ఫీజు బకాయిలు చెల్లింపు…జీవో 77 రద్దు…‘యువగళం’ హామీల అమలు ఏఐఎస్‌ఎఫ్ డిమాండ్
. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట నిరసనలు
. కర్నూలు కలెక్టరేట్ ముట్టడికి యత్నం…ఉద్రిక్తత
. విద్యార్థి నేతలపై పోలీస్ జులుం బ బందెల నాసర్‌జీతోపాటు 9మంది అరెస్టు
. చంద్రబాబు ఎన్నికల హామీలు నిలబెట్టుకోవాలి: శివారెడ్డి, వలరాజు, నాసర్‌జీ
విశాలాంధ్ర బ్యూరో – కర్నూలు/కడప : సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం విద్యార్థుల సమస్యల్ని తక్షణం పరిష్కరించాలని అఖిలభారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్) డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ఎదుట ఏఐఎస్‌ఎఫ్ చేపట్టిన నిరసనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఉన్నత విద్యకు శాపంగా మారిన జీవో నంబరు 77రద్దు చేయాలని, తక్షణమే పెండిరగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని నినదిస్తూ…వేలాది మంది విద్యార్థులు కదం తొక్కారు. ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర, జిల్లా నేతల నినాదాలు మారుమోగాయి. కర్నూలు కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన విద్యార్థుల్ని పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు, విద్యార్థి నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసుల వలయాలను ఛేదించుకుంటూ నేతలు ఉవ్వెత్తున ముందుకు దూసుకెళ్లిన నేతలు అక్కడ నిరసనకు దిగారు. ఏఐఎస్‌ఎఫ్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరంపురంజిల్లా కలెక్టరేట్ ఎదుట జరిగిన ఆందోళనకు ముఖ్యఅతిథిగా ఏఐఎస్‌ఎఫ్ జాతీయ కార్యదర్శి శివారెడ్డి, కర్నూలు కలెక్టరేట్ ఎదుట జరిగిన ఆందోళనలో ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్‌జీ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సోమన్న, షాబీర్ బాషా, వైఎస్‌ఆర్ కడప జిల్లా కలెక్టరేట్ ఎదుట ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి.వలరాజు, ఏఐఎస్‌ఎఫ్ నగర అధ్యక్ష,కార్యదర్శులు అక్కిరానంద్ తేజ, జిల్లా సహాయ కార్యదర్శి పీటర్, అశోక్, శమంత్, లోకాభిరామ్ చాంద్, సాగర్ భరత్ నాయకత్వం వహించారు. గుంటూరులో రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ మస్తాన్ షరీఫ్, జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు శివ, యశ్వంత్ నాయకత్వం వహించారు. ఏలూరులో ఏఐఎస్‌ఎఫ్ నేతలు సాయికుమార్, శివ, క్రాంతి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లాలో వెంకట్, రవి, అనాకపల్లిలో బాబ్జి, ఫణీంద్ర ఆందోళనలకు నాయకత్వం వహించారు. విశాఖజిల్లాలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా నేతలు శేఖర్, నాగరాజు, విజయనగరంలో నాగభూషణం, సునీల్, అనంతపురం జిల్లాలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు హనుమంత రాయుడు, జిల్లా కోశాధికారి ఆంజనేయులు, నగర కార్యదర్శి మహేశ్ తదితరులు నిరసనకు దిగారు. శ్రీసత్యసాయిజిల్లాలో లో మూర్తి, మహేంద్ర కలెక్టరేట్ల ఎదుట నిరసనల్లో పాల్గొన్నారు. నంద్యాలజిల్లాలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి సూర్యప్రతాప్, నాయకులు శశిధర్‌రెడ్డి, ప్రవీణ్ తదితరులు ఆందోళనలు చేపట్టారు. అన్నమయ్యజిల్లాలో కోటేశ్వరరావు, మాధవ్, తిరుపతి జిల్లాలో రాష్ట్ర ఉపాధ్యక్షులు చలపతి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఉదయ్, ప్రవీణ్ నిరసనలకు నాయకత్వం వహించారు.
కర్నూలులో విద్యార్థి సంఘ నేతలపై చేయిచేసుకున్న సీఐ
కర్నూలు కలెక్టరేట్‌లోకి చొచ్చుకుని పోయేందుకు విద్యార్థులు ప్రయత్నించడంతో ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్‌జీ, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అద్యక్షకార్యదర్శులు సోమన్న, సాబీర్‌బాష, నాయకులు శరత్ రంగస్వామి, థామస్, వీరేష్ తదితరులను పోలీసులు అరెస్టుచేసి…మూడవ పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు. నాయకులను అరెస్టుచేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థులు పోలీసుల వాహనాన్ని అడ్డుకున్నారు. మొదట సీఆర్ భవన్ నుంచి అక్కడి కలెక్టరేట్ వరకు వందలాది మంది విద్యార్థులు ర్యాలీగా కలెక్టరేట్ చేరుకున్నారు. కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. విద్యార్థి సంఘం నాయకులు కలెక్టరేట్ గేట్లు ఎక్కి నిరసన తెలియచేశారు. పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు, విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. విద్యార్థి సంఘం నాయకులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకొని పోయేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టరేట్ గేటు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. తమ నాయకులను అరెస్టుచేయడం దుర్మార్గమని నినాదాలు చేశారు. దీంతో సీఐ విద్యార్థిసంఘం నాయకులపై చేయి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థులు మూడవ పట్టణ పోలీసుస్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. పోలీసులు విద్యార్థులపై చేయిచేసుకుంటున్న ఫోటోలు తీసిన పాత్రికేయుని సెల్‌ఫోన్ గుంజుకొని ఫొటోలు డిలీట్ చేశారు. పోలీసుస్టేషన్ వద్దకు కవరేజ్‌కోసం వెళ్లిన పాత్రికేయులను కూడా పోలీసులు స్టేషన్‌లోకి అనుమతి ఇవ్వలేదు. పాత్రికేయులైతే మాకేం అంటూ నిర్లక్ష్యంగా వ్యవహించారు. కాగా విద్యార్థిసంఘాల నాయకులపై కేసు నమోదు చేసిన పోలీసులు…సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. ఈ ఆందోళనలో భాగంగా శివారెడ్డి, బందెల నాసర్‌జీ, జి.వలరాజు మాట్లాడుతూ… రాష్ట్రప్రభుత్వం పెండిరగ్‌లో ఉన్న ఫీజురీయింబర్స్ మెంట్ ,స్కార్‌షిప్‌లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నత విద్యకు శాపంగా మారిన జీఎం 77ను రద్దుచేయాలని కోరారు.
డిగ్రీ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేయాలని, యువగళం పాదయాత్ర సందర్భంగా విద్యామంత్రి నారాలోకేశ్ విద్యార్థిలోకానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. యోగాంధ్ర పేరుతో నిధులు మళ్లించి ఖర్చుచేయడం సిగ్గుచేటన్నారు. విద్యారంగాభివృద్ధికి అధిక ప్రాధాన్యతివ్వాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టకోవాలని కోరారు.
అక్రమ కేసులు ఎత్తివేయాలి: సీపీఐ కర్నూలు జిల్లా కార్యదర్శ గిడ్డయ్య
ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థిసంఘం నాయకులపై పోలీసులు అక్రమ కేసు పెట్టి అరెస్టుచేయడం దుర్మార్గమని సీపీఐ కర్నూలు జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య ఒక ప్రకటనలో ఖండిరచారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై చేయిచేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. పోలీసులు వెంటనే ఏఐఎస్‌ఎఫ్ నాయకులపై పెట్టిన అక్రమ కేసు ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు.


