Homeఅంతర్జాతీయంనేటి నుంచి శ్రీలంకలో బుధవారం సెలవు

నేటి నుంచి శ్రీలంకలో బుధవారం సెలవు

- Advertisement -

కొలంబో : పశ్చిమాసియా యుద్ధం క్రమంలో కీలకమైన హోర్ముజ్ జల సంధి ద్వారా ఇంధన రవాణాకు ఆటంకాల క్రమంలో శ్రీలంక కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం పబ్లిక్ హాలిడే ప్రకటించింది. వారానికి నాలుగు రోజులే పని చేసేలా ఆదేశాలిచ్చింది. ఇంధన కొరత వేళ ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. ఈనెల 18వ తేదీ అనగా బుధవారం నుంచి కొత్త సెలవు అమల్లోకి వస్తుంది. ఈ మేరకు అత్యవసర సేవల కమిషనర్ జనరల్ ప్రభాత్ చంద్రకీర్తి ప్రకటించారు. ఆరోగ్య రంగానికి, పోర్టులు, నీటి సరఫరా, వినియోగదారుల సేవలకు ఇది వర్తించదని కూడా ఆయన స్పష్టం చేశారు. విద్యాసంస్థలు, కోర్టులకు మాత్రం బుధవారం సెలవు ఉంటుందని, ప్రైవేటు రంగం కూడా దీనిని అమలు చేస్తుందని ప్రభుత్వం ఆశిస్తున్నట్లు కమిషనర్ వెల్లడించారు. ప్రస్తుతానికి ద్వీపదేశంలో వారానికి ఐదు రోజులు పని చేసే నిబంధన ఉన్నది. అధ్యక్షుడు అనురా కుమార దిస్సనాయకే అధ్వర్యంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో తాజా నిర్ణయం జరిగింది. చమురు సరఫరాకు సంబంధించి, భారత్, రష్యాతో చర్చలు జరుపుతున్నట్లు శ్రీలంక ప్రభుత్వం తెలిపింది. శ్రీలంక జాతీయ ఇంధన విధానం కూడా రూపొందించింది. దీని ప్రకారం ప్రతి వాహనదారుడు జాతీయ ఇంధన (నేషనల్ ఫ్యుయల్) పాస్ కోసం నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిలావుంటే, పాకిస్థాన్ ఇటీవల ఇంధన సంక్షోభం ముదరకుండా ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే వెసులుబాటు కల్పించింది, ఆన్‌లైన్ తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకుంది. అటు మైన్మార్ కూడా వాహనదారులపై ఆంక్షలు విధించింది. రోజు విడిచి రోజు వాహనాలకు అనుమతి ఇచ్చింది. లైసెన్సు ప్లేటు సంఖ్య ఆధారంగా ఈ అనుమతులు జారీ అవుతాయి. కాగా, ఫిలిప్పీన్స్‌లోనూ ప్రభుత్వ ఉద్యోగులకు ఒక రోజు ఇంటి నుంచి పని చేసేలా కొత్త ఉత్తర్వులు జారీ అయ్యాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు