ఉచిత బస్సు ప్రయాణం… ఆడబిడ్డలకు వరం
. చిత్తూరు నుంచి శ్రీకాకుళం, ఉండవల్లి నుంచి విజయవాడ వరకు ఫ్రీ సర్వీస్
. పథకం ప్రారంభించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, మాధవ్
. మహిళలతో కలిసి బస్సులో ప్రయాణం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ‘స్త్రీశక్తి’ పథకం ద్వారా మహిళలకు ఆర్థిక చేయూత లభిస్తుందని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన రోజున స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని, మహిళలకు మేలు చేస్తున్నామన్న సంతృప్తి కలుగుతోందన్నారు. రాష్ట్ర మహిళలందరూ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యంతో వారికి ఆర్థిక స్వాతంత్య్రం లభిస్తుందని, మహిళలకు గౌరవం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు. సూపర్ 6 హామీల్లో ప్రతిష్టాత్మక స్త్రీశక్తి పథకాన్ని ఉండవల్లి నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్‌తో కలిసి చంద్రబాబు ప్రారంభించారు. బస్సులో ప్రయాణించే మహిళలకు జీరో ఫేర్ టికెట్ అందించారు. ఉండవల్లి నుంచి విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు ప్రయాణించారు. దారి పొడవునా వివిధ బస్ స్టాప్‌లలో ప్రజలు, ప్రత్యేకించి మహిళలు స్వాగతం పలికారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్‌తో కరచాలనం చేసేందుకు బస్సు వెంబడి పరుగులు పెట్టారు. ప్రయాణిస్తున్నంత సేపు బస్సులోని మహిళలతో నాయకులు మాట్లాడారు. వాళ్ల స్థితిగతులు తెలుసుకున్నారు. ఉచిత బస్ ప్రయాణం వల్ల కలిగే మేలు గురించీ ఆరా తీశారు. విజయవాడ బస్టాండ్‌కు చేరుకుని అక్కడ బహిరంగ సభలో పాల్గొన్నారు. ‘ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. ఆడబిడ్డలకు ఇచ్చిన హామీని నెరవేర్చాం. ఒకప్పుడు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు కొన్ని సీట్లు రిజర్వు చేసే విధానం చేశాం. ఇప్పుడు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం. ఇకపై ప్రతి ఆడబిడ్డ రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. మిత్రుడు పవన్ కల్యాణ్‌తో కలిసి బస్సులో ప్రయాణించాను. దారి పొడవునా మహిళలతో మాట్లాడాను. వారి మాటలు వింటే మంచి చేశామన్న సంతృప్తి కలిగింది’ అని చంద్రబాబు అన్నారు. ‘ఉచిత బస్సు ప్రయాణం ఆడబిడ్డలకు అన్నగా నేను ఇస్తున్న వరం’ అని చెప్పారు. ‘రాష్ట్రంలోని 2.62 కోట్ల మంది మహిళలకు ఈ పథకంతో లబ్ధి చేకూరుతుంది. నెలకు రూ.162 కోట్లు, ఏడాదికి రూ.1,942 కోట్లు వ్యయం చేస్తున్నాం. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డనరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులలో ఎంత దూరం వెళ్లినా రూపాయి చెల్లించనక్కర్లేదు. ఏపీఎస్ ఆర్టీసీ ప్రస్తుతం 11,449 బస్సులు నిర్వహిస్తుండగా, అందులో 8,458 బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే వీలు కల్పించాం. స్త్రీ శక్తి పథకం ద్వారా 74శాతం బస్సుల్లో మహిళలు ఉచితంగా వెళ్లవచ్చు. ప్రతీ తల్లీ అత్తింటిలోని తన కూతుర్ని ఉచిత బస్సులో వెళ్లి చూసి రావొచ్చు. ప్రతీ కోడలూ, అత్తతో కలిసి ఉచిత బస్సులో మార్కెట్‌కు వెళ్లి రావొచ్చు. ప్రతి మహిళా, ప్రతి యువతీ ఉద్యోగానికి, విధులకు ఛార్జీ లేకుండా వెళ్లవచ్చు. వృద్దులు హాయిగా దేవాలయాలకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లవచ్చు. చిరు వ్యాపారులు వారి ఉత్పత్తులకు డిమాండ్ ఉన్న ప్రాంతానికి వెళ్లి మంచి ధరకు అమ్ముకోవచ్చు. నరేగా పనులకు, కూలీ పనులకు వెళ్లే మహిళలు ఉచిత ప్రయాణం చేసి డబ్బు ఆదా చేయొచ్చు’ అని సీఎం అన్నారు. ‘ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు ఆర్థిక భరోసా లభిస్తుంది. ఆస్పత్రులు, స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, మార్కెట్ కోసం పట్టణాలకు వెళ్లే వారికి నిజమైన ఆర్ధిక శక్తిగా ఈ పథకం ఉంటుంది. మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నారు, టిక్కెట్ ధర రాయితీ ఎంత వంటి వివరాలతో టికెట్ ఇస్తారు. ధరతో నిమిత్తం లేకుండా 100 శాతం రాయితీ కల్పిస్తున్నాం. ఈ పోస్ మిషన్ ద్వారా ‘జీరో ఫేర్ టికెట్’ వస్తుంది’ అని చంద్రబాబు వివరించారు. పథకం అమలులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఆర్టీసీ సామర్ధ్యాన్ని పెంచుతున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 129 డిపోలు, 423 బస్ స్టేషన్లు, 4 జోనల్ వర్క్‌షాపులు…ఇలా మొత్తం వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. బస్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి గమ్యం చేరే వరకు బ్రేక్‌డౌన్‌లు ఉండవంటూ సీఎం భరోసానిచ్చారు. స్త్రీశక్తి అమలుపై ఎప్పటికప్పుడు ప్రజల అభిప్రాయాలు తీసుకుంటూ… పథకాన్ని మెరుగుపరుస్తామని చెప్పారు.
బస్ స్టేషన్లు పరిశుభ్రంగా ఉంచుతున్నామని, పీఎం-ఈ బస్ సేవా పథకం కింద 11 ప్రధాన నగరాల్లో త్వరలో 1,050 ఎలక్ట్రిక్ బస్సులు తెస్తున్నామని,పార్సిల్ సర్వీస్ ద్వారా అధిక ఆదాయం తెస్తున్నామని చంద్రబాబు తెలిపారు. డోర్ డెలివరీ, డోర్ పికప్ సర్వీసులు పెంచుతామన్నారు. ఏ పనినైనా యజ్ఞంలా చేస్తున్నా, కొందరు రాజకీయ లబ్ధి కోసం విషం చిమ్ముతున్నారని సీఎం చెప్పారు. అమరావతిని స్మశానం, ఎడారి అన్నారని, కేంద్ర సహకారంతో అమరావతి, పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. 30 ఏళ్ల తర్వాత ఓటేశానని, అందరికీ దండాలు అని బ్యాలెట్‌లో ఓ వ్యక్తి రాశాడంటూ గుర్తుచేశారు. మహిళలకు ఆస్తి హక్కును ఎన్టీఆర్ కల్పించారని, తిరుపతిలో మహిళా విశ్వ విద్యాలయం ఏర్పాటు చేశారని, స్థానిక సంస్థల్లో తొమ్మిది శాతం రిజర్వేషన్లు కల్పించారని చంద్రబాబు తెలిపారు.
మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడం కోసం డ్వాక్రా తెచ్చానని, ఆర్టీసీ కండక్టర్లుగా మహిళలను పెట్టామన్నారు. 64 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తున్నామని, ఇందుకోసం ఏడాదికి రూ.33,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఈనెలాఖరుకు 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని, గత ఐదేళ్లు ప్రజలను వేధించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని, 204 అన్నా క్యాంటిన్ల ద్వారా 5.16 కోట్ల మందికి రూ.5కే కడుపు నింపామని చంద్రబాబు తెలిపారు.


