. శ్రీశైలం, సాగర్ గేట్లు ఎత్తివేత
. పులిచింతలకు భారీ ప్రవాహం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం వస్తోంది. దీంతో ఆరు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి స్పిల్‌వే ద్వారా నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం జలాశయానికి 2,29,743 క్యూసెక్కులు చేరుతోంది. శ్రీశైలం నుంచి ఔట్ ఫ్లో 2,89,670 క్యూసెక్కులుగా ఉంది. ఎనిమిది స్పిల్ వే గేట్ల ద్వారా 12,91,229 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 20,000 క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,643 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 204.78 టీఎంసీలుగా కొనసాగుతోంది. ఒక ఎగువ నుంచి వస్తున్న భారీ వరద ప్రవాహంతో నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్లు ఎత్తి 2,48,215 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 590.00 (312.04 టీఎంసీలకు) అడుగులకు గాను ప్రస్తుతం 586.60 అడుగులకు చేరింది. ప్రాజెక్టు గేట్లు ఎత్తిన నేపథ్యంలో దిగువ భాగంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 18 ఏళ్ల తర్వాత నెల ముందుగానే నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేయడం ఇదే తొలిసారి. గేట్లు ఎత్తడంతో ప్రాజెక్టు అందాలను తిలకించడానికి ప్రజలు పెద్ద ఎత్తున శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యామ్‌లకు తరలివస్తున్నారు. సాగర్ నుంచి పులిచింతల ప్రాజెక్టుకు 2,18,473 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, 65,613 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్టు సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 32 టీఎంసీలకు చేరింది. ఇక దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజీకి ప్రస్తుతం 13 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, ఆ మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల నిండితే వరద పెరిగే అవకాశం ఉన్నందున దిగువ ప్రాంతాలను నీటి పారుదల శాఖాధికారులు అప్రమత్తం చేశారు.


