కాకినాడకే పరిమితమా?
స్టెల్లా షిప్ సీజ్… కెన్‌స్టార్ షిప్ సంగతేంటి?
అదానీ గంగవరం పోర్టు జోలికెళ్లరేం ?
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : బియ్యం అక్రమ రవాణా దందా ఆరోపణలకు సంబంధించి కాకినాడ పోర్టులోనే కాకుండా ఇతర పోర్టులనూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనిఖీలు చేయాలన్న డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. ప్రధానంగా అదానీకి చెందిన గంగవరం పోర్టు ద్వారా కూడా అక్రమ బియ్యం రవాణా కొనసాగుతుందన్న విమర్శలున్నాయి. గంగవరం పోర్టుకు వెళ్లకుండా… కాకినాడ పోర్టునే పట్టుకుని పవన్ హడావుడీ చేయడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. రాష్ట్రంలో పరిపాలన నిష్పక్షపాతంగా జరగడం లేదనడానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానిస్తున్నాయి. కాకినాడ పోర్టు పరిశీలనకు వెళ్లిన పవన్… అక్కడి షిప్‌ను సీజ్ చేయాలంటూ అధికారులను ఆదేశించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఏపీలోని కాకినాడ, విశాఖ, గంగవరం పోర్టుల ద్వారాను, గుజరాత్‌లోని కాండ్ల పోర్టు ద్వారా విదేశాలకు పెద్దఎత్తున బియ్యం సరఫరా అవుతోంది. దీనికి ప్రభుత్వ నిఘా వ్యవస్థ లేకపోవడం, ఉన్నతాధికారుల లోపమే ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. పోర్టుల పరిధిలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. ఏ ప్రభుత్వాలు వచ్చినా అలాంటి పరిస్థితులు లేవు. కాకినాడ పోర్టు కేంద్రంగా 1995 నుంచి బియ్యం ఎగుమతులు జరుగుతున్నాయి. ఈ పోర్టును నమ్ముకొని 30 వేల మంది కార్మికులు బతుకుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో పీడీఎస్ బియ్యం ఆఫ్రికా దేశాలకు తరలి వెళ్లాయని, వీటి వెనుక ఓ మాజీ ప్రజాప్రతినిధి హస్తముందన్న ఆరోపణలతో పవన్ తనిఖీలకు ప్రాధాన్యత ఏర్పడిరది. అవి నిజమైతే…ప్రభుత్వం సీబీఐ విచారణకు అప్పగించి, బాధ్యులపై కఠిన చర్యలకు ఉపక్రమించాల్సి ఉంది. రాజకీయ ప్రయోజనాల కోసం కాకినాడ పోర్టుపై విషప్రచారం వల్ల ఎగుమతులు గుజరాత్‌లోని కాండ్ల పోర్టుకు తరలిపోతున్నాయన్న వాదనలున్నాయి. ఇప్పటికే విశాఖ, గంగవరం పోర్టుకు బియ్యం లారీలు వెళ్లిపోయాయని, కాకినాడ పోర్టు కార్మికులకు పనులు లేకుండా పోతున్నాయని సమాచారం. కాకినాడ పోర్టే కాదు… గంగవరం పోర్టు కేంద్రంగాను అక్రమ రావాణా బియ్యం దందా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అక్కడికి పవన్ కల్యాణ్ ఎందుకు వెళ్లలేకపోతున్నారని, అది అదానీది కావడమే కారణమా అంటూ విపక్షాలు నిలదీస్తున్నాయి. అన్ని పోర్టుల్లోనూ ఇదే తరహా తనిఖీలు నిర్వహించి… అక్రమ దందాకు చెక్ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్‌ను తనిఖీ చేసిన పవన్… ఆ పక్కనే ఉన్న కెన్‌స్టార్ షిప్ దగ్గరకు ఎందుకు వెళ్లలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘కెన్‌స్టార్’ షిప్‌లో బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారని, అది ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడదంటూ విమర్శలు వచ్చాయి. తన శాఖ కాకపోయినా ప్రాణాలకు తెగించి ప్రజల ఆస్తిని కాపాడటానికి, షిప్‌ను తనిఖీ చేయడం కోసం సముద్రంలోకి వెళ్లిన పవన్‌ను స్వాగతిస్తూనే… ‘కెన్‌స్టార్’ షిప్ వద్దకు ఎందుకు వెళ్లలేదని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ‘స్టెల్లా’లో 36 మంది ట్రాన్స్‌పోర్టర్లు, 35 వేల టన్నుల బియ్యం ఎగుమతి చేయడానికి తెచ్చుకున్నారని తెలిసింది. పక్కనే లంగరేసి ఉన్న ‘కెన్‌స్టార్’లో ఒకే ఎక్స్‌పోర్టర్ 42 వేల టన్నుల బియ్యం నైజీరియాకు ఎగుమతి చేస్తున్నప్పటికీ దాని జోలికి వెళ్లడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇతర పోర్టులపైనా తనిఖీలు నిర్వహించాల్సిన అవసరముంది.
ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణం
సబ్సిడీ మీద పేదలకు అందిస్తున్న రేషను బియ్యం అనేక సంవత్సరాలుగా కాకినాడ పోర్టు నుంచి లక్షల టన్నుల్లో అక్రమ రవాణా అవుతున్నప్పటికీ… ప్రభుత్వాలు మౌనంగా ఉంటున్నాయి. ఏదైనా సమస్య వచ్చినప్పుడే హడావుడీ చేస్తున్నాయి. పేదలకు అందాల్సిన బియ్యం దారి తప్పి వివిధ పద్ధతుల్లో పోర్టులకు తరలిపోతున్నాయి. ఇవి రేషన్ షాపుల నుంచే నేరుగా వెళ్తున్నాయా? లేక పౌరసరఫరాల శాఖ ద్వారా వెళుతున్నాయా అనే దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. ఈ అక్రమ రవాణాను శాశ్వతంగా అరికట్టటానికి ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక రూపొందించాలి. ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్ట పరిచి పూర్తిగా నిఘా పెడితే ఈ అక్రమాలు ఉండవని విపక్షాలు సూచిస్తున్నాయి. బియ్యం విక్రయదారులు, కొనుగోలుదారులు, మధ్యలో ఉన్న బ్రోకర్లు ఎవరనే దానిపై సమగ్ర విచారణకు ఆదేశిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయి. రాజకీయ అవసరాల కోసం చారిత్రాత్మక కాకినాడ పోర్టుపై విష ప్రచారం సరికాదని హితవు పలుకుతున్నాయి.