Wednesday, April 30, 2025
Homeజాతీయంభార‌త్‌ను వీడిన 786 మంది పాకిస్థానీలు.. పాక్ నుంచి 1,376 మంది భార‌తీయుల‌ రాక

భార‌త్‌ను వీడిన 786 మంది పాకిస్థానీలు.. పాక్ నుంచి 1,376 మంది భార‌తీయుల‌ రాక

ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి త‌ర్వాత దాయాది పాకిస్థాన్‌పై భార‌త ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌ల‌కు దిగిన విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా భార‌త్‌లో ఉన్న పాకిస్థానీల‌ను దేశం విడిచిపెట్టి వెళ్లాల‌ని ఈ నెల 24న భార‌త విదేశాంగ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్‌ 27 వ‌ర‌కు పాకిస్థానీలంద‌రూ భార‌త్ నుంచి వెళ్లిపోవాల‌ని తెలిపింది. అలాగే మెడిక‌ల్ వీసాపై ఉన్న‌వారికి 29 వ‌ర‌కు గ‌డువు ఇచ్చింది. దీంతో ఏప్రిల్ 24 నుంచి ఆరు రోజుల్లో పంజాబ్‌లోని అటారీ- వాఘా పాయింట్ ద్వారా 786 మంది పాకిస్థానీయులు స్వదేశానికి వెళ్లిపోయినట్లు ఒక సీనియర్ అధికారి తెలిపారు. అదే సమయంలో 1,376 మంది భారతీయులు పాకిస్థాన్ నుంచి అట్టారి-వాఘా సరిహద్దు ద్వారా తిరిగి వచ్చారని అధికారి తెలియజేశారు. ఇక‌, 12 క్యాటగిరీల కింద స్వల్ప కాల వ్యవధి వీసాదారులు ఈ నెల 27లోగా దేశం వదిలి వెళ్లిపోవాలని భారత్‌ ఆదేశించింది. సార్క్‌ వీసా కలిగి ఉన్న వారికి ఏప్రిల్‌ 26, మెడికల్‌ వీసాలు ఉన్న వారికి ఏప్రిల్‌ 29 డెడ్‌లైన్‌గా విధించిన విషయం తెలిసిందే.ఒకవేళ ప్రభుత్వ ఆదేశాలు ధిక్కరించి, ప్రభుత్వం విధించిన గ‌డువులోగా భారత్‌ విడిచి వెళ్లని పాకిస్థానీయులను అధికారులు అదుపులోకి తీసుకోవ‌డం జ‌రుగుతోంది. వారికి మూడేళ్ల‌ జైలు శిక్ష, లేదా 3 లక్షల జరిమానా లేక రెండు శిక్షలూ విధించే అవకాశం ఉంది.

కాగా, ప్ర‌స్తుతం ఇరుదేశాల మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌త‌ ప‌రిస్థితుల దృష్ట్యా పాకిస్థాన్ కు ప్రయాణించవద్దని భారత పౌరులకు కేంద్ర‌ ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉన్న భారతీయ పౌరులు కూడా వీలైనంత త్వరగా స్వ‌దేశానికి తిరిగి రావాలని తెలిపింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు