సీఎం రేవంత్
విశాలాంధ్ర-హైదరాబాద్: రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవం… ఆకలి తీర్చే ఆయుధమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో సోమవారం సీఎం నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ… రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసంపేదవాడి పదేళ్ల ఎదురు చూపులు నేడు ఫలించబోతున్నాయన్నారు. రాష్ట్రంలో 5.61 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు, 3.10 కోట్ల మందికి ఆహార భద్రత, ఒక్కొక్కరికి ఆరు కేజీల ఉచిత సన్నబియ్యం… పేదల సంక్షేమంపై ఇది తమ వజ్ర సంకల్పం అన్నారు. నల్లగొండ చరిత్రే.. తెలంగాణ చరిత్ర అంటే అతిశయోక్తి కాదన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నా పేదలకు రేషన్ కార్డు, సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన బీఆర్ఎస్ నేతలకు రాలదన్నారు. తమ ప్రభుత్వం 3.10 కోట్ల మందికి సన్న బియ్యం ఇస్తే రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారులు బారులు తీరుతున్నారన్నారు. వ్యవసాయం దండగ కాదు… పండగ అని నిరూపించామన్నారు. గిట్టుబాటు ధరతో పాటు బోనస్ ఇచ్చినట్టు పేర్కొన్నారు. దేశం తెలంగాణ వైపు చూసేలా వరి ధాన్యం ఉత్పత్తి చేస్తున్నామన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు గోదావరి నీళ్లు ఇవ్వలేదు… ఇప్పుడు సీఎం వస్తే అడ్డుకుంటామంటున్నారని మండిపడ్డారు. గతంలో మూడు రోజులు అవకాశమిస్తే తుంగతుర్తికి జలాలు తెస్తామన్నారు… పదేళ్లు అవకాశం ఇచ్చినా దేవాదుల నుంచి నీళ్లు తేలేదు అని రేవంత్ విమర్శించారు.
రేషన్ కార్డు… పేదవాడి ఆకలితీర్చే ఆయుధం
- Advertisement -


