Tuesday, February 4, 2025
Homeవెడల్పు చేయాల్సిందే

వెడల్పు చేయాల్సిందే

. చివరి ఆయకట్టుకు సాగునీరు అందే వరకు పోరు
. హంద్రీనీవా కాలువ సామర్ధ్యం పదివేల క్యూసెక్కులకు పెంచాలి
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో-అనంతపురం : రాయలసీమలోని హంద్రీనీవా సుజల స్రవంతిపై కూటమి ప్రభుత్వం మాటమార్చడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హితవు పలికారు. రాయలసీమ ప్రజల మద్దతు కూడగట్టడానికి కూటమి నేతలు హంద్రీనీవా ప్రాజెక్టును తెరమీదకు తెచ్చిన విషయాన్ని విస్మరించరాదని సూచించారు. తాము అధికారంలోకి వస్తే హంద్రీనీవా కాలువను పదివేల క్యూసెక్కుల సామర్ధ్యానికి పెంచుతామని, చివరి ఆయకట్టుకు నీళ్లు అందిస్తామని కూటమి నేతలు నమ్మబలికారని ఆరోపించారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని హంద్రీనీవా సుజల స్రవంతి జిల్లా కార్యాలయం ముందు సీపీఐ అధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాల నేతలతో మంగళవారం భారీ ధర్నా జరిగింది. రామకృష్ణ మాట్లాడుతూ కర్నూలు జిల్లా మల్యాల నుండి చిత్తూరు జిల్లా కుప్పం వరకు కృష్ణా జలాలు మళ్లించడానికి హంద్రీనీవా సుజల స్రవంతి పథకాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వాలు… రైతుల ఆశయాలకు అనుగుణంగా పనిచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హంద్రీనీవా కాలువ సామర్థ్యం పెంచి చివరి ఆయకట్టుకు నీళ్లు ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు… ఇప్పుడు మాట మారుస్తున్నారని ఆరోపించారు. పదివేల క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువ వెడల్పు చేసి ఆరు లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు 30 లక్షల మందికి తాగు నీరు అందించాలనేది ప్రధాన డిమాండని, చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని 50 ఏళ్లుగా పోరాటం జరుగుతోందని గుర్తు చేశారు. హంద్రీనీవాకు సంబంధించి కాంక్రీటు లైనింగ్‌ చేపట్టి రైతులను నష్టాలకు గురిచేస్తే ఉద్యమిస్తామని రామకృష్ణ హెచ్చరించారు. మొదటి దశ కింద 14 టీఎంసీల నీటిని వాడుకోవాల్సి ఉండగా… కాలువ సామర్థ్యం లేక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. బనకచర్ల వరకు కాలువ తవ్వి గోదావరి నీళ్లు ఇస్తామంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు… హంద్రీనీవా కాలువ విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లా రైతాంగానికి సాగునీరు, తాగునీరు అందించే ప్రాజెక్టులపై శీతకన్ను ఎందుకని నిలదీశారు. మదనపల్లిలో ఇప్పటికే రైతులు ఆందోళన మొదలుపెడితే అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారని గుర్తు చేశారు. 30 ఏళ్లుగా కృష్ణా జలాలు రాయలసీమకు మళ్లింపు వివాదం కొనసాగుతూనే ఉందన్నారు. ముఖ్యమంత్రులు మారినా రాయలసీమ రైతుల సమస్యలు మాత్రం తీరడం లేదన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీశ్‌ మాట్లాడుతూ రెండో దశ లైనింగ్‌ పనులు వెంటనే నిలిపివేయాలని, కాలువ సామర్థ్యం పెంచి చెరువులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతపురం జిల్లాలో శ్రీకృష్ణదేవరాయల కాలంనాటి చెరువులు నీళ్లు లేక వెలవెలబోతున్నాయని, హంద్రీనీవా ద్వారా నీటి మళ్లింపే దీనికి పరిష్కారమన్నారు. రాజకీయాలకు అతీతంగా రైతు సంఘాలు, ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మల్యాల నుండి జీడిపల్లి వరకు హంద్రీనీవా కాలువకు సమాంతరంగా మరొక కాలువ తవ్వి రైతాంగాన్ని ఆదుకోవాలని, లేనిపక్షంలో రాయలసీమ రైతాంగానికి ఉరితాళ్లు బిగించినట్లే అవుతుందని గుర్తు చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి సి.జాఫర్‌ మాట్లాడుతూ హంద్రీనీవా ద్వారా సాగునీరు అందించి కరువు ప్రాంతాన్ని ఆదుకోవాలని, లైనింగ్‌ పనులు ఆపాలనే ప్రధాన డిమాండుతో రైతాంగం పోరాటం చేస్తోందన్నారు. సీపీఐ సత్యసాయి జిల్లా కార్యదర్శి ఎం.వేమన్న యాదవ్‌ మాట్లాడుతూ హంద్రీనీవా దీర్ఘకాలిక సమస్యగా మారిందని, 40 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా పరిష్కారానికి నోచుకోకపోవడం సిగ్గు చేటన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప, మానవహక్కుల సంఘం నాయకులు బాషా, సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకులు నాగరాజు మాట్లాడారు. ధర్నా అనంతరం హంద్రీనీవా డిప్యూటీ కలెక్టరుకు వినతిపత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎ. కాటమయ్య, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు పి.నారాయణస్వామి, సి.మల్లికార్జున, కార్యదర్శి వర్గ సభ్యులు జె.రాజారెడ్డి, బి.కేశవరెడ్డి. ఎన్‌.శ్రీరాములు, పి.రామకృష్ణ, వీరభద్రస్వామి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చెన్నప్ప యాదవ్‌, జిల్లా నాయకులు టి.నారాయణస్వామి, బి.రమణయ్య, సి.లింగమయ్య, అనంతపురం, గుంతకల్లు, గుత్తి, పుట్లూరు, నార్పల మండల కార్యదర్శులు మేకల రమేశ్‌, రాము రాయల్‌, రాందాస్‌, పెద్దయ్య, గంగాధర్‌, కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు