కర్ సభ్యులకు చెప్పారు.