వక్ఫ్ చట్టంలోని కొన్ని అంశాల మీద సుప్రీంకోర్టు కొన్ని ప్రశ్నలు లేవనెత్తిన వెంటనే బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే అత్యున్నత న్యాయస్థానం మీద విరుచుకుపడడం యాదృచ్చికం కాదు. అంతకన్నా మించి బీజేపీ ప్రభుత్వంలో అగ్ర నాయకులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రోద్బలం లేకుండా, కనీసం కనుసైగ చేయకుండా నిశికాంత్ దుబే సుప్రీంకోర్టు మీద విమర్శలు చేయడానికి సాహసించి ఉండరు. ఎంతటి మాలిమిగల కుక్క అయినా యజమాని సైగ చేయనిదే ఎవరి మీదా రెచ్చిపోదు. నిశికాంత్ దుబే ప్రవర్తన అగ్ర నాయకుల వైఖరికి అనుగుణంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. నిశికాంత్ దుబే రెండు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మొదటిది సుప్రీం కోర్టు శాసనాలు చేయడానికి ప్రయత్నిస్తోందని, అత్యున్నత న్యాయస్థానమే చట్టాలు చేసేటట్టయితే ఇక పార్లమెంటు ఎందుకు, మూసేయొచ్చుగా అని దుబే అన్నారు. రెండు: ఎస్.వై. ఖురేషీ ప్రధాన ఎన్నికల కమిషన్ కమిషనర్‌గా ఉన్నప్పుడు ముస్లింలకు అనుకూలంగా ఉందని దుబే ఆరోపించారు. ఇందులో మొదటిది సుప్రీంకోర్టు మీద నేరుగా దాడి చేయడం అయితే ఖురేషీ మీద ఎక్కుపెట్టిన బాణం బీజేపీకి ఇంపైన ముస్లిం విద్వేషంతోనూ, ఎన్నికల కమిషన్ అధిపతులకు ఉన్న పరిమితులను పరిగణనలోకి తీసుకోకుండా చేసిన వ్యాఖ్యలా ఉంది. మొదటి వ్యాఖ్యను కోర్టు ధిక్కారం కింద పరిగణించవచ్చు. సుప్రీంకోర్టు వక్ఫ్ చట్టం మీద కొన్ని ప్రశ్నలు లేవనెత్తిన వెంటనే ప్రభుత్వం ఈ అంశంపై మే అయిదో తేదీన విచారణ ముగిసే దాకా ఆ చట్టంలోని కొన్ని అంశాలను అమలు చేయబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం చూస్తే మోదీ ప్రభుత్వం ఎంతటి ఇరకాటంలో చిక్కుకుందో అర్థం అవుతోంది. చట్టసభలు చేసిన చట్టాలు రాజ్యాంగ బద్ధమైనవా కాదా అని పరిశీలించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. ఆ న్యాయస్థానం కొన్ని ప్రశ్నలు లేవనెత్తగానే ఆ చట్టంలోని కొన్ని అంశాలను అమలు చేయబోమని ప్రభుత్వం నిండు న్యాయస్థానంలో హామీ ఇవ్వడం చూస్తే ఆ చట్టంలో లొసుగులున్నాయని అంగీకరించినట్టే. వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టు లేవనెత్తిన ప్రశ్నలను మోదీ బహిరంగంగా వ్యతిరేకించకపోయినప్పటికీ తాము ఆమోదించిన వక్ఫ్ బిల్లు రాజకీయంగా సరైందేనని దేశంలోని వివిధ ప్రాంతాలలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలలోని అంతరార్థాన్ని సులభంగానే గ్రహించవచ్చు. దీన్నిబట్టి సుప్రీంకోర్టు మీద దండయాత్రకు బీజేపీ నాయకత్వం సిద్ధమైనట్టు తేలిపోతూనే ఉంది. ఈ సిద్ధపడడం వెనక పెద్ద కుట్రే ఉంది. సుప్రీంకోర్టును గుప్పెట్లో పెట్టుకోవాలని మోదీ ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. అత్యున్నత న్యాయస్థానం మీద అగ్రనాయకులు బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా ఆ పని చేయడానికి తమ అనుయాయులను ప్రయోగిస్తున్నారని స్పష్టం అవుతూనే ఉంది. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్‌్ కూడా అత్యున్నత న్యాయస్థానం మీద దాడి చేయడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు. ఆయన రాజ్యాంగబద్ధమైన తన హోదాను కూడా విస్మరించి మాట్లాడుతున్నారు. మోదీ ప్రయోజనాలను పరిరక్షించడమే ధన్కర్ ప్రధాన వ్యాపకం అయిపోయింది. వక్ఫ్ బిల్లు మీద సుప్రీంకోర్టు వైఖరిని ధన్కర్‌్ ఘాటుగానే విమర్శించారు. న్యాయమూర్తులు ‘‘సూపర్ పార్లమెంటులా’’ వ్యవహరిస్తున్నారని ధన్కర్ దుమ్మెత్తి పోశారు. ఆగ్రహ జ్వాలలతో రగిలిపోతున్న అనుభవజ్ఞుడైన న్యాయవాది కూడా అయిన ధన్కర్ చట్ట సభలు చేసే శాసనాల మంచి చెడ్డలను వివేచించే అధికారం ఉందన్న వాస్తవాన్ని ఆయన వాటంగా విస్మరించారు. ఆయన ఏకంగా సుప్రీంకోర్టు 142 వ అధికరణాన్ని ‘‘అణ్వస్త్రం’’ లా వినియోగిస్తోందని వ్యాఖ్యానించడం తన స్థాయిని మరిచిపోవడమే. ఆయన వ్యాఖ్యల వెనక ఏదో దురుద్దేశం ఉందని, ఏలిన వారి ప్రాపకం కోసం ఆయన ఆత్ర పడ్తున్నారని, తన భవిష్యత్తును సుస్థిరం చేసుకోవడానికి నానా తంటాలు పడ్తున్నారని పామరులకైనా అర్థం అవుతూనే ఉంది. నిశికాంత్‌దుబే లాంటి అపరిపక్వ నాయకుల విమర్శలకు, ధన్కర్ అనుచిత వ్యాఖ్యలకు, మోదీ పరోక్ష విమర్శలకు పెద్ద తేడా ఏమీ లేదు. అంటే సర్వోన్నత న్యాయస్థానం మీద ముప్పేట దాడి చేయడమే బీజేపీ పరమ లక్ష్యంగా కనిపిస్తోంది. ఒక వేపు ఉప రాష్ట్రపతిగా, మరో వేపు రాజ్యసభ అధ్యక్షుడిగా ధన్కర్ నిర్వహిస్తున్న రెండు బాధ్యతలూ రాజ్యాంగబద్ధమైనవేనని, వాటిని తటస్థంగా నిర్వర్తించాలని ధన్కర్‌్ గుర్తిస్తున్నట్టు లేదు. ఆయన బీజేపీ అభ్యర్థిగా ఉప రాష్ట్రపతి పదవికి ఎన్నికైతే కావొచ్చు కానీ నిష్పాక్షికంగా వ్యవహరించడం ఆయన పాటించి తీరవలసిన రాజ్యాంగ ధర్మం.
మోదీ హయాంలో ఇంతకు ముందు న్యాయశాఖ మంత్రిగా ఉన్న కిరణ్ రిజిజు కూడా సుప్రీంకోర్టు మీద ఒంటికాలి మీద లేచేవారు. న్యాయవ్యవస్థను ఎలాగైనా గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటున్న మోదీ పదకొండేళ్ల పాలనలో ప్రజాస్వామ్య నియమాలను అడుగడుగునా ఉల్లంఘిస్తూనే ఉన్నారు. అధిక సంఖ్యాక పాలనకే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. అంటే హిందువుల ఆధిపత్య ధోరణి వాదానికే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటివరకు మోదీ పాలనలో వివాదాస్పదంగా మారిన లవ్ జిహాద్, మూక హత్యలు, బహిరంగంగా ఇతర మతాలకు చెందిన వారి మీద దాడి చేయడం, రామ మందిర నిర్మాణం, జమ్మూ-కశ్మీర్‌కు వర్తించే 370 వ అధికరణాన్ని రద్దు చేసినప్పుడు సుప్రీంకోర్టు నుంచి పెద్ద వ్యతిరేకత వ్యక్తం కాలేదు. వక్ఫ్ బిల్లు విషయంలోనూ తమ విద్వేష రథం నిర్నిరోధంగా సాగిపోతుందనుకున్నారు. సుప్రీంకోర్టు మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన నిశికాంత్ దుబే మీద కోర్టు ధిక్కార నేరం కింద చర్య తీసుకోవడానికి అనుమతించాలని కోరుతూ సుప్రీంకోర్టు న్యాయవాది అనస్ తన్వీర్ అటార్నీ జనరల్ ఆర్.వింకతా రమణికి లేఖ కూడా రాశారు. నిశికాంత్ దుబే వ్యాఖ్యలు కచ్చితంగా అత్యున్నత న్యాయస్థానం గౌరవానికి, ఆధికారానికి విఘాతం కలిగించేవిగా ఉన్నాయి. నిశికాంత్ దుబే తాను చట్టానికి అతీతుడినన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ దుస్సాహసానికి కళ్లెం వేయాల్సిందే. ఎస్.వై. ఖురేషీ ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి కాదని, ఆయన ‘‘ముస్లిం కమిషనర్’’ అని దుబే చేసిన వ్యాఖ్యలు కూడా రాజ్యాంగ వ్యవస్థ అయిన సుప్రీంకోర్టు గౌరవాన్ని మంటగలిపేలా ఉన్నాయి. దుబే వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డా అనడం తమ ఎంపీలు క్రమశిక్షణతో వ్యవహరించేలా చూడడంలో బీజేపీ నాయకత్వ వైఫల్యం కిందే కాదు. ఆ నిష్క్రియాపరత్వం వెనక బీజేపీ విద్వేష పూరిత, వ్యవస్థలను ధ్వంసం చేసే వైఖరికి సంపూర్ణ నిదర్శనం. నిజంగా క్రమశిక్షణ విషయంలో బీజేపీ కచ్చితంగా వ్యవహరించి ఉంటే నిశికాంత్ దుబే దుస్సాహసానికి ఒడిగట్టే వారే కాదు. సుప్రీంకోర్టును కించపరిచే వారి మీద చర్య తీసుకోవాల్సింది ఆ సర్వోత్తమ వ్యవస్థే.