‘‘ఒరేయ్ ఎంకటేశం మనకి రత్తాలు… రాంబాబు పురస్కారం వచ్చిందిరా’’ చాలా ఆనందంగా చెప్పాడు గిరీశం తన శిష్యుడు వెంకటేశంతో. ‘‘చాలా సంతోషం గురువు గారు. మీరేదైనా అనుకున్నారంటే సాధించి తీరుతారు. నాకు తెలుసు మీ ‘‘ఆ’’ పత్రిభా పాటవాలు. ఎవర్ని ఎక్కడ ఎలా పట్టుకోవాలో గోదావరి తీరంలో ఉన్న ఏ సాహితీవేత్తకూ తెలియదు. మీకు తప్ప’’ అన్నాడు గిరీశం గారి శిష్యుడు వెంకటేశం. గిరీశం గారు కవి. రచయిత. గోదావరి ఒడ్డున సుఖవంతమైన జీవితం. గతంలో వారి పూర్వీకులకు పట్టు పరిశ్రమ ఉందని ఏటిగట్టున ఉన్న వారు చెబుతారు. అది నిజమో…! కాదో…! తెలియదు కానీ ప్రస్తుతానికి మాత్రం గిరీశం గారు ఆయన నివాసం ఉండే ప్రాంతానికి వచ్చే ఏ సాహితీవేత్తనైనా ఇట్టే ‘‘పట్టే’’స్తారని గోదావరి తీరంలోని సాహితీవేత్తలు చెవులొక్కటే కాదు… మొత్తం శరీరమంతా కొరుక్కుంటూ చెప్పుకుంటారు. ‘‘అవును గురువుగారూ… ఆ మహా రచయిత పేదల గురించి, కుళ్లు పభుత్వాల గురించి కథలు రాశారు గదా… మీరేమో పేకాట గురించి, గోదావరిలో సరసాల గురించి కథలు రాశారు కదా… ఆయన పేరిట పతి ఏడాది ఇచ్చే అవార్డు మీకెలా ఇచ్చారంటారు’’ చాలా అమాయకంగా అడిగాడు వెంకటేశం గురువు గిరీశం గారిని.
‘‘వురేయ్ ఎంకటీ… నువ్వు నాతో ఇన్నాళ్ల నుంచి తిరుగుతున్నావు. ఇలా చిన్న చిన్న విషయాలు కూడా తెలుసుకోకపోతే ఈ లోకంలో ఎలా బతుకుతావురా’’ అని ఆపాయ్యంగా తిట్టారు గిరీశం గారు తన పొడుగాటి ముక్కుని గోక్కుంటూ. ‘‘ఎంకటీ’’ అని ముద్దుగా పిలుచుకునే వెంకటేశం చిన్నగా నవ్వాడు. ‘‘తెలుసుకుంటానండి. ఆయ్. మీరు నేర్పుతున్నారు కదండి. అయితే, ఓ సిన్న డౌటనుమానం అండి. అందుకే అడిగానండి. ఆయ్’’ అన్నాడు ఎంకటి. ‘‘వుప్పుడూ… మనం ఏది పడితే అది రాసేస్తాం. ఎలా పడితే అది రాసేస్తాం. ఇవన్నీ సాహిత్య సృష్టి అనే ఖాతాలోకి ఎళ్లిపోతాయి’’ అంటూ చిద్విలాసంగా నవ్వారు కవి, రచయిత గిరీశం గారు. ఇలా చెపుతున్నప్పుడు పొట్ట కింద జానెడు పొడుగు ఉన్న తెల్ల లాల్చీని నిమురుకుంటున్నారు. ఇలా లాల్చీ, చొక్కా కాని ‘‘లాచో’’ లంటే గిరీశం గారికి చాలా ఇష్టం. సొంతూరు కాదు కాని… వలస వచ్చిన ఈ పురమంటే మరీ ఇష్టం. పురస్కారాలంటే పిచ్చి. వీటిని సాధించడం కోసం ఎవరిని పట్టుకోవాలో తెలుసుకోవడం ఇష్టం. అలా తెలుసుకుని అదేదో రత్నతో సహా… ఇలా రత్తాలు- రాంబాబు వంటి పెద్ద వారి పేరిట ఉన్న పురస్కారాలు తెచ్చేసుకోవడం మరీ మరీ ఇష్టం. పాపం, పుణ్యం చాత్రి బాబుకు తెలుసు. మనకి తెలీదు. తెలిసే అవకాశం కూడా ఉండదు. అంత పగడ్బందీగా ఉంటుంది గిరీశం గారి పట్టు పరిశ్రమ. ‘‘అవును గురుగారూ… స్వప్నమణి పురస్కారం కూడా వచ్చింది గందా మీకు. ఆ అవార్డు సానా పెద్దోళ్లకి ఇచ్చారట కదా. ఊర్లో అందరూ సెప్పుకుంటున్నారు. అది మీకెలా వచ్చిందంటారు’’ మళ్లీ కొసినించాడు ఎంకటి ఎలియాస్ వెంకటేశం. మళ్లీ ఎంటనే… గబ్బుక్కున పెదెం కొరుక్కుని ‘‘మీరూ పెద్దోళ్లే అనుకోండి’’ అన్నాడు తన వుజ్జోగం ఎక్కడ పోతుందో అనే భయంతో. ‘‘ఓ ఆదా! వంత బయవెందుకెహె. మన ఊర్లో జరిగే అన్ని కార్యక్రమాలకు మనం ఎల్తాం కదా. అక్కడేం సేస్తాం. కూడా తీసుకెళ్లిన శాలువాలు అక్కడున్నోళ్లకి కప్పుతాం. ఆ ఎనక ఏం సేస్తాం. మైకట్టుకుని ఫలానీ మన మంత్రిగారు సానా గొప్పోరు. ఆయన సేసిన పనులు అలాంటిలాంటివి కాదు. గోదావరి మన ఊరు నుంచే పొంగి పారేలా ఆయనే సేసారు. అసలాయనే లేకపోతే మనూరు మనూరులా ఉండేది కాదు. ఆయన వల్లే సూరీడు ఉదయాన్నే వత్తున్నాడు. మరి చంద్రుడు… ఆయనా అంతే మన మంత్రి గారి వల్లే రాత్రి ఏళల్లో వత్తున్నాడు. పగలు రమ్మనండి సూద్దారి. రాడు. వలాగే రాత్రేళ సూరీడ్ని రమ్మనండి. రాడు. ఆళ్లిద్దరు మన మంత్రి గారి మాటే వింటారు. అది మన మంత్రి గారంటే అని సెబుతాం. అంతే మంత్రి గారు మనం కనిపించగానే ఇదైపోతారు. అదైపోతారు’’ అన్నారు గిరీశం గారు భగవద్గీతని అర్జునుడికి చెబుతున్న కృష్ణుడిలా.
‘‘ఇలా ఓ పది సార్లో, వందసార్లో సెబుతాం కదా, అప్పుడు మంత్రిగారు మన మనిషైపోతారు. మనం కవులం కదా. రచయితలం కదా. మనం వాళ్లకి కావాలి కదా. అందుకే పతి రోజూ ఉదయాన్నే ఈ గిరీశం గారు శుభోదయం అనో, ఎలా ఉన్నారు అనో అడుగుతారు. అలా కొన్నాళ్లు అడిగాక మనం ఏటి సేస్తాం’’ అని ప్రశ్నించారు గిరీశం గారు శిష్యుడు ఎంకటిని. ఎంకటి అనే వెంకటేశంకి అంత జ్ఞానం లేదు కనుక…’’ఏటీ సేస్తాం. ఇంటాం’’ అన్నాడు. ‘‘ఓరి తెలివితక్కువ ఎంకటి. నీకు తెల్దు కాబట్టి ఇంటావు. నాకు తెలుసు కాబట్టి రంగంలో దిగుతాం. ఇది జరిగిన కొన్నాళ్ల తర్వాత ఓ పాలి మంత్రిగారి ఇంటికెళ్తాం. బుట్టలో సేపలో, చేసంచిలో పళ్లో పట్టుకుని ఎల్తాం. అలా ఎల్లినప్పుడు ఆయనేటంటారు’’ అని శిష్యుడి వైపు చూసి ఆగారు కవి, రచయిత గిరీశం గారు.
ఎంకటికి అంత బుర్ర లేదు కాబట్టి ‘‘ఏటంటారు’’ అని అడిగాడు. దానికి గిరీశం గారు ఇలా చెప్పారు. ‘‘నమస్కారం మంత్రిగోరు’’ అంటాం. కుర్చీలో కూర్చున్న మంత్రి గారు గబుక్కున లేచి మనకి దండం ఎట్టి ‘‘ఏటి కవి గారు ఇలా వచ్చారు అంటారు’’ ‘‘అప్పుడు మనం ఏం మాట్లాడం. సేతిలో ఉన్న శాలువా ఆయనకి కప్పుతాం. పళ్ల బుట్టో, సేపల సంచో ఆయన సేతిలో పెడతాం. ఆ తర్వాత కాపీ వస్తాది కదా. తాగుతాం. మంత్రిగారు ‘‘సెప్పండి కవి గారు’’ అంటారు. ‘‘సూడు అప్పుడు… ఈ స్వప్నమణి అంటే వల్లమాలిన పేమండి’’ అంటాం. ‘‘మీరు గాని తలచుకుంటే…’’ అని మాట నానుస్తాం. మంత్రి గారు గందా తెలిసిపోద్ది. ‘‘ఓస్ ఇంతేనా. ఇదెంత పని. ఈ ఏడాది మీరే స్వప్నమణి’’ అంటారు. ఓ రెండు నెలల తర్వాత మన పేరు గిరీశం ముందు స్వప్నమణి వచ్చి చేరిపోతుంది’’ అన్నారు గిరీశం గారు శిష్యుడు ఎంకటితో.
‘‘అంటే విప్పుడు రత్తాలు- రాంబాబు పురస్కారం, ఆ మధ్య అదేదో రత్న అవార్డు కూడా ఇలాగేనా’’ అన్నాడు ఎంకటి. ‘‘ఇంతే, బ్రూ కాఫీలా ఇంచుమించు ఇదే. కాకపోతే మనుషులు మారతారు. పట్టుకోవడం రావాలి కాని ఇవన్నీ ఎంతరా ఎంకటి’’ అన్నారు గిరీశం గారు. ఈలోగా గిరీశం గారి ఫోన్ మోగింది. అందులోంచి రింగ్‌టోన్ ‘‘పట్టు పట్టు… పట్టు పట్టు’’ అని వస్తోంది. శిష్యుడు ఎంకటి ‘‘గురుగారు. ఫోన్’’ అంటూ అందించాడు. ‘‘హలో హలో హలో… థాంక్స్. మీ మాట నిలబెట్టుకున్నారు. ఇప్పుడే తెలిసింది. రెండు నెలల క్రితం మాయూరొచ్చినప్పుడు మా సత్కారాలు నచ్చాయి మీకు. ఇదిగో విప్పుడు పురస్కారం ఇప్పించారు. ఆ అలాగే జ్ఞానపీఠం కూడా కొట్టేద్దాం. మధ్యలో దిల్లీలో ఇచ్చే అకాడెమీ ఉంది. అది కూడా మీరు చెయ్యి వేస్తే వచ్చేస్తుంది. ఆ. అలాగే… మీ గురించి మరచిపోను. చాలా సంతోషం’’ అని ఫోన్ పెట్టాశారు గిరీశం గారు. ‘‘గురూగారూ… ఎవరు అవతల’’ అన్నాడు శిష్యుడు ఎంకటి.
‘‘అదా! దిల్లీలో అకాడెమీ ఓటుంటది. వాళ్ల అవార్డు కోసం ఫోన్. అంటే రత్తాలు – రాంబాబు పురస్కారం కూడా ఈయనే చేసాడనుకో. అదేదో ఆ అకాడెమీ, జ్ఞానపీఠ్ వచ్చేస్తే ఈ జన్మకు సాలురా. నోబెల్ అవార్డంటావా. అక్కడెవరున్నారో వాకబు చేయాలి. మన పట్టు పరిశ్రమని అక్కడి దాకా విస్తరించాలి. సూద్దాం అది కూడా’’ అంటూ గిరీశం గారు గోదావరి దగ్గరికి వాకింగ్ వెళ్లిపోయారు.
సీనియర్ జర్నలిస్టు
సెల్: 99120 19929