Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రతి సమస్యకు పరిష్కారం చూపించే వరకు విశ్రమించం..

ప్రతి సమస్యకు పరిష్కారం చూపించే వరకు విశ్రమించం..

- Advertisement -

పరిటాల శ్రీరామ్
విశాలాంధ్ర ధర్మవరం;ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు పరిష్కారం చూపించే వరకు విశ్రమించమని.. ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా పరిటాల శ్రీరామ్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం వినూత్నంగా ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు మరో కొత్త ఆలోచన చేశారు. మీ సమస్య-మా బాధ్యత అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ధర్మవరం పట్టణంలోని శివానగర్, కేశవ నగర్లలో ఈ కార్యక్రమాన్ని మొదటగా ప్రారంభించారు. ముందుగా పరిటాల శ్రీరామ్ శివానగర్ లోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. కేశవ నగర్ లో కూడా గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలను ఓపిగ్గా విన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపించాలని పరిటాల శ్రీరామ్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో తమ దృష్టికి అనేక సమస్యలు వచ్చాయని, వాటి పరిష్కారానికి కచ్చితంగా తాము కృషి చేయాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. ప్రజల నుంచి అర్జీల రూపంలో స్వీకరించి వాటిని పూర్తిస్థాయిలో పరిష్కరించాలన్నదే తమ లక్ష్యం అన్నారు. గతంలో గ్రీవెన్స్ లు ఉన్నప్పటికీ కూడా అధికారులపై పూర్తి బాధ్యత పెడుతున్నారన్నారు. ప్రతిరోజు అధికారులకు వచ్చే సమస్యల వలన అవి మరుగున పడే అవకాశం ఉందన్నారు. అందుకే ప్రజల నుంచి ప్రతి ఫిర్యాదుకు స్థానికంగా ఉండే నాయకులు బాధ్యతలు తీసుకొని అవి పరిష్కారమయ్యేవరకు చూస్తారన్నారు. సచివాలయ స్థాయిలో పరిష్కారమయ్యేవి స్థానికంగానే చూస్తామన్నారు. అలాగే నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు తీసుకెళ్లాల్సిన వాటి గురించి ఒక ప్రణాళిక ప్రకారం పని చేస్తామని వివరించారు. ఇప్పటి వరకు పింఛన్ల సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయన్నారు. పింఛన్లు అర్హత లేని వారికి ఎక్కువగా వస్తున్నాయని, అలాగే అర్హత ఉండి కూడా ఇవ్వడం లేదన్నవి వచ్చాయన్నారు. హౌస్ మ్యాపింగ్ విషయంలో గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఇప్పుడు ప్రజలకు ఇబ్బందిగా మారిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగి ఒకే రేషన్ కార్డులో ఉన్నారన్న కారణంతో.. చాలా మందికి పథకాలు అందడం లేదన్నారు. హౌస్ మ్యాపింగ్ అంశాన్ని రాష్ట్రస్థాయిలో అధికారులతో చర్చిస్తామన్నారు. అలాగే గతంలో ఇంటి పట్టాలు ఇచ్చి తర్వాత వాటిని రద్దు చేసి,మరొకరికి ఇచ్చారన్నారు. వీటితో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా జరిగిందన్నారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు వారు తెలిపారు. మరోవైపు అమరావతి గురించి మాట్లాడే నైతిక హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ, జగన్ మోహన్ రెడ్డికి కానీ లేదన్నారు. అసలు ఏడాదిలో అమరావతిలో ఎలాంటి అభివృద్ధి జరిగిందన్నది వారి ఎమ్మెల్యేలతో కలిసి ఒక టూర్ ఏర్పాటు చేసుకుంటే తెలుస్తుందన్నారు. ఏడాది కాలంలో అమరావతిలో ఎంతో అభివృద్ధి జరిగిందని అది వారు అక్కడికి వెళ్లి చూస్తేనే అర్థమవుతుందని శ్రీరామ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్, జూనియర్ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు