బుడ్డిగజమీందార్
సాధారణంగా అమెరికా అధ్యక్షులుగా పదవి చేపట్టిన వారందరూ ప్రారంభ దశలో ఇజ్రాయిల్ పర్యటించటమో లేక ఇజ్రాయిల్ ప్రధానులు అమెరికాలో పర్యటించటమో పరిపాటి. పశ్చిమ ఆసియాలో ముడి చమురు ఆధిపత్యంకోసం అమెరికా బినామీగా ఇజ్రాయిల్ ప్రాతినిధ్యం వహిస్తుందనటం అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో వారం క్రితం ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు వాషింగ్టన్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కలుసుకున్నారు. 15నెలలపాటు ఎడతెరిపి లేకుండా అమాయక గాజా ప్రజలపై కాల్పులు జరిపి సుమారు 70 వేల మందిని చంపిన నరహంతక నెతన్యాహు జనవరి 15 నాడు గాజాపై కాల్పుల విరమణకు అంగీకరించాడు. ఈ యుద్ధానికి కావలసిన ఆయుధాలన్నీ అమెరికా సరఫరా చేసింది.
నెతన్యాహు వాషింగ్టన్ పర్యటన సందర్భంగా ట్రంప్ ఎవరికీ ఆమోదయోగ్యం కాని, పలస్తీనా రాజ్యస్థాపనకు, ఓస్లో ఒడంబడికకు విరుద్ధంగా అంతర్జాతీయ చట్టాలను గౌరవించకుండా ‘భవిష్యత్తు గాజా’ గురించి ఒక ప్రకటన చేశాడు. ఆ ప్రకటనను అనుసరించి చనిపోగా మిగిలి ఉన్న 18 లక్షల గాజా ప్రజలు, గాజా ప్రాంతాన్ని వదిలి ఈజిప్టు, లెబనాన్, జోర్డాన్, సిరియా దేశాలకు వెళ్లిపోవాలి. అప్పుడు మూడిరట రెండు వంతులు శిధిలమై నేలమట్టమైన గాజాలోని నగరాలలో, పట్టణాలలో, గ్రామాల్లో సిమెంటు స్లాబులుగా పడి ఉన్న కాంక్రీటు భవనాల్ని తొలగించి ఆ ప్రాంతాలను పర్యాటకుల కేంద్రాలుగా 20 సంవత్సరాల ప్రణాళికతో రియల్ ఎస్టేట్‌గా అభివృద్ధి చేస్తాడట. తద్వారా పలస్తీనా గాజా ప్రాంతంలో ఉద్యోగాలు, పరిశ్రమల కల్పన జరుగుతుందని ప్రకటించాడు. ట్రంప్‌కు ఎంత పొగరు? ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఒక సార్వభౌమాధికార రాజ్యాన్ని ఖాళీ చేయించాలను కోవటం? ఈ ప్రకటనతో రెచ్చిపోయిన నెతన్యాహు మొత్తం పలస్తీనా జాతిని నిర్మూలించటానికి వేసిన ఎత్తుగడగాక మరేమవుతుందిది? ఈప్రణాళిక కోసమేనా కాల్పుల విరమణ చేసింది. ధన, కండ కావరంతో ప్రపంచాన్నే శాసించవచ్చని, ప్రపంచాన్ని ఒకప్పటి వలసవాద రాజ్యంగా మార్చుకోవచ్చునని అమెరికా సామ్రాజ్యవాదం ఇప్పుడు ఫాసిస్టు పోకడలతో ట్రంప్ రూపంలో ఉగ్రరూపంగా మారటాన్ని ప్రపంచ దేశాలు గర్హిస్తున్నాయి. అంతకు క్రితం కెనడా, పనామా, గ్రీన్‌ల్యాండ్ దేశాలను అమెరికాలో కలిపేసుకొంటానన్నాడు. భారతీయులకే గాక అనేక దేశాలకు చెందిన వేలాది ప్రజల చేతులకు కాళ్లకు బేడీలువేసి క్రూరంగా మిలిటరీ విమానాల ద్వారా విదేశాలకు పశువుల మాదిరిగా పంపిస్తున్నాడు. ట్రంప్ ప్రకటనను తన మిత్ర దేశమైన ఫ్రాన్స్, జర్మనీలు గాకుండా పశ్చిమాసియా దేశాలతో పాటు టర్కీ, రష్యా, చైనాలు తీవ్ర స్వరంతో ఖండిరచాయి.
బీబీసీ ఒక ఆసక్తికరమైన గ్రాఫ్‌ను 2008, 2014, 2021, 202425 సంవత్సరాల్లో ఇజ్రాయిల్ గాజాపై జరిపిన దాడుల్లో శిధిలాల బరువును లెక్కకట్టి ప్రచురించింది. ఆ లెక్కల ప్రకారం, 2008లో 6 లక్షల టన్నుల బరువు గల శిధిలాలు, 2014 లో 20 లక్షల టన్నులు, 2021 లో 3 లక్షల 70 వేల టన్నులు. శిధిలం కాగా ఈ మొత్తానికి 17 అంతల రెట్టింపు అనగా 50 కోట్ల 7 లక్షల 73 వేల 496 టన్నుల శిధిలాలు 2024
25 యుధ్దం ద్వారా ఏర్పడినాయని తెలిపింది. అంటే ఎన్ని వేల టన్నుల బాంబులను ఇజ్రాయిల్ గాజాను నేలమట్టం చేయటానికి వినియోగించి ఉంటుందో ఊహకే అందదు. ఇప్పుడు ట్రంప్` నెతన్యాహులు గాజాను కబళించి జాతిని నిర్మూలించటానికి మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఈ మొసలి కన్నీరుతో అభివృద్ధి చేస్తాడట. ఎంతటి నయవంచన! ‘శిధిలాల కింద కుళ్లిపోతున్న శవాలపైన ట్రంప్ స్నేహితుడు నెతన్యాహులు కలిసి హోటళ్లు, క్యాసినోలను నిర్మిస్తూ శవ రాజకీయాలు చేస్తారా’ అని అనేక ప్రముఖ పత్రికలు ట్రంప్‌ను దుమ్మెత్తి పోశాయి.
1948లో పధకం ప్రకారం అప్పటి ఐ.రా.స.లో తన మిత్రుల సహాయంతో ఇజ్రాయిల్ దేశాన్ని పలస్తీనా భూభాగంలో ఏర్పాటు చేసుకొని 55శాతం పాలస్తీనా భూబాగాన్ని వశపర్చుకొని, పలస్తీనాపై ఇజ్రాయిల్ చేసిన యుధ్దంలో వేలాదిమంది చనిపోగా, లక్షలాదిమంది పలస్తీనా పౌరులు తమ దేశాన్నివదిలి జోర్డాన్ , ఈజిప్ట్, లెబనాన్, సిరియా దేశాలకు కట్టుబట్టలతో శరణార్ధులుగా వెళ్లిపోయారు. ఇప్పటివరకూ వారినిగానీ, వారి వారసులనుగానీ తమ మాతృదేశమైన పలస్తీనా గడ్డపైకి తిరిగి ఇజ్రాయిల్ రానివ్వలేదు. విచిత్రమేమంటే ప్రపంచంలో యూదులు ఎక్కడున్నా ఇజ్రాయిల్‌కు రావచ్చు, వారు ఇజ్రాయిల్ పౌరసత్వం పొందుతారు. ద్వంద పౌరసత్వం కూడా పొందవచ్చు. 1948 శరణార్ధుల తరహాలో పలస్తీనా ప్రజల్ని ప్రస్తుతం గాజా నుంచి అభివృద్ధిపేరుతో బలవంతంగా చుట్టుపక్క దేశాలకు తరిమేసి, ఇంక మరెప్పుడూ వారి జన్మస్థలానికి తిరిగి రానివ్వరని పాలస్తీనియన్లు అంటున్నారు.1948 యుధ్దం ‘నగ్బా’ (పెద్ద విపత్తు) వలెనే ఇప్పుడు 2025లో మరొక ‘నగ్బా’ ప్రణాళికను ట్రంప్, నెతన్యాహులు ప్రణాళికను ప్రస్తుతం ట్రంప్ రచిస్తున్నాడు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ ‘ఒక దేశ ప్రజలను బలవంతంగా తరలించటమంటే ఆ దేశ జాతిని ప్రక్షాళన చేయటమే’ అన్నారు. ‘యుద్ధ నేరాలు చేస్తున్న అమెరికా తనకు మట్టి అంటుకోకుండా నేరుగా ప్రజలపై దారుణాలకు పాల్పడుతోందని హ్యూమన్ రైట్స్ వాచ్ స్పందించింది. అంతర్జాతీయ మానవతా చట్టం ఆక్రమిత భూభాగంలోని జనాభాను శాశ్వతంగా బలవంతంగా తరలించటాన్ని నిషేధిస్తుంది. నేర పూరిత ఉద్దేశంతో అలాంటి బలవంతపు తరలింపు జరిగితే అది యుద్ధ నేరంగా పరిగణిస్తారు. 1991 లో సోవియట్ యూనియన్ పతనం తర్వాత క్రమేపి ప్రపంచ శాంతి కరువవుతుందని ప్రపంచ సోషలిస్టు వెబ్‌సైట్ రాసింది. 1991 తర్వాత రెండు గల్ఫ్ యుద్ధాలు, యుగోస్లావియా రద్దు, అఫ్ఘ్ఘానిస్తాన్ పై దండయాత్ర, సిరియా లిబియాలో పాలన మార్పు, ఉక్రెయిన్‌ను ఉసిగొల్పి రష్యాపై నాటో చేయిస్తున్న యుద్ధం అన్నీ ఈ ప్రక్రియలో భాగమే. 1917 బోల్ష్‌విక్ (అక్టోబరు) విప్లవం లేకుంటే ఈ పాటికి ప్రపంచమంతా సరికొత్త వలస వాదంతో చాలా దేశాల్ని బానిస దేశాలుగా ప్రపంచ సామ్రాజ్యం పరిగణించి ఉండేదని తెలిపింది.
గడచిన దశాబ్దాలుగా అమెరికా పలస్తీనాపై చెప్పుకొస్తున్న తన విధానాలకు విరుద్ధంగా ట్రంప్ ప్రకటన ఉంది. 1993 ఓస్లో ఒడంబడిక ప్రకారం గాజా, వెస్ట్ బ్యాంకులతో కూడిన పలస్తీనాకు మద్దతునిస్తూ తూర్పు జెరూసలేం పలస్తీనా రాజధానిగా ఉండాలనే అంతర్జాతీయ అభిప్రాయానికి ట్రంప్ మొదటి దఫా అధ్యక్షునిగా ఉన్నప్పుడే తూట్లు పొడవటం ప్రారంభించాడు. ఇజ్రాయిల్‌లో అమెరికా రాయబార కార్యాలయాన్ని టెల్‌అవీవ్ నుంచి జెరూసలేంకు ట్రంప్ మార్చటమేగాక, వెస్టు బ్యాంకులో ఇజ్రాయిల్ నిర్మించిన అక్రమ శాశ్వత కట్టడాలను ట్రంప్ గుర్తించాడు. ఇది ఐ.రా.స. తీర్మానాలకు వ్యతిరేకం. 6 రోజుల యుద్ధంలో ఇజ్రాయిల్ ఆక్రమించిన గోలన్ హైట్స్ పర్వత శ్రేణుల ప్రాంతాన్ని కూడా ఇజ్రాయిల్ అంతర్భాగంగా ట్రంప్ గుర్తించి అంతర్జాతీయ దౌత్య అర్థాన్నే మార్చేశాడు. 1967లో పలస్తీనాపై ఇజ్రాయిల్ జరిపిన 6 రోజుల యుద్ధం వరకూ గాజా ప్రాంతాన్ని ఈజిప్టు వశపర్చుకొని 6 రోజుల యుద్ధం తర్వాత ఇజ్రాయిల్ ఆధీనంలో ఉంచుకొని 2005 లో గాజాను షరతులతో తిరిగి ఇచ్చింది. పాలస్తీనాను 2 ప్రాంతాలుగా గాజా, వెస్ ్ట్టబ్యాంకుగా విభజించి ఒక చోటు నుంచి వేరొక చోటుకు వెళ్లటానికి లేకుండా చేసింది. గాజాకు 3 వైపుల గోడను నిర్మించి, ఒకవైపు మధ్యదరా సముద్రంతో బహిరంగ కారాగారంగా ఇజ్రాయిల్ గాజాను మార్చింది. 2025 జనవరి 15 కాల్పుల విరమణ తర్వాత నిత్యావసర వస్తువులను చెక్‌పోస్టుల నుంచి గాజాకు రానివ్వటం లేదు. ప్రస్తుత గాజాలో కాల్పులను విరమించినట్లే నటించి, ఇప్పుడు వెస్ట్ బ్యాంకులో తలదాచుకుంటున్న కొద్దిపాటి పలస్తీనియన్లను జోర్డాన్ పారిపోయేలా కాల్పులు మొదలుపెట్టింది. తద్వారా మొత్తం పలస్తీనాను ప్రపంచ పటం నుంచి తొలగించటానికి అమెరికా, ఇజ్రాయిల్‌లు ప్రయత్నిస్తున్నాయి.
ప్రపంచ దేశాల విమర్శలను ఎదుర్కోలేని అమెరికా పలస్తీనియన్లపై స్థానభ్రంశం తాత్కాలికమేనని శ్వేత సౌధం వివరణ ఇచ్చినా, విదేశాంగ మంత్రి మార్కో రూబియో దీనిని తాత్కాలికంగా ‘మధ్యంతర’ ఏర్పాటుగా చెప్పుకొచ్చినా పలస్తీనా అమెరికా సొత్తు కాదని ప్రజలు నిరసనల ద్వారా తెలియజేస్తున్నారు.