Homeతెలంగాణభాగ్యనగరాభివృద్ధికి రూ.20 వేల కోట్లు ఓ చరిత్ర

భాగ్యనగరాభివృద్ధికి రూ.20 వేల కోట్లు ఓ చరిత్ర

- Advertisement -

పెట్టుబడులు, జీవన ప్రమాణాల్లో ప్రపంచంతోనే పోటీ
27 మునిసిపాలిటీల విలీనం చరిత్రాత్మక నిర్ణయం
తెలంగాణ రైజింగ్ విజన్ 2047కు క్యూర్ వ్యూహం
ప్రజలందరికీ ఓకే విధమైన పౌరసేవలు
‘రియల్ ఎస్టేట’ సమస్యలు పరిష్కరిస్తాం: భట్టి

విశాలాంధ్ర-హైదరాబాద్: భాగ్యనగరాభివృద్ధికి రెండేళ్ల వ్యవధిలోనే రూ.20 వేల కోట్లు కేటాయించడం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైటెక్స్‌లో శుక్రవారం క్రెడాయ్ ప్రాపర్టీ ఎగ్జిబిషన్ షో ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన భట్టి మాట్లాడుతూ… జీహెచఎంసీ పరిధిలో 1,950.52 కోట్లు, హెచఎండబ్ల్యూఎస్ ఎస్బీ (హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు) పరిధిలో రూ.12,500 కోట్లు, హెచఎండీఏ పరిధిలో రూ.4,33.65 కోట్లు కేటాయించినట్లు వివరించారు. పెట్టుబడులు, ప్రతిభ, జీవన ప్రమాణాల్లో ప్రపంచంలోనే అగ్ర నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతోందన్నారు. మహానగరం చుట్టుపక్కల ఉన్న 27 స్థానిక సంస్థలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయడం ఓ చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. ఈ నిర్ణయం ద్వారా ప్రజలకు ఒకే విధమైన పౌర సేవలు, సమగ్ర ప్రణాళిక, ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఒకే అభివృద్ధి దృక్పథం సాధ్యం అయ్యాయన్నారు. నేడు దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న, పెట్టుబడులకు అనుకూలమైన నగరాలలో ఒకటిగా నిలుస్తోందన్నారు. మన అభివృద్ధి … గతంలో దూరదృష్టి గల నాయకత్వం వేసిన బలమైన పునాదులన్నారు. పారదర్శకత, బాధ్యతాయుత పాలన, ప్రజాకేంద్రిత పాలనపై పెట్టిన దృష్టి ఈ పునాదులను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. సమగ్రంగా అభివృద్ధి చెందుతున్న మహానగరంగా తీర్చిదిద్దుతున్నాం అని వివరించారు. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రాం కింద రూ.7,032 కోట్లకు పైగా పెట్టుబడితో 45 ప్రధాన ఫ్లైఓవర్లు, అండర్‌పాసులు , 10 రహదారుల విస్తరణ ప్రాజెక్టులను అమలు చేస్తున్నామన్నారు. రూ. 1090 కోట్లు వెచ్చించి కేబీఆర్ పార్క్ పరిసరాల్లోని ప్రాజెక్టుల రద్దీ నియంత్రణ పనులు చేపడుతున్నామని తెలిపారు. పడమటి కారిడార్‌లో ఐఐటీ, ఖాజాగూడ వద్ద రూ.837 కోట్లతో మల్టీలెవల్ ఫ్లైఓవర్లు నాలెడ్జ్ ఎకానమీకి తోడ్పడుతున్నాయన్నారు. మరో రూ.70 కోట్లతో వెస్ట్రన్ సిటీలో ప్రధాన రోడ్ల విస్తరణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఉత్తర భాగంలో ఆర్మీ ఆర్డినెన్స్ సెంటర్ సమీపంలో ఏళ్లనాటి ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు రూ.960 కోట్లతో పనులు చేపట్టినట్టు వివరించారు. తూర్పు భాగంలో టీకేఆర్ కాలేజ్, గాయత్రి నగర్, మండమల్లమ్మ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్లు కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు రూ. 416 కోట్లతో పనులు చేపట్టినట్టు తెలిపారు. దక్షిణ భాగంలో విస్తరిస్తున్న పట్టణాభివృద్ధికి రోడ్డు విస్తరణ ప్రాజెక్టులను రూ .863 కోట్లతో చేపట్టినట్టు వివరించారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 కింద క్యూర్, ప్యూర్, రేర్ వ్యూహం రాష్ట్ర అభివృద్ధిలో కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీని కేంద్రంగా ఉంచుతోందని తెలిపారు. హైదరాబాద్ … తెలంగాణకు ఉపాధి, ఆవిష్కరణలు, గ్లోబల్ పెట్టుబడుల ప్రధాన ఇంజిన్‌గా కొనసాగుతుందన్నారు. వరదల నుంచి భద్రత, వాతావరణ అనుకూలత కోసం ప్రత్యేకంగా లోతట్టు, వెనుకబడిన ప్రాంతాలకు ఉపయోగపడేలా సమగ్ర స్టార్మ్ వాటర్ మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నాం అన్నారు. యూఎంటీఏ ద్వారా సమగ్ర స్పేషియల్ మాస్టర్ ప్లాన్, బ్లూ-గ్రీన్ , సమగ్ర మొబిలిటీ ప్లాన్‌లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. దీర్ఘకాలిక ప్రణాళికలు, సంస్థాగత బలోపేతం, స్థిరమైన అభివృద్ధిపై తమ ప్రభుత్వ నిబద్ధతను చాటుతున్నాయని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. వృద్ధి స్థిరంగా ఉండాలి… అభివృద్ధి నైతికంగా ఉండాలి… పురోగతి మానవీయంగా ఉండాలి అని డిప్యూటీ సీఎం అన్నారు. దేశంలోనే అత్యంత నివసించదగిన, పెట్టుబడులకు అనుకూలమైన, మంచి పాలనతో కూడిన నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం లక్ష్యం అన్నారు. స్మార్ట్, స్థిరమైన, సమగ్ర, న్యాయసమ్మతమైన భవిష్యత్‌కు సిద్ధమైన హైదరాబాద్‌కు పునాదులు వేస్తున్నామన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు