Homeజనమే మన బలం

జనమే మన బలం

- Advertisement -

ఆర్థికవనరు కూడా అదే
జనాభా నియంత్రణ కంటే నిర్వహణ అవసరం: సీఎం చంద్రబాబు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : దేశానికి బలమైన ఆర్థికవనరు జనాభేయేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జనాభా పెరుగుదలకు త్వరలో మంచి విధానం తీసుకొస్తామని తెలిపారు. దేశమంటే మట్టికాదోయ్‌ దేశమంటే మనుషులోయ్‌ అని చెప్పిన గురజాడ అప్పారావు స్ఫూర్తితో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జనాభా నిర్వహణ విధానం ప్రతి కుటుంబానికి ముఖ్యం-మీ అభిప్రాయం మార్గదర్శనం అనే భావనతో రూపొందించిన సర్వేను సీఎం ప్రారంభించారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించారు. సమైక్యాంధ్రలో జనాభా నియంత్రణను ఉద్యమంలా చేపట్టామని…ఇప్పుడు జనాభా నిర్వహణ అవసరమని చెబుతున్నానని సీఎం అన్నారు. అగ్రదేశాలతో భారత్‌ పోటీ పడుతోందంటే దానికి జనాభానే కారణమని అన్నారు. ‘ఒకప్పుడు జనాభా పెద్ద సమమ్యగా ఉండేది. 2004కు ముందు సీఎంగా ఉన్నప్పుడు జనాభా నియంత్రణకు ప్రోత్సాహకాలు ఇచ్చాను. ఇద్దరు పిల్లల కంటే ఎక్కుమంది ఉంటే స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులని చేస్తూ చట్టం తెచ్చాను. ఇప్పుడు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నవారు స్థానిక సంస్థల్లో పోటీకి అర్హులుగా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఏర్పడిరది. దేశం అంటే రాష్ట్రాలు, ప్రాంతాలు, పట్టణాలు, సరిహద్దులు, భూభాగాలు మాత్రమే కాదు, దేశం అంటే మనుషులు’ అని ముఖ్యమంత్రి అన్నారు.
మన బలం మానవ వనరులు
జనాభా ఉన్న దేశాలవైపే అగ్రరాజ్యాలు చూడాల్సి వస్తోంది. జనాభా ఎప్పటికీ భారం కాదు…అదే మనకు తిరుగులేని ఆస్తి. ఎక్కువ జనాభా ఉన్న మన దేశంలో అభివృద్ధి సాధ్యమా అనే పరిస్థతి నుంచి ఆ జనాభానే మనకు అడ్వాంటేజ్‌గా మారింది. 140 కోట్ల జనాభా కలిగి ఉన్న మన దేశం చైనాను కూడా వెనక్కు నెట్టింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జనాభాతో పాటు జననాల రేటు తగ్గిపోతోందని చంద్రబాబు అన్నారు. యువశక్తి తగ్గిపోయి వృద్ధులు పెరుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఏ దేశంలోనైతే వయోజన సమస్య వస్తుందో అక్కడ వృద్ధిరేటు నిలిచిపోతుందని సీఎం విశ్లేషించారు. పిల్లలను కనేవారికి కొన్ని దేశాలు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయన్న సీఎం … దేశాల వారీ అమలు జరుగుతున్న విధానాలను వివరించారు.
ఖర్చులు పెరుగుతున్నాయని పిల్లల్ని కనడం లేదు
జనాభా తగ్గిపోతే వృద్ధి రేటు పడిపోతుందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా పెరుగుదలపై సమావేశంలో పోల్‌ నిర్వహిస్తే ఇద్దరు పిల్లలుండాలని 67.41 శాతం మంది, ఒకరే ఉండాలని 12.34 శాతం మంది, ముగ్గురు పిల్లలుండాలని 19.88 శాతం మంది అభిప్రాయపడ్డారని వివరించారు. పిల్లలను కనడానికి యువత ఆస్తకి చూపడం లేదని, చాలా మంది భార్యాభర్తలు పిల్లలను వద్దనుకునే పరిస్థితికి వచ్చారన్నారు. ఖర్చులు పెరుగుతాయని పిల్నల్లి కనడానికి ఇష్టపడటం లేదని సీఎం అన్నారు. అలాగే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవని, రానురాను అవి కనుమరుగవుతున్నాయన్నారు.
ఆడ, మగ ఇద్దరూ సమానమే
తాను మహిళా పక్షపాతిని, కొందరు మగవాళ్లు ఇంటి బాధ్యత అంతా ఆడవాళ్లదే అన్నట్టు వ్యవహరిస్తారని, అది సమంజసం కాదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఆడ, మగ ఇద్దరూ సమానమేనని, మగవారితో సమానంగా మహిళలు పనిచేస్తున్నారని కితాబునిచ్చారు. సాఫ్ట్‌ వేర్‌ రంగంలో భర్తల కంటే భార్యల ఆదాయమే ఎక్కువ ఉందన్నారు.అనంతరం సీఎం కొద్దిసేపు సభికులతో ముఖాముఖి జరిపారు. జనాభా నిర్వహణపై అభిప్రాయాలు అడిగారు. ఈ క్రమంలో కొందరు తమ అభిప్రాయాలు చెప్పడంతో పాటు సందేహాలు వ్యక్తం చేయగా, వాటిని సీఎం నివృత్తి చేశారు.ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్‌ మహేంద్ర దేవ్‌, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌ కుమార్‌, మైనా మహిళా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ సుహానీ జలోటా, పబ్లిక్‌ హెల్త్‌ స్పెషలిస్ట్‌ ఎం.ప్రకాశమ్మ, ప్రొఫెసర్‌ సంజయ్‌ కుమార్‌, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు