Tuesday, June 24, 2025
Homeతెలంగాణఫ్యూచర్‌ సిటీలో పెట్టుబడులకు ప్రోత్సాహం

ఫ్యూచర్‌ సిటీలో పెట్టుబడులకు ప్రోత్సాహం

. తెలంగాణలో ఉన్న అనుకూలతలను వివరించండి
. ఫ్రెంచ్‌ కంపెనీలు ఇక్కడికొచ్చేలా చొరవ చూపండి
. ‘ఇఫ్కీ’ సమావేశంలో మంత్రి శ్రీధర్‌ బాబు

విశాలాంధ్రహైదరాబాద్‌ : భావితరాల అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న ఫ్యూచర్‌ సిటీలో పెట్టుబడులు పెట్టేలా ఫ్రెంచ్‌ కంపెనీలను ప్రోత్సహించాలని ఇండోఫ్రెంచ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఇండస్ట్రీ (ఇఫ్కీ) ప్రతినిధులను మంత్రి శ్రీధర్‌ బాబు కోరారు. మంగళవారం డా.బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో ఇఫ్కీ ప్రతినిధులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకున్న అనుకూలతలు, ప్రభుత్వం తరపున అందిస్తున్న ప్రోత్సాహాకాలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. ‘తెలంగాణ బ్రాండ్‌ను విశ్వ వ్యాప్తం చేయాలనే దూరదృష్టితోనే సీఎం రేవంత్‌ రెడ్డి 30 వేల ఎకరాల్లో పీపీపీ విధానంలో ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఇది ఒక నగరం. అంతర్జాతీయ భాగస్వామ్యంతో ఈ నగరాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలన్నదే మా సంకల్పం’ అని వివరించారు. ‘ఏడాదిన్నర వ్యవధిలోనే తెలంగాణకు రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గత ఏడాది హైదరాబాద్‌లో 70 జీసీసీలు ప్రారంభమయ్యాయి. పారిశ్రామికవేత్తలకు మా ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం. పరిశ్రమలకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ప్రతిభ గల మానవ వనరులకు కొరత లేదు. మరింత వేగంగా… సరళంగా… పారదర్శకంగా అనుమతులిచ్చేందుకు టీజీఐపాస్‌ను ఏఐతో అనుసంధానం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని చెప్పారు. ‘ఏరో స్పేస్‌, ఫార్మా, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఐటీ లాంటి రంగాల్లో అనేక ఫ్రెంచ్‌ కంపెనీలు ఇప్పటికే తెలంగాణలో పెట్టుబడులు పెట్టాయి. సనోఫి, మోనిన్‌, సఫ్రాన్‌, క్యాప్‌ జెమినీ, డసాల్ట్‌, టెలీ పర్‌ ఫార్మెన్స్‌, ఓపెల్లా హెల్త్‌ కేర్‌ లాంటి దిగ్గజ సంస్థలు తమ కార్యకలాపాలను ఇక్కడ నిర్వహిస్తున్నాయి. ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌, క్లీన్‌ ఎనర్జీ, గ్రీన్‌ మొబిలిటీ, డిజిటల్‌ గవర్నెన్స్‌, ఆగ్రో ఇన్నోవేషన్‌, స్మార్ట్‌ హెల్త్‌ సిస్టమ్స్‌, ఫ్యూచర్‌ రెడీ ఎడ్యుకేషన్‌, సస్టైనబుల్‌ మ్యానుఫాక్చరింగ్‌ తదితర రంగాల్లో మంచి అవకాశాలు ఉన్నాయి. దీనిని ఫ్రాన్స్‌ పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకునేలా చొరవ చూపండి’ అని ఇఫ్కీ ప్రతినిధులను కోరారు. ‘తెలంగాణఫ్రెంచ్‌’ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఇఫ్కీ నుంచి యోహాన్‌ సామ్యూల్‌, ప్రియాంక్‌ ప్రకాష్‌, నకుల్‌ దల్వాలా, మోనిన్‌, ఓపెల్లా హెల్త్‌ కేర్‌, సఫ్రాన్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ ఇంజిన్‌ సర్వీసెస్‌ ఇండియా, సనోఫీ ఇండియా, టెలిపర్‌ ఫార్మెన్స్‌, వార్‌ ఎలక్ట్రోకెమ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, జీగ్లర్‌ ఏరోస్పేస్‌ తదితర ఫ్రెంచ్‌ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు