Wednesday, July 2, 2025
Homeవిశ్లేషణరైతుకు చేదు మిగులుస్తున్న మామిడి

రైతుకు చేదు మిగులుస్తున్న మామిడి

డా టి.జనార్ధన్‌

ఉద్యాన పంటలకు కేంద్రంగా రాయలసీమను అభివృద్ధి చేస్తాం. తద్వారా ఆ ప్రాంత రైతాంగం పండిరచే పండ్లు, కాయగూరలు, పూలు స్థానిక వినియోగానికే కాకుండా దేశ విదేశాలకు ఎగుమతులను ప్రోత్సహిస్తాం. ప్రభుత్వ సాయంతో రైతు ఆదాయం రెట్టింపు చేస్తాం…. ఈ మాటలు మన పాలకులు తరచూగా సెలవిస్తుంటారు, రాయలసీమలో సాగునీటి సౌకర్యం పుష్కలంగా వుంటే ఆహార ధాన్యాలే పండిరచేవారు. వర్షాధారంపైన మెట్టభూముల్లో బోర్లు వున్నచోటనే ఉద్యాన పంటలు సాగుకు వీలవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యేటా ఆహార ధాన్యాలు, పప్పు దినుసులకు మాత్రమే కనీస మద్దతు ధర ప్రకటిస్తుంటాయి. కనుక ఈ ప్రాంత రైతాంగం పంట చేతికొచ్చే సమయానికి మార్కెట్‌ ఎగుడుదిగుడులపైన, పండ్ల వ్యాపారులు, గుజ్జు(పల్ప్‌) ఫ్యాక్టరీ యజమానుల సిండికేట్‌గా ధరలు అమాంతంగా తగ్గిస్తారు. అందువల్లనే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి, టమోటా రైతుల పరిస్థితి దయనీయంగా మారుతోంది.
నీటిపారుదల సౌకర్యంలేని రాయలసీమలో అధిక శాతం రైతాంగం మామిడి, టమోటా సాగు వైపే మొగ్గుచూపుతున్నారు. టమోటాకు తరచుగా దిగుబడి తగ్గిన పరిస్థితుల్లో కిలో రూ.100 వరకు అమ్ముడుపోయిన సందర్భాలు చూస్తుంటాం. కానీ మామిడి రైతాంగం మాత్రం ప్రతి ఏడాది గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కే పరిస్థితి ఎదురవుతోంది. రాష్ట్రంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి సాగులో ప్రథమ స్థానం ఆక్రమించింది. జిల్లాలో సాగయ్యే 2.80 లక్షల ఎకరాల్లో 10 లక్షల టన్నుల దాకా మామిడి దిగుబడి అవుతోంది. అందులో 70 శాతం వరకు తోతాపురి (అంటుమామిడి) రకం పంట ప్రధానం కాగా, మిగతా బేనీషా, అల్ఫాన్సాన్‌, పులేరా, సిందూరం, నీలం వంటి టేబుల్‌ రకాల ఉత్పత్తి జరుగుతోంది. అధిక శాతం గుజ్జు కలిగివున్న వీటిని విదేశాలకు ఎగుమతి చేస్తే కిలోకు రూ.500 నుంచి రూ.1000 వరకు ఆదాయం సమకూరగలదు. అయితే మన ఉద్యాన శాఖగానీ, అపెడా (అగ్రికల్చర్‌ ఎక్సోఫోర్ట్స్‌ డెవలప్మెంట్‌ అథారిటీ) ఈ విషయంలో తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగా వుంటున్నాయి. ఇక తోతాపురి 25 శాతం వరకు మార్కెట్‌ యార్డులు, ర్యాంపుల ద్వారా దేశీయ మార్కెట్‌కు వెళుతోంది. తద్వారా రైతులకు ఎంతోకొంత గిట్టుబాటు దక్కేది. తోతాపురిలో సింహభాగం 75 శాతానికిపైగా జిల్లాలోని 45 గుజ్జు పరిశ్రమలకు తరలించి, పల్ప్‌ తయారీలో కీలక పాత్ర పోషిస్తోంది. ఏటా 6 లక్షల మామిడి కాయల నుంచి 3 లక్షల టన్నుల పల్ప్‌ తయారవుతోంది. సీజన్‌ పూర్తవగానే… పల్ప్‌ ఫ్యాక్టరీల యజమానులు వివిధరకాల శీతల పానియాలు తయారుచేసే కార్పొరేట్‌ కంపెనీలకు విక్రయిస్తున్నాయి. . ప్రతి సంవత్సరం దేశీయ వినియోగం తగ్గడం, నాణ్యతా లోపాలతో మన పల్ప్‌ ఎగుమతులు కుంటుపడ్డాయి. దాంతో పల్ప్‌ ఫ్యాక్టరీల్లో సగానికిపైగా నిల్వలు పేరుకుపోయాయి. ఇదే సాకుగా చూపి ఫ్యాక్టరీల యజమానులు సీజన్‌ ప్రారంభం కాకమునుపే తోతాపురి కొనుగోలు చేయలేమంటూ తమ అశక్తతను వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా యంత్రాంగం ప్రధానంగా కలెక్టర్‌ జనవరి నుంచి ఇప్పటి వరకు మూడు దఫాలుగా పల్ప్‌ ఫ్యాక్టరీ యజమానులు, రైతులతో విడివిడిగా, సంయుక్తంగా సమావేశాలు నిర్వహించి పరిస్థితిని విశదీకరించారు. వివిధ కార్పొరేట్‌ కంపెనీలతోనూ మాట్లాడి రూ.10కు రైతుల నుంచి కొనుగోలు చేసినా ఎలాంటి నష్టమూ వాటిల్లదని వివరించారు. 2022లో ఇదే పల్ప్‌ పరిశ్రమల యజమానులు రూ.12తో కొనుగోలు ప్రారంభించి సీజన్‌ చివరిలో రూ.50కు కొనుగోలు చేశారు. ఆనాడు డిమాండ్‌ మేరకు పల్ప్‌ తయారుచేసేందుకు అధిక ధరలు రైతులకు చెల్లించడమే కాకుండా, పల్ప్‌ విక్రయం ద్వారా ఇబ్బడిముబ్బడిగా లాభాలు గడిరచారు. దాన్ని దృష్టిలో వుంచుకుని జిల్లా కలెక్టర్‌ కనీస ధర రూ.12గా నిర్ణయించాలని ప్రభుత్వానికి నివేదించారు. రైతాంగం టన్ను పండిరచేందుకు ఉత్పత్తి వ్యయం రూ.12 అవుతోంది. రైతులకు లాభసాటి కాకున్నా నష్టం రాకుండా వుండాలంటే కిలో మామిడిని రూ.12కు కొనుగోలు చేయాలని జూన్‌ 3న జరిగిన త్రైపాక్షిక సమావేశం ఆ మేరకు ధర నిర్ణయించారు.
రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు అప్పటికే మామిడి పక్వానికి వచ్చి రాలిపోతున్న తరుణంలో మరోమార్గం లేక రూ.12 కు అంగీకరించారు. అయితే ఫ్యాక్టరీల యజమానులు సహాయ నిరాకరణకు పూనుకున్నారు. సమావేశంలో మౌనం వహించి వెనువెంటనే ప్రభుత్వంపై రాజకీయఒత్తిడి తీసుకొచ్చారు. ఇక ప్రభుత్వం 2019లో కిలో రూ.5కు పడిపోయిన సందర్భంగా రూ.2.50 సబ్సిడీ అందించి కొంత మేర ఆదుకున్న విధంగా ఈ ఏడాది కూడా కిలోకు రూ.4 ప్రోత్సాహం అందింజేలా సమ్మతింపజేసి తాము రూ.8 మాత్రమే ఇవ్వడానికి సిద్ధపడిరది. ఆ మేరకు ప్రతి ఫ్యాక్టరీ, ర్యాంపుల వద్ద రూ.8 కచ్చితంగా కొనుగోలు చేయాలని ప్రభుత్వ ప్రోత్సాహం రూ. 4తో కలిపి రైతుకు రూ.12 చెల్లించేలా ఒప్పందానికి వచ్చారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఫ్యాక్టరీ యజమానులు తోతాపురి సత్వరం కొనుగోలు చేయాలని, క్రషింగ్‌ మొదలుపెట్టాలని, ప్రతి యూనిట్‌ వద్ద బహిరంగంగా ధరల పట్టిక (రూ.8, రూ.4) ప్రదర్శించాలని, రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రాధాన్యతా క్రమంలో పర్మిట్లు జారీ, కాయలు అన్‌లోడిరగ్‌ చేయాలని, బయట రాష్ట్రాల కాయలు కొనుగోలు చేయరాదని, రైతుల వివరాలను రోజువారీగా రికార్డు నిర్వహించాలని కలెక్టర్‌ తన ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఇంతగా లబ్దిపొందుతున్నా ఫాక్టరీల యజమానులు పక్క రాష్ట్రాల నుంచి మామిడి రూ.5కే లభ్యమవుతున్నదని, వారి వద్ద చౌకగా కొని మన జిల్లా రైతాంగానికి మొండిచెయ్యి చూపిస్తూ, కలెక్టర్‌ ఉత్తర్వులకు తిలోదకాలు ఇచ్చేందుకు పూనుకున్నారు. ప్రభుత్వం తరపున ప్రతి మండలానికి ఒక ఉన్నతాధి కారి ఫ్యాక్టరీ వద్ద ఉద్యాన, వ్యవసాయ, రెవెన్యూ అధికారిని నియమించి రెండు షిఫ్టుల్లో రైతులకు ఇబ్బంది కలగకుండా పర్మిట్ల జారీ, వివరాలు నమోదుకు ఏర్పాట్లు చేశారు. ధరల పట్టిక ప్రదర్శించకపోగా తాము రూ.5 నుంచి రూ.6 మాత్రమే చెల్లిస్తామంటూ ఎదురుదిరిగారు. ఇంతటితో ఆగక తమ ఫ్యాక్టరీల వద్ద అధికారులు వుండటమంటే అక్రమ చొరబాటు కిందకు వస్తుందంటూ ప్రభుత్వంపై కేసులు వేస్తామంటూ బెదిరింపులకు పూనుకున్నారు. జిల్లాలో ఎక్కడా ఫ్యాక్టరీలు రూ.8 ఇవ్వడానికి సమ్మతించకపోవడం, రైతుల పర్మిట్లకు, అన్‌లోడిరగ్‌కు పడే అగచాట్లు మరీ ఘోరంగా ర్యాంపుల వద్ద రూ.3 లేదా రూ. 4కే కొనుగోలు చేయడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరమైంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం, మామిడి రైతుల సంక్షేమ సంఘం వివిధ దఫాలు సత్యాగ్రహం చేపట్టాయి. ఫ్యాక్టరీల వారు రూ.6లే చెల్లిస్తున్నందున ప్రభుత్వ ప్రోత్సాహం రూ.4 నుంచి రూ.6కు పెంచాలని, ర్యాంపుల నిర్వాహకులపై తగు చర్యలు తీసుకోవాలని, పర్మిట్లలో రాజకీయ జోక్యం నివారించాలని కోరాయి. అదనపు సబ్సిడీ అందజేసే విషయం ప్రభుత్వ అనుమతిపై ఆధారపడి వుందని, పల్ప్‌ యజమానులపైన సీజన్‌ తరువాత చర్యలుంటాయని చిత్తూరు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో రైతాంగం తీసుకొ చ్చిన కాయలు ఫ్యాక్టరీల వద్ద రెండు నుంచి మూడు రోజులు క్యూలైనులో వుండాల్సిన పరిస్థితి తలెత్తడంతో, ట్రాక్టర్‌ బాడుగలు పెరిగిపోతున్నాయి. పండిరచిన పంటను అమ్ముకోలేని దుస్థితి దాపురించిన పరిస్థితుల్లో మామిడి రైతులు తీవ్ర వేదనకు గురవుతున్నారు. మామిడి కాయలను రోడ్డుపైన పారబోస్తు న్నారు. ఇక ఈ పంటే వొద్దు అనే నిర్ణయానికి వచ్చి మామిడి చెట్లు సరికేసి ఇతర పంటలకు మళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏడు చక్కెర ఫ్యాక్టరీలు వుండేవి. ఇందులో ఆరు మూతపడ్డాయి. దీంతో జిల్లాలో చెరకు సాగు కనుమరుగయింది. ఇలాంటి పరిస్థితే మామిడికీ దాపురించే ప్రమాద ముంది. అదే జరిగితే టమోటా, చెరకు రైతుల చెంతన మామిడి రైతులూ చేరు తారు. ఈ నేపథ్యంలో మామిడి రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుంది. మామిడి బోర్డు ఏర్పాటు చేయాలని దశాబ్దాలుగా కోరుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. మామిడి బోర్డు ఏర్పాటు చేసి, మొత్తంగా మామిడి సాగు, ధరలు, మార్కెట్‌ తదితర అంశాలను సమగ్రంగా అధ్యయనం చేయడం ద్వారా రైతుకు మేలు చేయడానికి వీలుంటుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు