ఇజ్రాయిల్‌పై అరబ్ లీగ్ ఆగ్రహం
దుబాయ్: ముస్లింలు పవిత్రంగా భావించే మసీదుల్లో ఒకటైన ‘అల్ అక్సా’ను ఇజ్రాయిల్ మూసేసింది. రంజాన్ మాసంలో ఇలాంటి నిర్ణయం ముస్లిం దేశాలకు కోపం తెప్పించింది. అరబ్ లీగ్ దీనిని తీవ్రంగా ఖండించింది. ప్రార్థనలను అడ్డుకునే అధికారం ఇజ్రాయిల్‌కు ఎవరిచ్చారని నిలదీసింది. ఇలాంటి చర్యలతో ఇజ్రాయిల్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘింస్తుందని, ప్రాంతీయ, ప్రపంచ శాంతి, భద్రతలకు విఘాతం కలిగిస్తుందని విమర్శించింది. పవిత్ర స్థలాలపై ఇజ్రాయిల్ చట్టవిరుద్ధమైన చర్యలను ఆపాలని డిమాండ్ చేసింది. ఈ విధంగా ఇజ్రాయిల్‌పై ఒత్తిడి తీసుకురావాలని ప్రపంచదేశాలను కోరింది. ప్రార్ధన స్వేచ్ఛను గౌరవించాలని అరబ్ లీగ్ పిలుపునిచ్చింది. ఖతార్, జోర్డాన్, ఇండోనేసియా, టర్కీ, పాకిస్థాన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా ఎనిమిది అరబ్-ఇస్లామిక్ దేశాలు ఈ మసీదు మూసివేతను సంయుక్తంగా ఖండించాయి.ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్, ముస్లిం వరల్డ్ లీగ్ , అల్-అజార్, ఆఫ్రికన్ యూనియన్, అరబ్ పార్లమెంట్ కూడా ఆగ్రహం వ్యక్తంచేశాయి. 1967 తర్వాత, మొదటిసారి ఇలా జరిగిందని, రంజాన్ మాసంలో అల్ అక్సా మసీదు మూసేయడాన్ని పలస్తీనా అథారిటీ కూడా ఖండించింది. దీనిని హమాస్ ‘యుద్ధ ప్రకటన’గా వర్ణంచింది. ఫిబ్రవరి 28 నుంచి జెరూసలేంలోని అల్ అక్సా మసీదును ఇజ్రాయిల్ మూసేసింది. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని ఇబ్రహీమి మసీదులో 50 మంది మాత్రమే ప్రార్థన చేయడానికి అనుమతులు ఉన్నాయి. అయితే భద్రతా కారణాల దష్ట్యా మసీదు మూసివేసినట్లు ఇజ్రాయిల్ వెల్లడించింది.


